Capital Gains: పన్ను మినహాయింపు అందించే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ గురించి విన్నారా?

ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన మూలధన లాభాలు..నిర్దేశించిన పెట్టుబడులు పెట్టేవరకు క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌లో జమ చేసి పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

Updated : 08 Nov 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు, వ్యవసాయ భూమి వంటి మూలధన ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చే రాబడిని మూలధన రాబడి అంటారు. సాధారణంగా మూలధన రాబడిపై పన్ను వర్తిస్తుంది. అయితే, ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చే మూలధన లాభాలు తిరిగి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తోంది. దీనికి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఈ కాలపరిమితిలోపు తిరిగి పెట్టుబడులు పెట్టగలిగితే పన్ను నుంచి ఉపశమనం పొందవచ్చు.

అయితే పన్ను చెల్లింపుదారులు.. ఆదాయపు పన్ను దాఖలు చేసే ముందు లేదా చట్టంలో పేర్కొన్న సమయంలోపు పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో పన్ను చెల్లింపుదారులు తమ నిధులను.. నిర్దేశించిన పెట్టుబడులు పెట్టేవరకు క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ (సీజీఏఎస్‌)లో డిపాజిట్‌ చేయవచ్చు. క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 1988లో ప్రవేశపెట్టింది. 

సీజీఏఎస్‌లో ఎవరు డిపాజిట్‌ చేయొచ్చు?

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 54 నుంచి 54F వరకు మూలధన రాబడి ఉన్న పన్ను చెల్లింపుదారులు క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయవచ్చు. ఏ సెక్షన్‌ కింద ఎవరు క్యాపిటల్‌ గెయిన్‌ ఖాతాను తెరవచ్చో చూద్దాం.

సెక్షన్‌ 54: నివాస గృహం అమ్మినప్పుడు.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన రాబడి
సెక్షన్‌ 54B: వ్యవసాయ భూమి విక్రయించిప్పుడు.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన రాబడి
సెక్షన్‌ 54D: భూమి, బిల్డింగ్‌ నిర్బంధ సేకరణ చేసినప్పుడు.. పన్ను చెల్లింపుదారులెవరైనా పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54E: ఏదైనా దీర్ఘకాల మూలధన ఆస్తిని విక్రయించినప్పుడు.. పన్ను చెల్లింపుదారులెవరైనా పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54EC: దీర్ఘకాల మూలధన ఆస్తి.. భూమి లేదా బిల్డింగ్‌ లేదా రెండూ విక్రయించినప్పుడు పన్ను చెల్లింపుదారులెవరైనా పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54F: నివాస ఆస్తికాని దీర్ఘకాలిక మూలధన ఆస్తి అమ్మకం.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54G: పట్టణ ప్రాంతం నుంచి పారిశ్రామిక సంస్థను మార్చిన సందర్భంలో (యంత్రాలు, ప్లాంట్, భవనం, భూమి) ఆస్తి బదిలీ.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54GA: పారిశ్రామిక సౌకర్యాన్ని పట్టణ ప్రాంతం నుంచి స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (SEZ)కి మార్చినప్పుడు.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన లాభం
సెక్షన్‌ 54GB: నివాస ఆస్తి బదిలీ.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు పొందే మూలధన లాభం

పైన తెలిపిన సెక్షన్ల కింద మూలధన రాబడి పొందినవారు క్యాపిటల్‌ గెయిన్స్‌ ఖాతాను తెరవవచ్చు.

ఎప్పుడు డిపాజిట్‌ చేయవచ్చు?

మూలధన లాభాలను నిర్ధిష్ట పెట్టుబడుల్లో నిర్ధిష్ట కాలపరిమితి ముగియక ముందే పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ కాలపరిమితిలోపు పెట్టుబడి పెట్టలేకపోతే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేయవచ్చు. ఈ రెండింట్లో ఏది చేసిననా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయకముందే చేయాలి.

సీజీఏఎస్‌ ఖాతాను ఎక్కడ తెరవొచ్చు?

ప్రభుత్వం నోటిఫై చేసిన ఏదైనా అధీకృత బ్యాంకు (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్, ఐడీబీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి వాటిలో) సీజీఏఎస్‌ ఖాతాను తెరవచ్చు. అయితే, అధీకృత బ్యాంకు అయినా గ్రామీణ శాఖల్లో మాత్రం తెరిచే వీలులేదు.

సీజీఏఎస్‌ - రకాలు..

క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ కింద రెండు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. 

టైప్‌-ఏ పొదుపు డిపాజిట్‌:  టైప్-ఏ ఖాతా సాధారణ బ్యాంకు పొదుపు ఖాతా మాదిరిగా ఉంటుంది. వడ్డీ కూడా సాధారణ పొదుపు ఖాతా వడ్డీనే వర్తిస్తుంది. సమయానుసారంగా వడ్డీని ఖాతాకు జమ చేస్తారు. డిపాజిట్‌దారునికి పాస్‌బుక్‌ అందిస్తారు. పొదుపు ఖాతా మాదిరిగానే టైప్‌-ఏ ఖాతాలో అధిక లిక్విడిటీ ఉంటుంది. ఏ సమయంలోనైనా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు నిర్మించుకునే వారు.. నిర్మాణ దశను బట్టి, వివిధ అవసరాలకు తగినట్లు డబ్బు విత్‌డ్రా చేసుకుంటారు. కాబట్టి వారికి ఈ ఖాతా అనుకూలంగా ఉంటుంది.

టైప్‌-బి టర్మ్‌ డిపాజిట్‌:  ఇది బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఎఫ్‌డీకి వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే ఎఫ్‌డీకి వర్తించే నిబంధనలే వర్తిస్తాయి. ముందస్తు విత్‌డ్రాలకు పెనాల్టీ ఉంటుంది. అయితే, టైప్‌-బి ఖాతాకు గరిష్ఠగా 3 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసే వారు 2 ఏళ్లు, నిర్మించేవారు 3 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోవాలి. ఎఫ్‌డీ మాదిరిగానే అన్ని వివరాలతో డిపాజిట్‌ సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. దీన్ని విత్‌డ్రా సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎఫ్‌డీ మాదిరిగా దీనికి ఆటో-రెన్యువల్‌ ఆప్షన్‌ ఉండదు. 

టర్మ్‌ డిపాజిట్‌ క్యుములేటివ్‌ (వడ్డీ కూడబెట్టి అసలుతో కలిపి తిరిగి పెట్టుబడి పెట్టడం) లేదా నాన్-క్యుములేటివ్‌ (త్రైమాసికంగా, అర్థ వార్షికంగా, వార్షికంగా.. ఒక క్రమ పద్ధతిలో వడ్డీ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు) ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. మూలధన లాభాలను ఏకమొత్తంలో పెట్టబడి పెట్టేవారికి ఈ ఖాతా సరిపోతుంది. 

గుర్తుంచుకోండి..

  • ఈ రెండు ఖాతాలకు చెక్‌బుక్‌, డెబిట్‌ కార్డు సౌకర్యం ఉండదు. విత్‌డ్రాలను ‘ఫారం సి’, ‘ఫారం డి’ ద్వారా మాత్రమే అనుమతిస్తారు. 
  • రుణ సదుపాయం ఉండదు.
  • డిపాజిట్‌ మొత్తాన్ని మెచ్యూరిటీకి ముందు టైప్‌-ఏ నుంచి టైప్‌-బి, అలాగే టైప్‌-బి నుంచి టైప్‌-ఏకి మార్చుకోవచ్చు. అయితే టైప్‌-బి నుంచి టైప్‌-ఏకి మార్చుకుంటే ముందుస్తు విత్‌డ్రాగా పరిగణిస్తారు. 
  • ఖాతాను అదే బ్యాంకుకు సంబంధించిన వేరొక బ్రాంచీకి బదిలీ చేసుకునేందుకు వీలుంటుంది. వేరొక బ్యాంకుకు మార్చుకునే వీలుండదు. ఖాతా బదిలీ కోసం ‘ఫారం బి’ ఇవ్వాల్సి ఉంటుంది. 
  • నామినీగా ముగ్గురు వ్యక్తులను నియమించుకోవచ్చు. నామినీగా మైనర్‌ను ఎంచుకుంటే డిపాజిట్‌ మొత్తం స్వీకరించేందుకు మైనర్‌ తరఫున మరొక వ్యక్తిని నియమించవచ్చు. ఇందుకోసం ‘ఫారం ఈ’ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మార్పు కోసం ‘ఫారం ఎఫ్‌’ సమర్పించాలి.
  • మైనర్‌, హెచ్‌యూఎఫ్‌, ఏఓపీ, బీఓఐ, ఫరం ఖాతాల విషయంలో నామినీ నియమించే వీలులేదు.
  • టైప్‌-ఏ, టైప్‌-బి రెండు ఖాతాల మూసివేతకు అధికార పరిధిలోని ఆదాయపు పన్ను అధికారి ఆమోదం అవసరం. అలాగే, ‘ఫారం జి’ కూడా సమర్పించాలి. 
  • డిపాజిటర్‌ మరణించినట్లైతే (నామినీ పేర్కొననప్పుడు) లీగల్‌ వారసుడు ఖాతా మూసివేత కోసం ‘ఫారం హెచ్‌’ ఇవ్వాల్సి ఉంటుంది. 
  • ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఖాతాపై వచ్చే వడ్డీ టీడీఎస్‌కు లోబడి ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని