Updated : 09 May 2022 16:37 IST

Car Loan: కారు లోన్‌.. త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిని ఎందుకు ఎంచుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు కొనేవారి సంఖ్య గ‌త కొన్నేళ్ల నుంచి భారీగా పెరిగింది. ఒక‌ప్పుడు ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన వారికే పరిమితమైన ఈ వాహనం.. ఇప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారులు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీనికి బ్యాంకులు, వివిధ రుణ‌సంస్థ‌లు విరివిగా కారు రుణాల‌ను అందించ‌డం కూడా ఒక కార‌ణం. అయితే ఈ రుణాల‌కు ఈఎంఐలు చెల్లించ‌డానికి కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌డం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి.

కారు రుణాల‌కు త‌క్కువ కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌డం అంటే వ‌డ్డీ ఖ‌ర్చులు భారీగా త‌గ్గించుకోవడమే. ఇల్లు లేదా కారు కొన‌డం అనేది కొంత మంది తీసుకునే పెద్ద ఆర్థిక నిర్ణ‌యాల్లో ఒక‌టి. చాలా మంది సాధార‌ణంగా ఈ ఖ‌ర్చుల‌కు రుణం తీసుకోవ‌డం ద్వారా ఆర్థిక సాయం తీసుకుంటారు. రుణం తీసుకునేట‌ప్పుడు రుణ‌గ్ర‌హీత ఎన్ని ఈఎంఐలు చెల్లించాలి? ఎంత కాల‌ప‌రిమితిని ఎంచుకోవాలి? మొద‌లైన అనేక నిర్ణ‌యాలు ఆలోచించి తీసుకోవాలి.

బ్యాంకులు గ‌రిష్ఠంగా 7 నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా కారు రుణాల‌ను అందిస్తాయి. ఉదా: ఎస్‌బీఐ గ‌రిష్ఠంగా 7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు కారు రుణాల‌ను అందిస్తోంది. కారు రుణాన్ని ఎంచుకునే స‌మ‌యంలో బ్యాంకులు ఇప్పుడు ఎక్కువ కాల‌ప‌రిమితిని అందిస్తున్న‌ప్ప‌టికీ, రుణ‌గ్ర‌హీత‌లు త‌క్కువ కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవాల‌ని నిపుణులు అంటున్నారు. త‌క్కువ కాల వ్య‌వ‌ధిని క‌లిగి ఉండ‌టం వ‌ల్ల అధిక ఈఎంఐ మొత్తాల‌ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ, ఇది వ‌డ్డీ ఖ‌ర్చుల మొత్తాల‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల త‌క్కువ కాల వ్య‌వ‌ధిని క‌లిగి ఉండ‌టం వల్ల మీరు కారు రుణాన్ని త్వ‌ర‌గా చెల్లించ‌వ‌చ్చు.

ఉదా: మీరు 8.5% వ‌డ్డీ రేటుతో రూ.10 ల‌క్ష‌ల కారు రుణాన్ని, 4 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి పెట్టుకుంటే ఈఎంఐ దాదాపు రూ. 24,000 అవుతుంది. అయితే 8 సంవ‌త్స‌రాలు కాల‌వ్య‌వ‌ధి పెట్టుకుంటే ఈఎంఐ దాదాపు 14,000 అవుతుంది. 4 సంవ‌త్స‌రాల కారు రుణంపై చెల్లించే వ‌డ్డీ దాదాపు రూ.1.83 ల‌క్ష‌లు అవుతుంది. అయితే 8 సంవ‌త్స‌రాల కారు రుణంపై చెల్లించే వ‌డ్డీ దాదాపు రూ.3.81 ల‌క్ష‌లు అవుతుంది. ఈ వ‌డ్డీ మొత్తం 4 సంవ‌త్స‌రాలలో చెల్లించే దాంతో పోలిస్తే రెట్టింపు క‌న్నా ఎక్కువ‌.

వినియోగ‌దారులు ప‌రిగ‌ణించాల్సిన మరో ముఖ్య‌మైన అంశం ఏమిటంటే త‌క్కువ రుణ కాల వ్య‌వ‌ధితో పోలిస్తే, ఎక్కువ కాల వ్య‌వ‌ధిపై వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. బ్యాంకులు ఎక్కువ కాలం పాటు ఉన్న కారు రుణంపై దాదాపు 50 బేసిస్ పాయింట్ల అధిక వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తాయి. బ్యాంకులు/రుణ సంస్థ‌లు రుణ‌గ్ర‌హీత‌పై తీసుకుంటున్న అద‌న‌పు క్రెడిట్ రిస్క్‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఇదో మార్గం అని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

గ‌మ‌నించద‌గ్గ మ‌రో అంశం ఏమిటంటే, కారు స‌గ‌టు వినియోగ వ్య‌వ‌ధి సాధార‌ణంగా 5-6 సంవ‌త్స‌రాలు. ఆ త‌ర్వాత దానిని విక్ర‌యించ‌డం లేదా సెకండ్ హ్యాండ్ డీల‌ర్‌కు అందించ‌డం లాంటివి వినియోగ‌దారులు చేస్తుంటారు. దీర్ఘకాలిక రుణ కాల వ్య‌వ‌ధిని క‌లిగి ఉండ‌టం ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే కారు య‌జ‌మాని దానిని విక్ర‌యించేట‌ప్పుడు ఒకేసారి రుణ బ‌కాయిల‌ను తీర్చేయాల్సి ఉంటుంది. అది ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది. అంతే కాకుండా కారు త‌యారీదారులు సాధార‌ణంగా 8 సంవ‌త్స‌రాల వారంటీని ఇవ్వ‌రు. కాబ‌ట్టి కారు కొనుగోలు చేసిన కొన్ని ఏళ్ల త‌ర్వాత భారీ నిర్వ‌హ‌ణ ఛార్జీలు ఉంటాయి. ఈఎంఐతో పాటు అధిక నిర్వ‌హ‌ణ ఛార్జీలు మీకు ఆర్థిక భారంగా మారొచ్చు. కాబ‌ట్టి కారు రుణాన్ని ఎంచుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. వ‌డ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-పేమెంట్ ఛార్జీలు, కారు రుణంతో పాటు ఇత‌ర అనుబంధ ఛార్జీల‌ను కూడా త‌నిఖీ చేసుకోవాలి.

చివ‌ర‌గా: వినియోగ‌దారుడు మ‌ంచి క్రెడిట్ స్కోర్‌తో, మెరుగైన వ‌డ్డీ రేట్లు, ఇత‌ర ఛార్జీల మాఫీ కోసం బ్యాంకుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపితే మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని