ITR: ఐటీఆర్ 1 ఫారం ఎవరికోసం?

ప‌న్ను చెల్లింపులుదారులు వారి ఆదాయానికి స‌రిపోయే ఫారంని మాత్రమే ఎంచుకుని ప‌న్ను దాఖ‌లు చేయాలి.

Published : 28 Jun 2022 15:53 IST

ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫారం ఎంపిక విష‌యంలో. మ‌దింపు సంవ‌త్స‌రం(AY) 2022-23 ప‌న్ను రిట‌ర్నుల‌కు సంబంధించిన ప‌లు ఫారంలు ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప‌న్ను చెల్లింపులుదారులు వారి ఆదాయానికి ఏ ఫారం సరిపోతుందో..దానిని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారు మీరు దాఖ‌లు చేసిన రిట‌ర్నుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు.

ప‌న్ను చెల్లింపుదారుల‌లో ఎక్కువ మంది ఉప‌యోగించే ఫారంల‌లో ఐటీఆర్-1 ఒక‌టి. దీనిని స‌హ‌జ్ అని కూడా పిలుస్తారు. ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు అందుబాటులో ఉన్న ఫారంల‌లో సుల‌భంగా పూర్తి చేయ‌గ‌ల ఫారం కూడా ఇదేన‌ని చెప్పొచ్చు. ఎందుకంటే జీతం ద్వారా వ‌చ్చిన ఆదాయం, ఇంటి ఆస్తి ద్వారా వ‌చ్చిన రాబ‌డి వంటి ప‌రిమిత స‌మాచారం మాత్ర‌మే ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో కూడా దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఐటీఆర్-1 ని ఆదాయపు ప‌న్ను శాఖ కొత్త పోర్ట‌ల్ ద్వారా దాఖ‌లు చేసేవారు..ముందుగా పూరించిన స‌మాచారంతో ఫారంని పొంద‌వ‌చ్చు. ఈ ఫారంలో ఏమైనా త‌ప్పులు ఉంటే స‌రిదిద్దుకోవ‌చ్చు. 

ఐటీఆర్-1 ఎవరికి?
*
వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందే వారు
* ఇంటి ఆస్తి నుంచి వ‌చ్చిన ఆదాయం/న‌ష్టం (మున‌ప‌టి సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చిన న‌ష్టాన్ని 'క్యారీ ఫార్వ‌ర్డ్' చేసిన సంద‌ర్భాల‌ను మిన‌హాయించి)
* వ్య‌వ‌సాయం ద్వారా వ‌చ్చిన ఆదాయం రూ. 5 వేల కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు
* ఇత‌ర ఆదాయ మార్గాలు, అంటే ఎఫ్‌డీ నుంచి వ‌చ్చిన వ‌డ్డీ, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, పోస్టాఫీసు వ‌డ్డీ మొద‌లైన‌వి (లాట‌రీ, గుర్ర‌పు పందెలలో గెల‌వ‌డం ద్వారా వ‌చ్చిన ఆదాయం ఇందులోకి రాదు)
* భార‌తీయ నివాసులైయుండి.. మొత్తం వార్షిక ఆదాయం కలిపి రూ.50 లక్షలకు మించని వారు ఈ ఫారం దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఇందులో భార్య లేదా భర్త లేదా మైనర్ పిల్లల పేరు మీద ఉన్న ఆదాయం కూడా కలిపి దాఖలు చేయవచ్చు.

ఐటీఆర్-1 ఎవరికి కాదు?
* మొత్తం ఆదాయం రూ. 50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉన్న‌వారు
* వ్య‌వ‌సాయం నుంచి వ‌చ్చే ఆదాయం రూ. 5 వేల‌కు మించి ఉన్న‌వారు
* ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే మూల‌ధ‌న రాబ‌డి ఉన్న‌ప్పుడు
* వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం వ‌స్తున్నవారు
* ఒక‌టి కంటే ఎక్కువ గృహాల ద్వారా ఆదాయం ఉన్న‌వారు
* ఏదైనా సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్న‌వారు
* ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎప్పుడైనా జాబితా చేయ‌ని (అన్‌లిస్టెడ్) ఈక్వీటీ షేర్ల‌లో పెట్టుబ‌డిపెట్టినవారు
*  భార‌త్ లో నివాసం ఉండి.. భార‌త‌దేశం వెలుప‌ల ఆస్తులు ఉన్న‌వారు (ఏదైనా సంస్థ‌లో 'ఫైనాన్షియ‌ల్ ఇంట్ర‌స్ట్' ఉండ‌డంతో స‌హా), సంత‌కం చేసే అధికారంతో స‌హా
* విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం ఉన్న‌వారు.. ఐటీఆర్-1ని దాఖ‌లు చేయ‌కూడ‌దు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని