‘పే యాజ్ యూ డ్రైవ్’ మోటారు బీమాను ఎవరు ఎంచుకోవాలి?

ఐసీఐసీఐ లోంబార్డ్ ఈ పాలసీని రెండు నెలల క్రితమే ప్రారంభించింది

Published : 27 Dec 2020 17:07 IST

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ ఏడాది జనవరిలో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ కింద వివిధ ప్రతిపాదనలను ఆమోదించింది. ఐఆర్డీఏఐ శాండ్‌బాక్స్ ప్రాజెక్ట్ కింద ప్రైవేట్ కార్ల యజమానుల కోసం ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీలను భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లొంబోర్డ్, అకో ఇన్సూరెన్స్ అందించనున్నాయి. దీని ప్రకారం, ఇకపై మీరు కారు బీమా కోసం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా కారు బీమా ప్రీమియంను చెల్లించవచ్చు. ఐసీఐసీఐ లోంబార్డ్ ఈ పాలసీని రెండు నెలల క్రితమే ప్రారంభించింది, అయితే లాక్ డౌన్ కారణంగా సంస్థకు ఆశించినంత స్పందన రాలేదు.

కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో దాని ఆధారంగా పాలసీదారులకు కారు ప్రీమియం చెల్లించడానికి అనుమతిస్తుంది. వినియోగదారుల మధ్య కారు వినియోగం చాలా వైవిధ్యంగా ఉన్నందున, తక్కువ డ్రైవ్ చేసేవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రోడక్ట్ కింద, పాలసీదారుడు ఒక సంవత్సరం పాటు వాహన వినియోగాన్ని ముందే ప్రకటించాలి. దీని ప్రకారం, బీమా ప్రీమియం ముందుగా ప్రకటించిన కిలో మీటర్ల ప్రకారం లెక్కిస్తారు. వినియోగదారులు వారి వినియోగ అవసరానికి అనుగుణంగా 2500 కిమీ., 5000 కిమీ., 7500 కిమీ అనే మూడు స్లాబ్‌లను ఎంచుకోవచ్చు. దీన్ని సాధారణ బీమా పాలసీగా అందించడానికి బీమా సంస్థలు ఆరు నెలల్లో 10,000 పాలసీలను అమ్మాల్సి ఉంటుంది. 2500 కిమీ స్లాబ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 25 శాతం తగ్గింపును, 5000 కిమీ స్లాబ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 15 శాతం తగ్గింపును, 7,500 కిమీ స్లాబ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ అండర్ రైటింగ్ అండ్ రీఇన్స్యూరెన్స్ ఆఫీసర్ మిలింద్ వి కోహ్లే తెలిపారు.

వినియోగ విధానం ప్రకారం అందుబాటులో ఉన్న మూడు స్లాబ్‌ల నుంచి పాలసీదారుడు ప్లాన్ ను ఎంచుకోవాలి. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మీటర్ రీడింగ్, కేవైసీ వివరాలు, కస్టమర్ సమ్మతి పత్రాన్ని అందించాలి. ముందుగా ప్రకటించిన స్లాబ్ ప్రకారం, ప్రీమియం ప్రయోజనాన్ని పోస్ట్ ఫ్యాక్టరింగ్ చేసిన తరువాత ఓన్ డామేజ్ (ఓడీ) ప్రీమియంను లెక్కిస్తారు. జారీ చేసిన పాలసీకి ప్రామాణిక మోటారు ఓన్ డామేజ్ కవర్ కింద ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది.

డిక్లేర్డ్ యూజ్ స్లాబ్ ప్రకారం, అదనపు ప్రీమియం ప్రయోజనాలను పొందడమే కాకుండా, పాలసీదారుడు పాలసీ కాలపరిమితి మధ్యలో అధిక స్లాబ్‌కు వెళ్లడానికి లేదా ప్రామాణిక మోటారు ఓన్ డామేజ్ కవర్‌కు మారే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పాలసీదారుడు కిలోమీటర్ల ఉల్లంఘన విషయంలో పాలసీని పునరుద్ధరించకపోయినా, పాలసీ లైబిలిటీ కవరేజ్ పాలసీ మొత్తం కాలవ్యవధికి చెల్లుతుంది. అంతేకాకుండా, పాలసీ కాలపరిమితిలో తలెత్తే ఏదైనా థర్డ్ పార్టీ క్లెయిమ్ ప్రస్తుతమున్న లైబిలిటీ క్లెయిమ్ ప్రాక్టీస్ ప్రకారం పరిగణించబడుతుంది.

ఈ పాలసీ ఎవరికీ ప్రయోజనం?

బహుళ వాహనాలను కలిగి ఉండి, ప్రతి వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించని వినియోగదారులకు పే యాజ్ యూ డ్రైవ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వారు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజా రవాణా ద్వారా ప్రతిరోజూ ప్రయాణించే వారికి లేదా తరచుగా నగర పరిమితికి మించి ప్రయాణించేవారికి, అలాగే వారి వ్యక్తిగత వాహనాన్ని అరుదుగా ఉపయోగించే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు