వాహన బీమా క్లెయిమ్‌లను కంపెనీలు ఎందుకు తిర‌స్క‌రిస్తాయి?

ఏ మోటారు వాహ‌నానికైనా బీమా త‌ప్ప‌నిస‌రిగా చేయించాలి. ర‌వాణా చ‌ట్ట ప్ర‌కారం థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. యాడ్ ఆన్‌ల‌తో కూడిన బీమా చేయించుకుంటే అధిక ర‌క్ష‌ణ ఉండ‌ట‌మే కాకుండా ఆర్థిక నష్టాలను నివారిస్తుంది.

Updated : 23 Nov 2022 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ మోటారు వాహ‌నానికైనా బీమా త‌ప్ప‌నిస‌రిగా చేయించాలి. ర‌వాణా చ‌ట్ట ప్ర‌కారం థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. యాడ్ ఆన్‌ల‌తో కూడిన బీమా చేయించుకుంటే అధిక ర‌క్ష‌ణ ఉండ‌ట‌మే కాకుండా ఆర్థిక నష్టాలను నివారిస్తుంది. బీమా చేయించుకునేట‌ప్పుడు పాల‌సీ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను చ‌దివి అర్థం చేసుకోవాలి. పాల‌సీ అమ‌ల్లో ఉన్న కాల వ్య‌వ్య‌ధిలో నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉన్న ఏ క్లెయిమ్‌నైనా బీమా కంపెనీ క‌వ‌ర్‌ చేస్తుంది. కానీ చాలామంది పాల‌సీ డాక్యుమెంట్ చ‌ద‌వ‌రు. పాల‌సీ ప‌రిధి, మిన‌హాయింపుల గురించి తెలుసుకోరు. అందుకే క్లెయిమ్‌ సమయంలో పాలసీ తిరస్కరణకు గురౌతుంది. ఇంతకీ క్లెయిమ్‌ తిరస్కరణకు గల కారణాలు ఇక్కడ ఉన్నాయి.

ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత‌, మీరు బీమా కంపెనీకి తెలియ‌జేయాల్సిన గ‌డువు ఉంటుంది. బీమా కంపెనీకి తెలియ‌చేయ‌డంలో ఏదైనా అధిక జాప్యం జ‌రిగితే క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు దారితీయొచ్చు. ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. అలాగే, వాహ‌నం న‌డిపే వ్య‌క్తి డ్రైవింగ్ లైసెన్స్ క‌లిగి ఉండాలి. లైసెన్స్ గ‌డువు ముగియ‌కూడ‌దు. అది ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అమ‌ల్లో ఉండాలి.

వాహ‌న యాజ‌మాని త‌న పేరు మీద రిజిస్ట్రేష‌న్‌, బీమాను చేయించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌యితే అటువంటి సంద‌ర్భంలో వాహ‌నం ప్ర‌మాదానికి గురైతే ఆర్‌టీఓ ద్వారా యజమానికి చ‌ట్ట‌ప‌ర‌మైన బ‌దిలీ లేనందున‌, బీమా సంస్థ ద్వారా క్లెయిమ్ స్వీక‌రించ‌రు. కచ్చితంగా పాల‌సీదారుడు వాహ‌నం న‌మోదిత య‌జ‌మాని అయి ఉండాలి. వాహ‌నంలో ఏవైనా మార్పులు చేసిన‌ట్ల‌యితే, బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. పాల‌సీదారుడు అద‌న‌పు ప్రీమియం చెల్లించి క‌వ‌ర్ పొందాలి. ఈ మార్పుల‌ను ప్ర‌క‌టించ‌కుంటే క్లెయిమ్ తిర‌స్క‌రించొచ్చు.

బీమా పాల‌సీని కొనుగోలు చేసిన‌ప్పుడు, కారు ప‌రిస్థితి, మీ మునుప‌టి బీమా చ‌రిత్ర మొద‌లైన‌వాటి గురించి స‌రైన స‌మాచారం ఇవ్వాలి. త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌డం వ‌ల్ల మీ పాల‌సీ చెల్లుబాటు కాద‌ని భావించి, బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిర‌స్క‌రించే అవ‌కాశ‌ముంది. వాహ‌న బీమా పాల‌సీని స‌కాలంలో పున‌రుద్ధ‌రించ‌డంలో విఫ‌ల‌మైతే మీ పాల‌సీ ర‌ద్దు అవుతుంది. అటువంటి ప‌రిస్థితిలో వాహ‌నం ప్ర‌మాదానికి గురైతే, బీమా కంపెనీ క్లెయిమ్‌ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోదు. ప్ర‌మాద న‌ష్టానికి సొంతంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిపితే చ‌ట్ట‌రీత్యా నేరం. ఇది నేరారోప‌ణ‌లు ఎదుర్కొనేలా చేస్తుంది. అటువంటి సంద‌ర్భంలో లేవ‌నెత్తిన ఏ క్లెయిమ్‌నూ బీమా సంస్థ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోదు. అంతేకాకుండా వాణిజ్య ప్ర‌యోజ‌నం కోసం ప్రైవేట్ కారుని వాడినా, బీమా పాల‌సీలో పేర్కొన్న భౌగోళిక ప్రాంతం వెలుప‌ల డ్రైవింగ్ చేసి ప్ర‌మాదానికి గురైనా క్లెయిమ్ తిర‌స్క‌రించే అవ‌కాశ‌ముంది.

చివ‌ర‌గా: అన్ని బీమా అర్హ‌త‌లు ఉండి, మీరు స‌రైన కార‌ణాలతో క్లెయిమ్ చేస్తున్న‌ట్ల‌యితే బీమా కంపెనీలు క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించ‌వు. ఒకవేళ తిరస్కరించినట్టైతే మీరు నేరుగా కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. లేదా ఐఆర్డీఏకి కూడా ఫిర్యాదు చేయొచ్చు. బీమా పాల‌సీ ప‌త్రం, నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను శ్ర‌ద్ధగా చ‌ద‌వాలి. త‌ద్వారా క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌ను నివారించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని