Health Insurance: ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని ఎవ‌రు ఎంచుకోవాలి?

కుటుంబంలోని ప్ర‌తి వ్య‌క్తి ఆరోగ్య బీమాను క‌లిగి వుండ‌డం ఎంతో అవ‌సరం.

Updated : 01 Mar 2022 13:05 IST

భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఆర్థికంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు ఉద్దేశించిన‌దే ఆరోగ్య బీమా. సంపాదించే వ్య‌క్తిగా మీ ఆరోగ్యం, మీతో పాటు కుటుంబ స‌భ్యుల ఆరోగ్య అవ‌స‌రాల‌ను చూసుకోవాల్సిన బాధ్య‌త‌ మీపైనే ఉంటుంది. ఇందుకోసం ఆరోగ్య బీమా కొనుగోలు త‌ప్ప‌నిస‌రి. మీరు కూడా మీ కుటుంబ స‌భ్యుల కోసం ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవాలి అనుకుంటున్నారా?అయితే, కుటుంబ స‌భ్యులు అంద‌రికి క‌లిపి ఒకే పాల‌సీ తీసుకోవ‌డం మంచిదా?లేదా విడివిడిగా పాల‌సీల‌ను తీసుకోవడం మంచిదా?అనే ప్ర‌శ్న‌కు ముందుగా స‌మాధానం తెలుసుకోవాలి. 

వైద్య ఖ‌ర్చులు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్న ప్ర‌స్తుత‌ ప‌రిస్థితుల‌లో ఆరోగ్య బీమా చాలా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కుటుంబంలోని అందరూ ఆరోగ్య బీమాను క‌లిగి వుండ‌డం ఎంతో అవ‌సరం. అందుకోసం బీమా సంస్ధ‌లు చాలా ర‌కాలైన బీమా పాల‌సీల‌ను అందుబాటులో వుంచాయి. అందులో ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌ పాల‌సీ ఒక‌టి. 

ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌ పాల‌సీ అంటే ఏమిటి? 
కుటుంబంలోని స‌భ్యులంద‌రిని ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణించి ఇచ్చేదే ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌ పాల‌సీ. కుటుంబంలో ఉన్న స‌భ్యుల మీద ఆధార‌ప‌డి వివిధ ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌ పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. పాల‌సీ తీసుకునే వ్య‌క్తి, అత‌ని/ఆమె జీవిత భాగ‌స్వామి, ఇద్ద‌రు పిల్ల‌లు, అత‌ని/ఆమె త‌ల్లితండ్రులు, నాన‌మ్మ తాత‌య్య‌లు అంద‌రికి క‌లిపి ఈ ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీని తీసుకోవ‌చ్చు. సాధార‌ణ ఆరోగ్య బీమా మాదిరిగానే అన్ని ప్ర‌యోజ‌నాలు, మిన‌హాయింపులు దీనికి కూడా వ‌ర్తిస్తాయి. కానీ వ్య‌త్యాసం ఏమిటంటే.. ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా ప‌రిగ‌ణించ‌డం వ‌ల్ల కుటుంబంలోని ఒక సభ్యుని కోసం.. పాల‌సీ క్లెయిమ్ చేస్తే.. ఆ సంవ‌త్స‌రానికి మిగిలిన కుటుంబానికి బీమా క‌వ‌రేజ్‌ త‌గ్గుతుంది. ఒక‌వేళ పాల‌సీ తీసుకున్న స‌భ్యుడు మ‌ర‌ణిస్తే పాల‌సీ వేరొక‌రి పేరుకి బ‌దిలీ చేసుకోవ‌ల‌సి ఉంటుంది. త‌ర్వాత‌ ఏడాది ప్రీమియం మిగిలిన కుటుంబ స‌భ్యుల ఆధారంగా నిర్ణ‌యిస్తారు. 

ఏవిధంగా ప్ర‌యోజ‌న‌కరం?
ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ‌ ఖ‌ర్చుతో కుటుంబ స‌భ్యులంద‌రినీ ఆరోగ్య‌ బీమా క‌వ‌రేజ్‌ కిందకి తీసుకొనిరావ‌చ్చు. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీలో కుటుంబంలో పెద్ద వ‌య‌స్సు ఉన్న స‌భ్యుడిని దృష్టిలో వుంచుకుని ప్రీమియం నిర్ణ‌యిస్తారు. కాబ‌ట్టి, చిన్న కుటుంబం ఉన్న వారు ఈ పాల‌సీ ద్వారా అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌తో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. 
శ్ర‌వ‌ణ్‌కు 35 సంవ‌త్స‌రాలు, ఉద్యోగం చేస్తున్నాడు. అత‌నికి, భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. త‌న తల్లిదండ్రుల‌తో క‌లిసి జీవిస్తున్నాడు. అత‌ని త‌ల్లిదండ్రులు ఉభ‌యుల‌కు డ‌యాబెటిస్‌. శ్ర‌వ‌ణ్‌ త‌న డ‌యాబెటిక్ త‌ల్లిదండ్రుల కోస‌మే కాకుండా మొత్తం కుటుంబం కోసం ఆరోగ్య బీమాను తీసుకోవాల‌నుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త‌న కుటుంబం ఆరోగ్యంగా వుండ‌వ‌చ్చు. కానీ భ‌విష్య‌త్తులో వ‌చ్చే వైద్య ప‌ర‌మైన ఖ‌ర్చులను అధిగమించ‌డం కోసం ఆరోగ్య బీమా అవ‌సరం అని భావిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో శ్ర‌వ‌ణ్ ఎలాంటి పాల‌సీని ఎంచుకుంటే మంచిది? కుటుంబ స‌భ్యులంద‌రిని క‌వ‌ర్ చేసే ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీ మంచిదా? లేదా విడివిడిగా ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిదా? 

ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ త‌క్కువ ఖ‌ర్చుతో కుటుంబ సభ్యులంద‌రినీ క‌వ‌ర్ చేస్తూ బీమా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న‌ప్ప‌టి, చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియం కుటుంబంలోని పెద్ద వ‌య‌స్సు స‌భ్యునిపై ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే ఇక్క‌డ పాల‌సీ ప్రీమియం శ్ర‌వ‌ణ్ తండ్రి వ‌య‌స్సు, ఆరోగ్య ప‌రిస్థితుల ఆధారంగా నిర్ణ‌యిస్తారు. కాబ‌ట్టి ప్రీమియం అధికంగా వుంటుంది. కాబ‌ట్టి శ్ర‌వ‌ణ్‌ త‌న త‌ల్లిదండ్రుల కోసం.. వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా విడిగా ఆరోగ్య‌బీమాను కొనుగోలు చేయ‌డం మంచిది. అలాగే అత‌ను, అత‌ని భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల కోసం ఫ్యామిలి ప్లోట‌ర్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని