జీవిత బీమా పాలసీలలో ఏది మంచిది?

బీమా అనేది కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారి మీద ఆధారపడి జీవించే వారికి ఆర్ధిక భద్రతను కల్పిస్తుంది

Published : 20 Dec 2020 19:14 IST

జీవిత బీమా అనేది మీ జీవితానికి ఏదైనా నష్టం కలిగితే వచ్చే కవరేజ్ మాత్రమే. ఒకవేళ పాలసీదారుడికి మరణం సంభవించినట్లయితే, పాలసీలో ఉన్న హామీ మొత్తాన్నీ నామినీకి చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు, ప్రజలు ఇప్పటికీ జీవిత బీమాను పెట్టుబడి మార్గంగా మాత్రమే చుస్తున్నారు కానీ, బీమాగా చూడడం లేదు. బీమా అనేది కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారి మీద ఆధారపడి జీవించే వారికి ఆర్ధిక భద్రతను కల్పిస్తుందని అర్థం చేసుకోలేక పోతున్నారు. దీనిని వారికి అందే చివరి ప్రయోజనంగా చూస్తారు.మ‌రోక విషయం ఏంటంటే బీమా పాలసీ గడువు ముగిసిన తరువాత వారు జీవిస్తుంటే అప్పుడు వ‌చ్చే ,వచ్చే డబ్బు కోసం చూస్తుంటారు.

పెట్టుబడి, బీమా పాలసీల గురించి చూద్దాం…

ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలపై ఎక్కువ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఈ పాలసీల ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే పాలసీ తాలూకా హామీ మొత్తం నామినీకి అందుతుంది. అలాగే ఒకవేళ మరణం సంభవించకపోతే పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా హామీ మొత్తంతో పాటు కొంత మొత్తం అదనంగా పాలసీదారుడికి లభిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది ఇలాంటి పాలసీలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పాలసీ కాలపరిమితి ముగిసిన అనంతరం ఎలాంటి మొత్తం తిరిగి రాకపోతే అలాంటి పాలసీ ప్రీమియంలు చెల్లించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే మన దేశంలో ప్రజలు టర్మ్ బీమా పాలసీలపై ఆసక్తి చూపడం లేదు. చాలా మందికి ఇప్పటికీ బీమా లేకపోవడానికి కూడా ఇదో కారణం. మన దేశంలో చాలా మందికి టర్మ్ బీమా పాలసీ ఉందన్న విషయం కూడా తెలియదు. దీనికి ప్రధాన కారణం బీమా ఏజెంట్లు. వీరు టర్మ్ బీమా పాలసీ గురించి పాలసీదారులను వివరించరు. ఎందుకంటే టర్మ్ బీమా పాలసీలో వచ్చే కమీషన్ మిగిలిన పాలసీలలో వచ్చే కమీషన్ కంటే తక్కువగా ఉంటుంది.

జీవిత బీమా అనేది కుటుంబ పెద్ద పై ఆధారపడి జీవించే వారికి మంచి కవరేజ్ ను అందిస్తుంది. ఇదే జీవిత బీమా ముఖ్య లక్ష్యం.

ఉదాహరణ:

రాజేష్ అనే వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. అతని జీతం నెలకు రూ. 20000. అతని మీద తల్లిదండ్రులు, భార్య ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను తన జీతంలో సంవత్సరానికి గరిష్టంగా 10 శాతంను బీమా ప్రీమియం చెల్లింపుకు వినియోగించవచ్చు.

రాజేష్ 2018 సంవత్సరంలో 20 సంవత్సరాల కాల పరిమితికి గాను రూ.10 లక్షల ఎండోమెంట్ పాలసీని తీసుకున్నాడు.

అతను 2018 - 2038 మధ్య చనిపోతే, అతని కుటుంబానికి రూ .10 లక్షలు లభిస్తుంది.
అతను 2038 వరకు బ్రతికి ఉంటే, అతను హామీ మొత్తమైన రూ. 10 లక్షలు పొందుతాడు.
నెలకు ప్రీమియం = రూ. 2,000
సంవత్సరానికి ప్రీమియం = రూ. 24,000
లైఫ్ కవర్: రూ.10 లక్షలు

ఇక్కడ పరిశీలించ్చాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు…

  • అతను ప్రస్తుతం చాలా తక్కువ జీవిత బీమాను కలిగి ఉన్నాడు. రూ.10 లక్షల లైఫ్ కవరేజ్ చాలా తక్కువనే చెప్పాలి.అతనిపై ఆధారపడి జీవించే వారు ఉన్నారు కాబట్టి అతనికి కనీసం రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల కవరేజ్ అవసరమవుతుంది.

  • నెలకు రూ. 2,000 లేదా సంవత్సరానికి రూ. 24,000 ప్రీమియం చెల్లించడం తనకు ఆర్థికంగా భారం కావచ్చు.

  • అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి ప్రమాదం జరగకపోతే అతను 20 సంవత్సరాల తరువాత అంటే 2038వ సంవత్సరంలో రూ.10 లక్షలు పొందుతాడు. కానీ 2038 సంవత్సరంలో రూ.10 లక్షల విలువ చాలా తక్కువగా ఉంటుంది.

  • దీని ప్రకారం రాజేష్ 20 సంవత్సరాల తరువాత ఎలాంటి లాభం పొందలేడు.

రాజేష్ ఎండోమెంట్ పాలసీకి బదులుగా టర్మ్ బీమా పాలసీ తీసుకున్నట్లయితే అతని అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. టర్మ్ పాలసీ తీసుకుంటే, అతను తక్కువ ప్రీమియంతో చాలా ఎక్కువ కవరేజ్ ను పొందవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వంటి మెరుగైన పెట్టుబడి మార్గాలలో మిగులు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. రాజేష్ 30 సంవత్సరాల కాల పరిమితికి గాను రూ.30 లక్షల టర్మ్ పాలసీని తీసుకున్నట్లైతే సంవత్సరానికి రూ. 6,000 ప్రీమియంగా చెల్లించవలసి ఉంటుంది.

టర్మ్ పాలసీ తీసుకోవడం ద్వారా రాజేష్ సంవత్సరానికి రూ. 24,000 లకు బదులుగా కేవలం రూ. 6,000 లను చెల్లించి 30 సంవత్సరాలకు గాను రూ.30 లక్షల కవరేజ్ని పొందవ‌చ్చు. ఇలా చేయడం ద్వారా ఏడాదికి మిగిలిన రూ.18,000 లను నెలకు రూ. 1500 చొప్పున 20 సంవత్సరాలకు గాను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టినట్లయితే సుమారు 10 శాతం నుంచి 20 శాతం రాబ‌డితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

20 సంవత్సరాల తరువాత పెట్టుబడి విలువ ఈ విధంగా ఉంటుంది:

రూ.11.40 లక్షలు (10 శాతం రాబడి)
రూ.14.85 లక్షలు (12 శాతం రాబడి)
రూ.22.45 లక్షలు (15 శాతం రాబడి)
రూ.46.65 లక్షలు (20 శాతం రాబడి)

చివరిగా చెప్పేదేమిటంటే…

ఇక్కడ పరిగణించవలసిన అతి ముఖ్యమైన విషయం, ఒకవేళ రాజేష్ మరణిస్తే అతని కుటుంబం పెద్ద మొత్తాన్ని పొందుతుంది. ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలు పెట్టుబ‌డితో క‌లిపి ఉన్న‌ పాలసీలు . ఇందులో జీవిత బీమా అనేది చాలా తక్కువగా ఉంటుంది. టర్మ్ బీమా ఒక్కటే స్వచ్ఛమైన జీవిత బీమా పాలసీ.

టర్మ్ బీమా పాల‌సీకి చెల్లించే ప్రీమియం త‌క్కువ‌గా బీమా హామీ మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు