Updated : 30 Mar 2022 13:32 IST

Financial Year: ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తోనే ఎందుకు ప్రారంభమవుతుంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో వివిధ రకాల సంవత్సరాలు వాడుకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం.. కొత్త సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకొంటారు. అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం.. చైత్రమాసంతో ప్రారంభమయ్యే విక్రమ్‌ సంవత్‌, అలాగే శాక సంవత్‌ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటి ఆధారంగానే వేద పండితులు ముహూర్తాలను నిర్ణయిస్తుంటారు. ఇస్లాం సంప్రదాయాలను అనుసరించే వారు హిజ్రీ క్యాలెండర్‌ ఉపయోగిస్తుంటారు. 

వీటితో పాటే ఆర్థిక సంవత్సరం కూడా ఓ ప్రత్యేక ఏడాదిగా కొనసాగుతోంది. ఇది ఏప్రిల్‌ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఇది మన ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపే కాలం. కంపెనీలు, ప్రభుత్వం కూడా వారి కొత్త పద్దులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభిస్తాయి. మరి మన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచే ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా?

బ్రిటిషు వారసత్వం..

ఒకప్పుడు బ్రిటిషు పాలనలో ఉన్న భారత్‌లో.. వారి సంప్రదాయాలకు అనుగుణంగానే ఇక్కడ కీలక కార్యక్రమాలు జరిగేవి. అందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యేది. మరి బ్రిటిషు వారు ఈ తేదీని పరిగణనలోకి తీసుకోవడానికీ ఓ కారణం ఉంది. 

1751కి ముందు బ్రిటిషు వారు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించేవారు. దాని ప్రకారం.. వారి కొత్త సంవత్సరం మార్చి 25న ప్రారంభమవుతంది. కానీ, అప్పటి పాలకులు జనవరి 1తో కొత్త ఏడాది ప్రారంభమయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారాలని నిర్ణయించారు. జూలియన్‌తో పోలిస్తే గ్రెగోరియన్‌ పది రోజులు ముందుంటుంది. పైగా 1751.. మార్చి 25 నుంచి డిసెంబరు 31 వరకు మాత్రమే కొనసాగింది. సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మూడు నెలల ముందే 1751ని ముగించేశారు.

అకౌంటెంట్లు అంగీకరించలేదు..

ఈ మార్పును అప్పటి ఆర్థికశాఖలో పనిచేసే అకౌంటెంట్లు మాత్రం అంగీకరించలేదు. వారు పాత పద్ధతిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. దీంతో ఏటా ఏప్రిల్‌ 6 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా అనుసరిస్తూ వచ్చారు. అంటే జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 25 అన్నమాట! వీరు కొత్త పద్ధతికి మారకపోవడానికి కీలక కారణం ఉంది. అప్పట్లో బ్రిటిషు పాలనలో ఉన్న చాలా దేశాల్లో భూస్వాములకు సాధారణ ప్రజలు మార్చిలో పన్ను కట్టేవారు. మరి కొత్త సంవత్సరానికి మారితే మూడు నెలల ముందే పన్ను వసూలు చేయడం కుదరదు. పైగా పద్దులన్నీ అస్తవ్యస్తమై ఖజానాపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించారు. తర్వాత రోజుల్లో కూడా జనవరికి మారడానికి బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించలేదు. ఎందుకంటే నవంబరు, డిసెంబరులో క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు మునిగి ఉంటారు. పైగా ఉద్యోగులకు సెలవు రోజులు. ఆ సమయంలో ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టడం కుదరదు. డిసెంబరులో జరిగే వ్యాపార లెక్కల్ని నెలాఖరు కల్లా తేల్చడం కూడా అంత సులభం కాదు. అందుకే ఆర్థిక సంవత్సరాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

మార్చి 25 ప్రాధాన్యం ఏంటంటే..

జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 25ను ‘ఈక్వినాక్స్‌’ అంటే విషువత్తుగా పరిగణిస్తారు. అంటే రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. అందుకే ఈరోజుని అప్పట్లో కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. కానీ, వివిధ ఖగోళ మార్పుల వల్ల ఈరోజు కాస్త అటూఇటూగా మారుతుంటుంది. ప్రస్తుతం మార్చి 20 లేదా 21, సెప్టెంబర్‌ 22 లేదా 23 తేదీల్లో ఈ ఈక్వినాక్స్‌లు సంభవిస్తున్నాయి. హిందూ సంప్రదాయంలో మార్చి 21న వసంత విషువత్తు, సెప్టెంబర్ 23న శరద్ విషువత్తులుగా ఏర్పడుతున్నట్లు పరిగణిస్తున్నారు. వీటినే ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించారు. వీటి మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు.

భారత్‌లోనూ అదే పద్ధతిని కొనసాగించడానికి కారణాలు..

* హిందూ సంప్రదాయం ప్రకారం.. వైశాఖ మాసంతో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ ఆరంభంలో వస్తుంటుంది. అందుకే ఏప్రిల్‌ 1 నుంచి ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 

* భారత్‌ వ్యవసాయ ఆధారిత దేశం. అక్టోబర్‌-మార్చి మధ్య రబీ సీజన్‌గా.. జులై-అక్టోబర్‌ మధ్య ఖరీఫ్‌ సీజన్‌గా వ్యవహరిస్తుంటారు. దేశంలో చాలా ప్రాంతాల్లో రబీ పంటలు ఫిబ్రవరి, మార్చిలో చేతికొస్తాయి. పంట ఉత్పత్తుల ఆధారంగా ఆదాయాన్ని గణిస్తారు. ఖరీస్‌ సీజన్‌ ముగిసే అక్టోబరులోనూ పద్దులను తేల్చే అవకాశం ఉన్నప్పటికీ.. అది పండగ సీజన్. భారీగా వ్యాపారం జరిగే సమయం. ఆ లెక్కలన్నీ తేల్చడానికి సమయం పడుతుంది. అందుకే మార్చి నెలలో ముగింపునకు సౌలభ్యంగా ఉంటుంది. అందుకే దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 

ఇతర ఆసక్తికర సమాచారం..

* భారత్‌లో తొలి బడ్జెట్‌ ఏప్రిల్‌ 7, 1860న ప్రవేశపెట్టారు. 1867 వరకు భారత్‌లో మే 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించేవారు. అయితే, బ్రిటిష్‌ ప్రభుత్వ పద్దుతో సమన్వయం కోసం భారత్‌లోనూ 1867 నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌ - మార్చికి మార్చారు.

*  1865లో ఏర్పాటైన ‘ఇండియన్‌ అకౌంట్స్‌ ఎంక్వైరీ కమిషన్‌’ సభ్యులు భారత్‌లో ఆర్థిక సంవత్సరాన్ని జనవరికి మార్చాలని సూచించారు. కానీ, అప్పటి పాలకులు దీనికి అంగీకరించలేదు. దీని వల్ల బ్రిటిషు ప్రభుత్వ లెక్కలు, భారత్‌ పద్దుల మధ్య సమన్వయం కుదరదని భావించారు.

* తర్వాత భారత ఆర్థిక స్థితిగతులు, కరెన్సీపై  సలహాల కోసం 1913లో ఏర్పాటు చేసిన రాయల్‌ కమిషన్‌ లేదా చాంబర్లిన్ కమిషన్‌ సైతం ఆర్థిక సంవత్సరాన్ని నవంబరు1 లేదా జనవరి 1కి మార్చాలని సూచించింది. దీని అమలులో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది. స్వాతంత్ర్యం తర్వాత 1958, 1966లో ఏర్పాటైన పలు కమిటీలు సైతం ఇదే సూచించాయి.

* 1983-84లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక సంవత్సర మార్పుపై రాష్ట్రాల ముఖ్యమంత్రులను సలహా కోరారు. మెజారిటీ సభ్యులు ఏప్రిల్‌ నుంచి జనవరికి మార్చాలని సూచించారు. కొందరు జులై 1, నవంబరు 1ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.

* ఈ ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించడానికి ప్రభుత్వం ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది 1984లో సర్కార్‌కు నివేదిక సమర్పించింది. జవవరి 1కి ఆర్థిక సంవత్సరాన్ని మార్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కమిటీ సూచించింది. నవంబరు కల్లా రెండు సీజన్ల పంటలు కూడా అందుబాటులోకి వస్తాయి గనక నవంబరులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికీ అనువుగా ఉంటుందని చెప్పింది. 

* ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ తోసిపుచ్చింది. ఆర్థిక సంవత్సరాన్ని మార్చడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలేమీ లేవని తేల్చి చెప్పింది. పైగా సమాచారం సేకరించడం కూడా కష్టమవుతుందని తెలిపింది. అందుకే పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని