Legal guardian: లీగల్‌ గార్డియన్‌ ఎవరికి అవసరం?చట్టాలు ఏం చెబుతున్నాయి?

వీలునామా రాసేటప్పుడు, ఎస్టేట్‌ ప్లానింగ్‌లో గార్డియన్‌ వివరాలు తప్పనిసరి. సాధారణంగా బంధువులు లేదా సమీప కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణను చేపడుతుంటారు. కానీ, ఇక్కడ కొన్ని చట్టబద్ధమైన నియమాలు ఉంటాయి....

Updated : 22 Feb 2022 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ చిన్నారి అనాథగా మారితే ఎలా? లేదా మానసికంగా, శారీరకంగా వైకల్యం ఏర్పడి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే? వారి బాగోగులు ఎవరు చూసుకోవాలి? వారి ఖర్చులు, ఆస్తులను ఎవరు పర్యవేక్షించాలి?

ఇక్కడే చట్టబద్ధ సంరక్షుడి (legal guardian) అవసరం ఏర్పడుతుంది. వీలునామా రాసేటప్పుడు, ఎస్టేట్‌ ప్లానింగ్‌లో ఈ వివరాలు తప్పనిసరి. సాధారణంగా బంధువులు లేదా సమీప కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణను చేపడుతుంటారు. కానీ, ఇక్కడ కొన్ని చట్టబద్ధమైన నియమాలు ఉంటాయి.

సంరక్షుడు అంటే ఎవరు?

ఓ వ్యక్తి బాగోగులు, ఆస్తులు, ఖర్చులను పర్యవేక్షించేందుకు ఓ అధికారిక సంస్థ నియమించే మరో వ్యక్తిని గార్డియన్‌ లేదా సంరక్షుడిగా గుర్తిస్తారు. ఎవరికైతే గార్డియన్‌ని కేటాయించారో ఆ వ్యక్తిని వార్డ్‌గా వ్యవహరిస్తారు. వార్డ్‌ తరఫున అన్ని రకాల చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకునే హక్కు గార్డియన్‌కు ఉంటుంది.

గార్డియన్‌ ఎవరికి అవసరం?

మైనర్ల (18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు)కు గార్డియన్లు అవసరం. తల్లిదండ్రులే సహజ సంరక్షులు. కానీ, వారు లేనప్పుడు ఓ చట్టబద్ధమైన సంరక్షుడి అవసరం ఉంటుంది. శారీరక, మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకు కూడా గార్డియన్ ఉండాలి. సంరక్షుడు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, అనుసరించాల్సిన నియమాలకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అయితే, వార్డ్‌ స్థితిని బట్టి నిబంధనలు మారుతుంటాయి. వైకల్యం తీవ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అనుసరించి గార్డియన్‌కు హక్కులు, అధికారాలు ఉంటాయి.

సంరక్షుడిని ఎవరు నియమిస్తారు?

ఓ వ్యక్తికి గార్డియన్‌ అవసరాన్ని గుర్తించిన తర్వాత.. అసలు ఆ సంరక్షుడిని ఎవరు నియమించి, ధ్రువీకరిస్తారనేది చాలా ముఖ్యం. దీనికి భారత్‌లో కొన్ని చట్టాలు ఉన్నాయి. ‘రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌, 2006’ అనే ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌పై భారత్‌ సంతకం చేసింది. దీన్ని అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం ‘రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీ యాక్ట్‌ (RPWD Act)’, ‘మెంటల్‌ హెల్త్‌కేర్‌ యాక్ట్‌ (MHC Act)’ అనే రెండు చట్టాలను తీసుకొచ్చింది.

ఎంహెచ్‌సీ యాక్ట్‌ ప్రకారం.. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకు నియమించే గార్డియన్లను ‘నియమిత ప్రతినిధులు’ (Nominated Representatives) అంటారు. అలాగే ఈ నామినేటెడ్‌ రిప్రజెంటేటివ్‌ల నియామకం కోసం ప్రభుత్వం ఓ ‘మెంటల్‌ హెల్త్‌ రివ్యూ బోర్డు’ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గార్డియన్ల కోసం వచ్చే దరఖాస్తులను సమీక్షించి ఈ బోర్డు నిర్ణయం తీసుకోవాలి.

ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ ప్రకారం.. జిల్లా కోర్టు లేదా ప్రభుత్వం గుర్తించిన ఇతర అధికారిక సంస్థలు గార్డియన్‌ను కేటాయించాల్సి ఉంటుంది. వ్యక్తుల శారీరక వైకల్యాన్ని అనుసరించి గార్డియన్‌ను నియమించాలా? వద్దా? నియమిస్తే వారి అధికారాలు, హక్కుల పరిధిని నిర్ణయిస్తుంది. వాస్తవానికి దీన్ని పరిమిత గార్డియన్‌షిప్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తుల వైకల్య తీవ్రత, వార్డ్‌-గార్డియన్‌ మధ్య పరస్పర అంగీకారాన్ని అనుసరించి ఏ నిర్ణయాలు ఎవరు తీసుకోవాలో సదరు సంస్థ నిర్ణయిస్తుంది.

మెంటల్‌ రిటార్డేషన్‌, ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న వారి కోసం ‘నేషనల్‌ ట్రస్ట్‌ యాక్ట్‌’ అనే మరో చట్టం కూడా ఉంది. దీన్ని 1999లోనే తీసుకొచ్చారు. ఎంహెచ్‌సీ, ఆర్‌పీడబ్ల్యూడీలోని అనేక నిబంధనలు దీంట్లోనూ ఉంటాయి. గార్డియన్ల నియామకానికి జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెబుతోంది. 2006 నాటి యూఎన్‌ కన్వెన్షన్‌కు అనుగుణంగా దీంట్లో అనేక మార్పులు చేయాల్సి ఉంది.

సంరక్షుడు యజమాని కాదు..

వార్డ్‌ ఆస్తుల్ని, ఇతర ప్రయోజనాల్ని పొందేందుకు గార్డియన్‌కు ఎలాంటి హక్కులు ఉండవు. వార్డ్‌, గార్డియన్‌ మధ్య బంధం కేవలం విశ్వాసపాత్రమైంది మాత్రమే. వార్డ్‌ బాగోగుల్ని చూసుకుంటూ ఆస్తుల్ని సంరక్షించడమే గార్డియన్‌ బాధ్యత. వాటికి యజమాని మాత్రం కాదు. అలాగే వార్డ్‌ ప్రయోజనాలకు కాకుండా ఇతర ఏ పనులకూ ఆస్తుల్ని ఉపయోగించడానికి వీలులేదు.

కోమాలో ఉన్న వారి పరిస్థితి ఏంటి?

కోమాలో ఉన్నవారి గురించి మాత్రం ఇప్పటి వరకు ప్రత్యేక చట్టాలేమీ లేకపోవడం గమనార్హం. అయితే, అలాంటి వారి కోసం గార్డియన్‌ కావాలంటే రిట్‌ జురిస్‌డిక్షన్‌ కింద కోర్టుకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఏదేమైనప్పటికీ.. శోభా గోపాలకృష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (2019) కేసులో హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను పొందుపర్చింది. కోమాలో ఉన్న వారి గార్డియన్‌ ఓ నిర్ణీత వ్యవధిలో వార్డ్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలను కోర్టుకు తెలియజేయాలి. అత్యవసర సమయాల్లో వార్డ్‌కు సంబంధించిన వారు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని