Hindenburg: హిండెన్‌బర్గ్‌ తాజా నివేదికలో భారత సంతతి వ్యక్తి పేరు.. ఎవరీ అమృతా అహుజా?

హిండెన్‌బర్గ్‌ (Hindenburg) తాజా నివేదికలో భారత సంతతి మహిళ అమృతా అహుజా (Amrita Ahuja) పాత్రపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంతకీ ఎవరీ అమృతా అహుజా?.. బ్లాక్‌ (Block Inc) మోసంలో ఆమె పాత్ర ఏంటి?

Published : 24 Mar 2023 22:20 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ (Hindenburg) తాజా నివేదికలో ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే (Jack Dorsey)కు చెందిన మొబైల్‌ చెల్లింపుల సంస్థ బ్లాక్‌ (Block Inc)పై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఖాతాలను ఎక్కువగా చూపి పెట్టుబడిదారులను మోసం చేసి లబ్ధి పొందినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో భారత సంతతి మహిళ అమృతా అహుజా (Amrita Ahuja) పాత్రపైనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంతకీ ఎవరీ అమృతా అహుజా? బ్లాక్‌లో కీలక హోదాలో ఉన్న ఆమె తన పదవిని ఎలా దుర్వినియోగం చేశారు. పూర్తి వివరాలు.

  • అమృత తల్లిదండ్రులు భారత్‌ నుంచి వెళ్లి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని  క్లీవ్‌ల్యాండ్‌లో స్థిరపడ్డారు. అక్కడ వారు డే-కేర్ సెంటర్‌ నిర్వహించేవారు. అందులో ఆమె కొన్నాళ్లపాటు సమ్మర్‌ క్యాంప్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
  • డ్యూక్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిగ్రీని, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ  పూర్తి చేశారు. లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ పూర్వ విద్యార్థి అని కూడా పేర్కొన్నారు. 
  • 2001లో మోర్గాన్ స్టాన్లీలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా అమృత తన కెరీర్‌ను ప్రారంభించారు. 2007లో ఫాక్స్‌ సంస్థలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్ట్‌గా చేరారు. ఆ కంపెనీకి చెందిన హులు స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 
  • 2010లో ఫాక్స్‌ నుంచి గేమింగ్ డిజైనింగ్ సంస్థ అయిన యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌లోకి చేరారు. ఈ సంస్థ క్యాండీ క్రష్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి పాపులర్‌ గేమ్‌లను డిజైన్‌ చేసింది. వీటి వృద్ధిలో కూడా అమృత కీలకంగా వ్యవహరించారని సమాచారం. 
  • 2018లో స్కేర్వ్‌ (2021లో బ్లాక్‌గా పేరు మార్చారు)లో చేరడానికి ముందు ది వాల్ట్‌ డిస్నీ, ఎయిర్‌బిఎన్‌బి, మెకిన్సే అండ్ కంపెనీ వంటి వాటిలో పనిచేశారు. బ్లాక్‌లో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చిన్న వ్యాపారాలు వృద్ధిపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌ సీఎఫ్‌వో బాధ్యతలతోపాటు అదనంగా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (COO) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

బ్లాక్‌ వ్యవస్థాపకులు జాక్‌ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వీలతో కలిసి అమృతా అహుజా, మేనేజర్‌ బ్రెయిన్‌ గ్రాస్సాడోనియాలు  సంస్థ షేరుపై మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. ఖాతాదార్ల సంఖ్యను ఎక్కువగా చూపుతూ, సంస్థ షేరు విలువను కృత్రిమంగా పెంచుకుంటూ పోవడం ద్వారా బ్లాక్‌ నిర్వాహకులు పెట్టుబడిదార్లను, ప్రభుత్వాన్ని మోసగించారని నివేదికలో పేర్కొంది. కరోనా సమయంలో వ్యవస్థాపకులు సుమారు 100 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని