Debit / Credit Card Usage: పిల్ల‌ల‌కు డెబిట్/ క్రెడిట్ కార్డ్‌ను ఇవ్వొచ్చా?

భార‌త్‌లోని కొన్ని బ్యాంకులు పిల్ల‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగా డ‌బ్బు, పొదుపు, ఖ‌ర్చులు గురించి కొంత అనుభ‌వం క‌లిగించ‌డానికి డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాల‌ను అందిస్తున్నాయి.

Updated : 14 Aug 2022 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను పిల్ల‌ల‌కు ఇస్తే.. వారు ఖ‌ర్చుల‌ను, ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌రా? అనే అనుమానం చాలా మంది త‌ల్లిదండ్రుల‌కు ఉంటుంది. కానీ పిల్ల‌ల‌కు ఆర్థిక పాఠాలు నేర్ప‌డం, నేర్చుకునేటట్లు చేయ‌డం త‌ప్పుకాదు. పిల్ల‌ల‌కు డ‌బ్బు గురించి చిన్న వ‌య‌స్సు నుండే తెలుసుకునేలా చేయ‌డం ఎంతైనా అవ‌స‌రం ఉంది. పిల్ల‌ల‌కు పొదుపు, పెట్టుబ‌డి ప్రాముఖ్య‌త అనేది ఒక ముఖ్య‌మైన పాఠం లాంటిది. ఇది ప్రారంభ ద‌శ‌లోనే ఉండాలి. ఇది పెట్టుబ‌డికి సంబంధించిన ప్రాథ‌మిక విష‌యాల‌ను అర్థం చేసుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

మునుప‌టి త‌రాల‌కంటే నేటి పిల్ల‌లు టెక్నాల‌జీ ప‌రంగా చాలా వేగంగా ఉన్నారు. కానీ ఆర్థిక ప‌ర‌మైన‌, డ‌బ్బుల విష‌యాల‌కొస్తే వారు పెద్ద‌ల నుంచి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా పొదుపునకు సంబంధించిన ప్రాముఖ్య‌ం గురించి బాగా తెలుసుకోవాలి. వీటి దృష్ట్యా ఒక‌రు త‌మ పిల్ల‌ల‌కు సొంతంగా డెబిట్‌, క్రెడిట్ కార్డును సొంతంగా నిర్వ‌హించుకునేలా చేయాలా అనేది చ‌ర్చ‌నీయాంశ‌మే.

భార‌త్‌లోని కొన్ని బ్యాంకులు పిల్ల‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగా డ‌బ్బు, పొదుపు, ఖ‌ర్చులు గురించి కొంత అనుభ‌వం క‌లిగించ‌డానికి డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాల‌ను అందిస్తున్నాయి. అయితే 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వారికి బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లు అనుమ‌తించ‌వు. ఈ రోజుల్లో కొన్ని కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పిల్ల‌ల కోసం ప్రీపెయిడ్ కార్డుల‌ను అందిస్తున్నాయి. వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఖ‌ర్చుల కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఎలా ఉప‌యోగించాలో పిల్ల‌ల‌కు నేర్పించ‌డం తెలివైన ప‌ని అని ప‌లువురు నిపుణులు పేర్కొన్నారు.

పిల్ల‌ల‌కు వ‌య‌స్సుకి త‌గిన ఆర్థిక బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం వివేక‌వంత‌మైన ప‌నే అని చెప్పాలి. త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌గ‌దు లేదా కార్డ్‌ల‌తో ఆర్థికప‌ర‌మైన ప‌నుల‌ను పిల్ల‌ల‌తో చేయించ‌డం నిజంగా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. పొదుపు, పెట్టుబ‌డి ప్రాముఖ్య‌త అనేది పిల్ల‌ల‌కు నేర్పించ‌వ‌ల‌సిన ముఖ‌మైన విష‌య‌మే, దీనిని అనుభ‌వ‌పూర్వ‌కంగా పిల్ల‌లు తెలుసుకునేలా చేయాలి. కాని పిల్ల‌ల‌కు డెబిట్, క్రెడిట్ కార్డ్ క‌లిగి ఉండ‌నివ్వ‌డం వ‌ల్ల కొన్ని లాభాలు, న‌ష్టాలు ఉన్నాయి.

ఆర్థిక అల‌వాట్ల‌ను పెంపొందించ‌డానికి, డ‌బ్బు ఆదా చేసే భావ‌న‌ను వారికి ప‌రిచ‌యం చేయ‌డానికి ఇది మంచి మార్గం. కొన్ని లావాదేవీల‌లో క‌లిగే ఇబ్బందులు, సానుకూల‌త‌లు పిల్ల‌ల‌కు బాగా తెలిసి వ‌స్తాయి. ఈ కార్డుల వ‌ల్ల పొదుపు అల‌వాట్ల‌ను చెప్ప‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా, ఆచ‌రించే స‌మ‌యానికి వ‌చ్చేట‌ప్ప‌టికీ చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు అధికంగా ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప‌రిణామాల‌ను ప‌ర్య‌వేక్షించి స‌రిచేయ‌క‌పోతే మంచి కంటే ఎక్కువ హాని జ‌ర‌గ‌వ‌చ్చు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించేందుకు అనువైన మార్గంలో అవ‌గాహ‌న క‌ల్పించాలి. తెలివిగా, జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేసేలా ప‌ర్య‌వేక్షించాలి.

అయితే పిల్ల‌ల‌కు డెబిట్ కార్డుని ఇవ్వ‌వ‌చ్చు గానీ క్రెడిట్ కార్డు ఇవ్వ‌కూడ‌దు అని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక త‌ల్లిదండ్రుల‌కు ద‌గ్గ‌ర‌గా నివ‌సించే పిల్ల‌ల‌కు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ అవ‌స‌రమే లేద‌ని కొంత‌మంది అంటున్నారు. అయితే నిర్ణీత ప‌రిమితిలోపు వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల కోసం నిర్దిష్ట వ‌య‌స్సు కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు (16 ఏళ్లు అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు) క్రెడిట్ /డెబిట్ కార్డ్ ఇవ్వ‌వ‌చ్చ‌ని అయితే పిల్ల‌లు చేస్తున్న ఖ‌ర్చులు, ప‌రిమితిపై ఎప్ప‌టిక‌ప్పుడు తల్లిదండ్రులు స‌మీక్షించాలి అంటున్నారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు ఆర్థిక విష‌యాల‌ను న్యాయ‌బ‌ద్ధంగా ఎలా ఉప‌యోగించాలో నేర్పించ‌గ‌లిగితే డెబిట్‌/క‌్రెడిట్ కార్డులు ప్ర‌భావం పిల్ల‌ల‌కు సానుకూలంగానే ఉంటుంద‌ని నిపుణుల అభిప్రాయం.

ఈ కాలంలో పిల్ల‌లు టెక్నాల‌జీని అర్థం చేసుకోవ‌డంలో, ఉప‌యోగించ‌డంలో చాలా ముందంజ‌లో ఉన్నారు. వారు బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ సాధ‌నాలు ట్రాక్ చేయ‌డం, నెలావారీ ఖ‌ర్చుల కోసం ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌డం, అవ‌స‌రాల‌కు మొబైల్ ఫోన్ ఉప‌యోగించి సుర‌క్షిత‌మైన డెబిట్ కార్డు చెల్లింపులు చేయ‌డం లాంటివి చేయ‌వ‌చ్చు. న‌గ‌దుతో అదే ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, డెబిట్ కార్డ్‌ల‌తో, డిజిట‌ల్ చెల్లింపులు త్వ‌ర‌గా మ‌రింత సాధార‌ణ చెల్లింపు ప‌ద్ధ‌తిగా చేయ‌వ‌చ్చు.

డెబిట్ కార్డుతో పిల్ల‌ల‌కు ఖ‌ర్చు నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డానికి స్వేచ్ఛ ఉన్నా కూడా త‌ప్పుల నుంచి నేర్చుకోవ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. ఉదా: పిల్ల‌లు మీ స‌ల‌హాకు విరుద్ధంగా కొత్త వీడియో గేమ్ సిస్ట‌మ్‌లో త‌మ పాకెట్ మ‌నీ మొత్తాన్ని ఖ‌ర్చు చేసేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత వారు ఆ ప‌ని చేసినందుకు చింతించొచ్చు. కానీ వారు దాని నుంచి గుణ‌పాఠం నేర్చుకుంటే, దానిని పున‌రావృతం చేయ‌కుండా ఉంటే అది విలువైన పాఠం అవుతుంది. పిల్ల‌ల‌కు ప్రీపెయిడ్ కార్డ్‌లు ఇవ్వ‌డం మంచి ఎంపిక‌, ఎందుకంటే అవి అధిక ఖ‌ర్చుల‌ను నివారిస్తాయి. ఎందుకంటే పిల్ల‌లు కార్డ్‌పై ఉన్న డ‌బ్బును మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌గ‌ల‌రు. అయిన‌ప్ప‌టికీ, పిల్ల‌ల ఖ‌ర్చును ప‌రిమితం చేయ‌డం, వారి కార్డ్ బ్యాలెన్స్‌ను ప‌ర్య‌వేక్షించ‌డంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని