Adani Group: ‘అదానీ’లో ఇప్పుడు వాటాలు కొన్నదెవరు? ఏ వ్యూహంతో?

Adani Group: ఇంతటి సంక్షోభ సమయంలో అదానీ వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన జీక్యూజీ కంపెనీ ఏం చేస్తుంటుంది? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ పెట్టుబడుల వెనుక వారి లక్ష్యం ఏంటి? వంటి వివరాలు చూద్దాం..

Published : 03 Mar 2023 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ (Adani Group) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో గ్రూప్‌ (Adani Group)నకు చెందిన నాలుగు నమోదిత సంస్థల్లో అమెరికా సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ (GQG Partners) మైనారిటీ వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.15,446 కోట్లు. సెకండరీ మార్కెట్‌ బ్లాక్‌ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises), అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో వాటాలను జీక్యూజీ కొనుగోలు చేసింది.

ఇలాంటి కష్టకాలంలో వాటాలను కొనుగోలు చేయడానికి జీక్యూజీ ముందుకు రావడం అదానీ గ్రూప్‌ (Adani Group)నకు ఊరటనిచ్చే విషయం. ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మద్దతుగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ షేర్లు శుక్రవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంతకీ ఇంతటి సంక్షోభ సమయంలో అదానీ వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన జీక్యూజీ కంపెనీ ఏం చేస్తుంటుంది? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ పెట్టుబడుల వెనుక వారి లక్ష్యం ఏంటి? వంటి వివరాలు చూద్దాం..

జీక్యూజీ ఏం చేస్తుంది?

జీక్యూజీ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ. ఇది ఆస్ట్రేలియా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. గ్లోబల్‌ ఈక్విటీ, ఇంటర్నేషనల్‌ ఈక్విటీ, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్విటీ, యూఎస్‌ ఈక్విటీ వంటి ఫండ్‌లను నిర్వహిస్తోంది. దీర్ఘకాలంలో తమ క్లయింట్లకు భారీ రాబడులు అందించినట్లు ఈ కంపెనీ చెబుతోంది.

నడిపిస్తుంది భారతీయుడే..

జీక్యూజీ పార్ట్‌నర్స్‌ను భారత సంతతికి చెందిన రాజీవ్‌ జైన్‌ 2016 జూన్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీకి ఛైర్మన్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. జీక్యూజీకి ముందు వోంటోబెల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో జైన్‌ వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపు 22 సంవత్సరాలు అదే సంస్థలో ఉన్నారు. అంతకంటే ముందు స్విస్‌ బ్యాంక్‌ కార్పొరేషన్‌లో ఇంటర్నేషనల్‌ ఈక్విటీ అనలిస్ట్‌గా పనిచేశారు. భారత్‌లోనే పుట్టి పెరిగిన జైన్‌.. ‘యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ’లో ఫైనాన్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఇప్పటికీ ఆయనకు ట్విటర్‌ ఖాతా లేదు. పెద్దగా టీవీ షోల్లోనూ కనిపించరు. కానీ, తనదైన పెట్టుబడి వ్యూహాలతో జీక్యూజీని 92 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థగా నిలబెట్టారు.

పెట్టుబడి మంత్రం..

‘ఫార్వర్డ్‌ లుకింగ్‌ క్వాలిటీ’ అనే పెట్టుబడి మంత్రంతో తాము పనిచేస్తున్నట్లు రాజీవ్‌ జైన్ గతంలో ఓ సందర్భంలో తెలిపారు. క్లయింట్ల పెట్టుబడులను గణనీయంగా పెంచడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వృద్ధి, విలువ ఆధారిత సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లు ఆ తర్వాత విజయవంతంగా నడుస్తుందనే వ్యాపారంలోనే తాము పెట్టుబడులు పెడతామని వివరించారు. దానికి అనుగుణంగానే తమ మదుపు వ్యూహాలు ఉంటాయని పేర్కొన్నారు.

నిజానికి చాలా ఈక్విటీ సంస్థలు టెక్‌ ఆధారిత సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. సాంకేతిక రంగంలో వస్తోన్న, రాబోతోన్న అనూహ్య మార్పులను దృష్టిలో ఉంచుకొని దానిలోని అవకాశాలను రాబడులుగా మార్చుకునే వ్యూహంతో ఆయా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ, భవిష్యత్‌లో అత్యధిక వృద్ధికి అవకాశం ఉన్న రంగం టెక్నాలజీ ఇక ఏమాత్రం కాదని జైన్‌ గత ఏడాది ఓ ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇందుకే ‘అదానీ’ వాటాల కొనుగోలు..

జైన్‌ ప్రధానంగా ఇంధన రంగంపై దృష్టి సారించారు. యావత్‌ ప్రపంచం సహజ ఇంధన వనరుల నుంచి కర్బన ఉద్గార రహిత ఇంధనంవైపు మారుతున్న నేపథ్యంలో ఆయన ఈ రంగంపై బుల్లిష్‌గా ఉన్నారు. వీటితో పాటు బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఆయన పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌లో వాటాల కొనుగోలుకు జైన్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్‌ ఎనర్జీ, సౌర, పవన విద్యుత్‌ వంటి శుద్ధ ఇంధన రంగంలో అదానీ గ్రూప్‌ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. 

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల ప్రభావం భారత విపణిపై పెద్దగా ఉండదని ఇటీవల బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైన్‌ తెలిపారు. అదానీ గ్రూప్‌లో బ్యాంకుల ఎక్స్‌పోజర్‌ 1 శాతం కంటే తక్కువే ఉన్న నేపథ్యంలో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదన్నారు. పైగా అదానీ గ్రూప్‌ కంపెనీలన్నీ నియంత్రణా సంస్థల పరిధిలోనే ఉన్న కారణంగా ముప్పు పెద్దగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారం పూర్తిగా ప్రత్యేక అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

(గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని