Financial Planning: ఆర్థిక ప్ర‌ణాళికను ఎప్పుడు స‌మీక్షించాలి?

ఆర్థిక ప్ర‌ణాళిక స‌మీక్షించుకోవ‌డం వ‌ల్ల మీ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా పెట్టుబ‌డులు, ఇత‌ర విష‌యాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయ‌వ‌చ్చు. 

Updated : 20 Sep 2022 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భ‌విష్య‌త్‌ ఆర్థిక ల‌క్ష్యాల సాధన కోసం పెట్టుబ‌డులు పెడుతుంటాం. అయితే ల‌క్ష్యం కోసం కావాల్సిన డ‌బ్బు స‌రైన స‌మ‌యంలో చేతికందాలంటే మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక అవ‌స‌రం. నెల నెలా వ‌చ్చే ఆదాయం, చేసే ఖ‌ర్చులు, ఆదా చేసే మొత్తం, మ‌దుపు చేసే మొత్తం.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకోవాలి. ఒక‌సారి ఆర్థిక ప్ర‌ణాళిక వేసిన త‌ర్వాత త‌ర‌చుగా స‌మీక్షించ‌డం స‌రికాద‌ని కొంత‌మంది స‌ల‌హా ఇస్తుంటారు. ఇది కొంత వ‌ర‌కు నిజ‌మే అయిన‌ప్ప‌ట‌కీ, ఏళ్ల త‌ర‌బ‌డి స‌మీక్షించ‌క‌పోవ‌డమూ స‌రికాదు.

ఎంత జాగ్ర‌త్త‌గా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ప్ప‌కీ కాల‌క్ర‌మంలో ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌ణాళిక దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉంటాయి. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు మార‌డం, న‌గ‌దు ప్ర‌వాహంలో మార్పులు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ సంవ‌త్స‌రం వేసిన ఆర్థిక ప్ర‌ణాళిక రెండేళ్ల త‌ర్వాత స‌రిప‌డ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి త‌ర‌చుగా కాక‌పోయినా, ఏడాదికోసారి, కొన్ని ముఖ్య‌మైన సంద‌ర్భాల్లోనూ ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షిస్తుండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయంలో మార్పు..

చాలా వ‌ర‌కు సంస్థ‌లు వార్షిక ప్రాతిప‌దిక‌న జీతం పెంచుతుంటాయి. ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించుకునేందుకు ఇదొక ముఖ్య సంద‌ర్భంగా చెప్పుకోవ‌చ్చు. సంవ‌త్స‌రానికి ఒక‌సారి జీతంలో పెంపు వ‌చ్చిన‌ప్పుడు ఆర్థిక ప్ర‌ణాళిక స‌మీక్షించుకోవ‌డం వ‌ల్ల పెట్టుబ‌డుల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయ‌వ‌చ్చు. ఒక్కోసారి ప‌దోన్నతి, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగం కోల్పోవ‌డం, సుదీర్ఘ విశ్రాంతి, ముందస్తు పదవీ విరమణ వంటి పెద్ద  మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఇవి ఆదాయాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తాయి. అటువంటి సంద‌ర్భంలో ఆర్థిక ప్ర‌ణాళిక‌ను నిశితంగా స‌మీక్షించాల్సి ఉంటుంది. ప‌దోన్న‌తి, ఉద్యోగం మారిన‌ప్పుడు జీతం బాగా పెరిగే అవ‌కాశం ఉంటుంది.  అలాంటప్పుడు దానికి అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, క‌ష్ట స‌మ‌యాల్లో ఖ‌ర్చులు, పెట్టుబ‌డుల‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.

మైలురాళ్లు..

వివాహం, పిల్ల‌లు జ‌న్మించ‌డం, పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, గృహ కొనుగోలు, ప‌ద‌వీవిర‌మ‌ణ వంటివి చాలా మంది జీవితంలో ముఖ్య‌మైన మైలురాళ్లు. ఇలాంటివి చేరుకున్న‌ప్పుడు మీ ప్రాధాన్యాల్లో మార్పులు రావ‌చ్చు. కాబ‌ట్టి ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించుకోవ‌డం అవ‌సరం. ఉదాహ‌ర‌ణకు.. మీరు ఒంట‌రిగా జీవిస్తున్న‌ప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండ‌వ‌చ్చు. వివాహం చేసుకుని పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత సొంత ఇల్లు, కారు కొనుగోలు, పిల్ల‌ల ఉన్న‌త విద్య వంటివి మీ ప్రాధాన్య‌త‌లు కావ‌చ్చు. ఈ ల‌క్ష్యాల సాధ‌న కోసం పెట్టుబ‌డులు పెట్టేందుకు మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించుకోవడం అవ‌స‌రం.

ఇది కేవ‌లం పెట్టుబ‌డుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. బీమా, విల్లు ఏర్పాటు చేయ‌డం వంటి విష‌యాల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ఉంద‌నుకుంటే, వివాహం అయ్యి, పిల్ల‌లు జ‌న్మిస్తే కుటుంబం పెరుగుతుంది. వ్య‌క్తిగ‌త పాల‌సీని ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీగా మార్చ‌వ‌ల‌సిన అవ‌స‌రం వ‌స్తుంది. కాబ‌ట్టి ఆర్థిక ప్రణాళిక స‌మీక్ష అవ‌స‌రం ఉంటుంది.

పెద్ద కొనుగోళ్లు, రుణాలు..

గృహ కొనుగోలు అనేది పెద్ద నిర్ణ‌యంగా చెప్పుకోవ‌చ్చు. గృహ కొనుగోలుకు పెద్ద మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం కాబ‌ట్టి చాలా మంది రుణం తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే, ఇలాంటి రుణాలు తీసుకున్న‌ప్పుడు ప్ర‌తి నెలా ఈఎంఐ చెల్లింపులు మొద‌ల‌వుతాయి. కాబ‌ట్టి, గ‌తంలో మాదిరిగా పెట్టుబ‌డులు చేయ‌లేక‌పోవ‌చ్చు. అందువ‌ల్ల ఇటువంటి పెద్ద రుణాలు తీసుకునే ముందే ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించ‌డం అవ‌స‌రం.

జీవ‌న శైలి, ప్రాణాంత‌క‌ వ్యాధులు..

మారుతున్న జీవన‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంణా వ్యాధుల బారిన ప‌డే వారి సంఖ్య ఎక్కువైంది. ముఖ్యంగా ప్రాణాంత‌క వ్యాధులు నిర్థార‌ణ అయిన‌ప్పుడు ఆసుప‌త్రి చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌తో కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి త‌ల‌కిందులు కావ‌చ్చు. ఆరోగ్య బీమా ఉన్న‌ప్ప‌టికీ ఇత‌ర ఖ‌ర్చులు ఉండ‌వ‌చ్చు. అలాగే, అనారోగ్యం కార‌ణంగా ప‌నిచేయ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డి ఆదాయం త‌గ్గ‌వ‌చ్చు. దీంతో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ‌వ‌చ్చు. కాబ‌ట్టి, ఇటువంటి సంద‌ర్భాల్లో ఆర్థిక ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించ‌డం అవ‌స‌రం.

చివ‌రిగా

ఆర్థిక ప్ర‌ణాళిక ఒక రోజు, ఒక నెల‌, ఒక ఏడాదిలోనో పూర్త‌య్యేది కాదు. ఒకే విధంగానూ ఉండ‌దు. మారుతున్న కాలం, అవ‌స‌రాలు, జీవితంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల ఆధారంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వీటికి త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక‌లో కూడా మార్పులు చేయ‌క త‌ప్ప‌దు. అవ‌స‌ర‌మైతే  ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకుని ప్ర‌ణాళిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం ద్వారా ఆర్థిక విజ‌యం సాధించవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని