వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటి.. ఎలా ప‌నిచేస్తాయి?

ఇంటర్నెట్ డెస్క్‌: సాధార‌ణంగా వైట్ లేబుల్‌ ఏటీఎంల‌ను (డబ్ల్యూఎల్ఏ)ల‌ను బ్యాంకింగేత‌ర సంస్థలు నిర్వహిస్తాయి. ఖాతాదారులు ఈ యంత్రాల‌ను సాధార‌ణ ఏటీఎంల మాదిరిగానే ఉప‌యోగించుకోవ‌చ్చు. నగ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌, విచార‌ణ వంటి డెబిట్ కార్డు సేవ‌ల‌ను వీటి వద్ద పొందొచ్చు. వీలైన‌న్ని ఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో బ్యాంకింగేత‌ర సంస్థలు కూడా ఏటీఎంల‌ను నిర్వహించేందుకు రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్‌ చ‌ట్టం - 2007 కింద అనుమ‌తించింది. టాటా క‌మ్యూనికేష‌న్స్ పేమెంట్స్ సొల్యూష‌న్స్ లిమిటెడ్‌, ఇండియా 1 పేమెంట్స్ లిమిటెడ్‌, హిటాచి పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కొన్ని సంస్థలు ఈ విధంగా దేశంలో వైట్ లేబుల్ ఏటీఎం సేవ‌లను అందిస్తున్నాయి.

వైట్ లేబుల్ ఏటీఎంల అవ‌స‌రం ఏంటి?

సాధార‌ణంగా బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంటాయి. బ్యాంకు బ్రాంచ్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కొన్ని ర‌కాల బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందించేందుకు గానూ ఏటీఎంల‌ను ఏర్పాటు చేస్తుంటాయి. అయితే వీటి ఏర్పాటు ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఏటీఎం యంత్రాలు, భ‌ద్రత, న‌గ‌దు నిర్వహణ వంటి ఖ‌ర్చుల కార‌ణంగా బ్యాంకులు అన్ని చోట్లా ఏటీఎంల‌ను ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందువ‌ల్ల వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది.

సేవ‌లు..: న‌గ‌దు విత్‌డ్రాతో పాటు ఖాతా స‌మాచారం, న‌గ‌దు డిపాజిట్‌, బిల్లు చెల్లింపు, మినీ స్టేట్‌మెంట్‌, పిన్‌ మార్పు, చెక్ బుక్ కోసం అభ్యర్థనలు వంటి ఇత‌ర సేవ‌ల‌ను కూడా వైట్ లేబుల్ ఏటీఎంలు ఆఫ‌ర్ చేస్తున్నాయి.

లావాదేవీల ప‌రిమితులు, ఛార్జీలు: సాధార‌ణ బ్యాంకు ఏటీఎంను ఏవిధంగా ఉప‌యోగిస్తామో.. అదేవిధంగా వైట్ లేబుల్ ఏటీఎంల‌ను ఉప‌యోగించొచ్చు. బ్యాంకు ఏటీఎంల వ‌ద్ద ప‌రిమితి మేర‌కు ఉచిత లావాదేవీల‌ను నిర్వహించేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఆ ప‌రిమితికి లోబ‌డి వైట్ లేబుల్‌ ఏటీఎంల వ‌ద్ద చేసే లావాదేవీల‌కు కూడా ఎటువంటి ఛార్జీలూ వర్తించవు. బ్యాంకు ఒక నెల‌లో ఐదు ఉచిత లావాదేవీల‌ను అందిస్తే.. బ్యాంక్ సొంత ఏటీఎంతో పాటు ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల వ‌ద్ద వైట్ లేబుల్ ఏటీఎంల వ‌ద్ద ప‌రిమితుల‌కు లోబ‌డి ఉచిత లావాదేవీలు చేయొచ్చు.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. మెట్రో న‌గ‌రాల‌లో అయితే 3 సార్లు, మెట్రోయేత‌ర న‌గ‌రాల్లో అయితే 5 సార్లు ఉచిత లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌ను అనుమ‌తించాలి. బ్యాంకులు ప్రీమియం ఖాతాదారుల‌కు (బ్యాంకు సూచించిన విధంగా ఖాతా నిర్వహించేవారికి) మ‌రిన్ని ఉచిత లావాదేవీలు చేసేందుకు అనుమ‌తిస్తున్నాయి. బ్యాంకు సొంత ఏటీఎం వ‌ద్ద నిర్వహించే లావాదేవీలు ఆన్-అజ్‌ ట్రాన్జక్షన్స్ కిందకి వస్తాయి. ఏటీఎం ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక నెల‌లో 5 ఉచిత  ఆర్థిక లావాదేవీల‌ను బ్యాంకులు అనుమ‌తిస్తాయి. నాన్‌-క్యాష్ విత్‌డ్రాల‌పై ప‌రిమితి, ఛార్జీలూ ఉండ‌వు. ఇత‌ర బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థల ఏటీఎంల వ‌ద్ద చేసే లావాదేవీల‌ను ఆఫ్‌-అజ్‌ ట్రాన్జక్షషన్స్‌ అంటారు. లావాదేవీలు నిర్వహించే ప్రదేశం (మెట్రో, నాన్‌మెట్రో న‌గ‌రాలు) ఆధారంగా ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఇందులో ఆర్థిక, ఆర్థికేత‌ర లావాదేవీలు రెండూ ఉంటాయి. బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబయి, దిల్లీ ఈ 6 మెట్రో న‌గ‌రాల కింద‌కి వ‌స్తాయి.

* కొన్ని సంస్థలు వైట్ లేబుల్ ఏటీఎంల‌ను ఏర్పాటు చేసి వాటిని బ్యాంకుల‌కు అద్దెకు ఇస్తుంటాయి. అటువంటి ఏటీఎంల‌ను బ్యాంకు సొంత ఏటీఎంలు ప‌రిధిలోకి వ‌స్తాయి. బ్యాంకు అనుమ‌తించిన మేర‌కు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

* ఏటీఎంల వ‌ద్ద ప‌రిమితికి మించిన లావాదేవీల‌పై ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ప‌రిమితికి మించిన‌ ఒక్కో లావాదేవీపై విధించే ఛార్జీ+ వ‌ర్తించే ప‌న్ను రూ. 20 మించ‌కూడ‌దు.

లావాదేవీ వైఫల్యం..: ఈ రోజుల్లో బ్యాంకులు విఫలమైన లావాదేవీలను తమంతట తాముగా కొన్ని నిమిషాల్లోనే వ్యవధిలోనే సరిచేస్తున్నాయి. ఒక‌వేళ లావాదేవీలు విఫ‌ల‌మైన కార‌ణంగా డ‌బ్బు డెబిట్ అయ్యి తిరిగి అకౌంట్‌లోకి రాకపోతే కార్డు జారీచేసిన బ్యాంకుకు గానీ, ఏటీఎం సంబంధిత బ్యాంకుకు గానీ సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదు చేయాలి. వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటు చేసిన చోట సంబంధిత అధికారుల‌ను సంప్రదించేందుకు గానూ టోల్‌-ఫ్రీ నంబర్లు, హెల్ప్ డెస్క్ నంబర్లను ఉంచుతారు. వాటి ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని