Car Safety: ప్రమాదాల నివారణకు కార్లలో ఏ భద్రతా ఫీచర్‌ తప్పనిసరి?

Car Safety: కార్లలో అన్ని భద్రతా ఫీచర్లు ముఖ్యమే. అన్ని కలిస్తేనే ప్రయాణికులకు సమగ్రమైన రక్షణ లభిస్తుంది...

Updated : 13 Jul 2022 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల (Airbags)ను ప్రభుత్వం ఇటీవల తప్పనిసరి చేసింది. సాధారణంగా కార్లలో యాక్టివ్‌, పాసివ్‌ అని రెండు రకాల భద్రతా ఫీచర్లు (Safety Features) ఉంటాయి. సురక్షితమైన ప్రయాణానికి వీటిలో ఏవి ముఖ్యమని చెప్పడం కష్టం. అన్నీ ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రమాదం నుంచి ప్రయాణికుల్ని రక్షిస్తాయి. 

యాక్టివ్‌ వర్సెస్‌ పాసివ్‌..

ప్రమాదానికి గురికాకుండా ముందుగానే కాపాడే ఫీచర్లు (Safety Features) యాక్టివ్‌ కేటగిరీలోకి వస్తాయి. ఉదాహరణకు కండిషన్‌లో ఉన్న బ్రేక్స్‌, యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం (ABS), ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఇతర సెన్సర్లు. ఇవన్నీ మనకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఉపయోగడపడతాయి. ఆధునికత పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సెన్సర్లు ముందే మనకు కొన్ని రకాల హెచ్చరికలు అంందజేస్తున్నాయి.

అదే ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులను రక్షించే ఫీచర్లను పాసివ్‌ ఫీచర్లుగా చెప్పొచ్చు. ఒకరకంగా ఇవి ప్రమాద తీవ్రతను, ప్రయాణికులకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. సీటుబెల్టులు, ఎయిర్‌బ్యాగులు, హెడ్‌రెస్ట్‌లు, క్రంపిల్‌ జోన్స్‌, కొలాప్సబుల్‌ స్టీరింగ్‌ సిస్టమ్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.

ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఎక్కువ భద్రత?

ప్రయాణికుల వాహనాలన్నింటిలో ఆరు ఎయిర్‌బ్యాగులు (Airbags) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల కార్ల ధరలు పెరిగి ఎంట్రీ లెవెల్‌ కస్టమర్లపై ప్రభావం పడుతుందని కొన్ని కార్ల తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఎనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌ (Airbags)లు తప్పనిసరని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా ఉంచడంలో సీటుబెల్టు ముఖ్యపాత్ర పోషిస్తుందని మారుతీ సుజుకీకి చెందిన చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సీవీ.రామన్‌ తెలిపారు. ఎయిర్‌బ్యాగ్‌లు సీటుబెల్టుతో కలిస్తేనే సరైన రక్షణ లభిస్తుందని వివరించారు. ఎయిర్‌బ్యాగ్‌లు ఒక్కటే ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో అంత ప్రభావవంతంగా పనిచేయవని తెలిపారు.

ఉదాహరణకు.. మీరు సీటుబెల్టు (Seatbelts) పెట్టుకోలేదనుకుందాం. ప్రమాదం జరిగితే మీ ముందు ఓపెన్‌ అయిన ఎయిర్‌బ్యాగ్‌కు బలంగా వెళ్లి ఢీకొట్టడం వల్ల గాయాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. అందుకే సీటుబెల్టులు పెట్టుకుంటే ఎయిర్‌బ్యాగ్‌లకు బలంగా ఢీకొట్టే అవకాశం ఉండదని వివరించారు. నిజానికి సీటుబెల్టు (Seatbelts)లు అందించే భద్రతకు ఎయిర్‌బ్యాగ్‌లు అదనపు రక్షణ మాత్రమేనని పేర్కొన్నారు.

ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే.. వారికి సీటుబెల్టు (Seatbelts) పెట్టని సమయంలో ప్రమాదం జరిగితే ఎయిర్‌బ్యాగ్‌కు తగిలి పుర్రెభాగానికి తీవ్ర గాయమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో అసలు చిన్న పిల్లల్ని ముందు సీట్లలో కూర్చోబెట్టడానికి అనుమతించరని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌బ్యాగ్‌ల కంటే కూడా సీటుబెల్టు ఉపయోగంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ఎన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. సీటుబెల్టు (Seatbelts) పెట్టుకోకపోతే అంత ప్రయోజనం ఉండదని వివరిస్తున్నారు.

సీటుబెల్టు వినియోగం తీరిది..

కార్లలో వస్తున్న భద్రతా ఫీచర్లను డ్రైవర్లు, ప్రయాణికులు అంతగా ఉపయోగించుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్లు పెరుగుతున్న కొద్దీ సీటుబెల్టు (Seatbelts) ఉపయోగం తగ్గిపోతోందని తెలిసింది. సీటుబెల్టులను రెండు దశాబ్దాల క్రితం తప్పనిసరి చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక వెనుక సీట్లలో కూర్చున్న వారిలో కేవలం 4 శాతం మంది మాత్రమే సీటుబెల్టును ఉపయోగిస్తున్నారని తేలింది. దక్షిణ భారతదేశంలో ఈ భద్రతా ఫీచర్‌ వినియోగం మరీ తక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. 77 శాతం మంది.. ప్రభుత్వం తప్పనిసరి చేసింది కాబట్టి సీటుబెల్టు (Seatbelts) పెట్టుకుంటున్నామని తెలిపారు. 25 శాతం మంది అయితే సీటుబెల్టు వల్ల తాము ధరించిన దుస్తులు చెదిరిపోతున్నాయని పేర్కొనడం గమనార్హం. మరింత కఠినమైన నిబంధనలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల దీని వినియోగాన్ని పెంచొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సీటుబెల్టు, కండిషన్డ్‌ బ్రేక్స్‌, ఎయిర్‌బ్యాగ్‌లు, సెన్సర్లు.. ఇలా అన్ని ఫీచర్లు కలిస్తేనే మనకు ప్రమాదం నుంచి రక్షణ లభిస్తుంది. ఏ ఒక్కటీ ప్రమాదం నుంచి బయటపడేస్తుందన్న భరోసా లేదు. ఈ నేపథ్యంలో కార్లలో అన్ని భద్రతా ఫీచర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకొని తగిన నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని