OPEC: చమురు ఉత్పత్తికి కోతలు.. ఒపెక్‌+ దేశాలకు ఏంటి లాభం?

ముడి చమురు (Crude Oil) ధరల్ని పెంచుకోవడానికి ఒపెక్‌+ దేశాలు ఉత్పత్తికి కోత పెడుతున్నాయి. ఈ నిర్ణయం ఆ దేశాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? భారత (India) దిగుమతులపై ప్రభావం ఉంటుందా? తదితర అంశాల గురించి తెలుసుకోండి.  

Updated : 06 Jun 2023 15:23 IST

రోజురోజుకు తగ్గిపోతున్న ముడి చమురు ధరల్ని (Crude Oil) అదుపు చేసేందుకు సౌదీ అరేబియా (Saudi Arabia) రోజుకు మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోతలను ప్రకటించింది. జులై నుంచి కోతలు అమల్లోకి రానున్నాయి. 23 సభ్య దేశాల ఒపెక్‌ (OPEC) సమావేశం ఆదివారం వియన్నాలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. 2024 చివరి వరకు ప్రస్తుత ఉత్పత్తి కోతలను కొనసాగించడానికి మిగతా ఒపెక్‌+ దేశాలు అంగీకరించాయి. అయితే ఈ కోతలతో ముడి చమురు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయాన్ని పరీశీలించండి.

ఏంటీ ఒపెక్‌ +..?

‘ఒపెక్‌ +’ అనేది 23 చమురు ఎగుమతి దేశాల సమూహం. ప్రపంచ మార్కెట్‌కు ఎంత ముడి చమురు విక్రయించాలనే విషయంపై ఈ దేశాలు తరచూ సమావేశం అవుతుంటాయి. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌)లో 13 దేశాలున్నాయి. అవి ఎక్కువగా పశ్చిమాసియా, ఆఫ్రికన్‌ దేశాలు. ఒపెక్‌ అనేది 1960లో ఒక వ్యాపార సంస్థల బృందంగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా చేయడం, వాటి ధరలు నిర్ణయించడం అప్పట్లో దాని లక్ష్యం. అలా ఒపెక్‌ దేశాలన్నీ కలిసి ప్రపంచానికి 30 శాతం ముడిచమురును సరఫరా చేసే స్థాయికి చేరుకున్నాయి . ఇందులో సింహభాగం వాటా సౌదీ అరేబియాది. ఆ దేశం రోజుకు 10 మిలియన్‌ బ్యారెళ్ల కన్నా ఎక్కువ ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది.

2016లో ముడి చమురు ధరలు అమాంతం పడిపోయాయి. దాంతో చమురును విక్రయించి ఆదాయం గడించే దేశాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్‌లోకి మరో 10 దేశాలు చేరాయి. అప్పటి నుంచి ఒపెక్‌ కాస్తా ఒపెక్‌+గా రూపాంతరం చెందింది. అలా కొత్తగా చేరిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ దేశం రోజుకు 10 మిలియన్ల బారెళ్ల కన్నా ఎక్కువ చమురును తోడేస్తోంది. ఒపెక్‌+ ఏర్పాటుతో ప్రపంచ చమురు విక్రయాల్లో ఈ దేశాల వాటా 40 శాతానికి చేరింది. ఇవన్నీ కలిసి ముడి చమురు ధరలు పతనమైన సందర్భంలో సరఫరాలో కోత విధించడం, ధరలు ఆకాశాన్నంటుతున్నప్పుడు సరఫరా పెంచడం చేస్తున్నాయి.

ఇప్పుడు కోత ఎందుకంటే..?

సౌదీ అరేబియా ప్రకటించిన రోజుకు మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోత ప్రభావం జులై నుంచి ఉంటుంది. గత ఏప్రిల్‌లోనే రోజుకు 1.16 బ్యారెళ్ల ముడిచమురు కోత విధించాలని ఒపెక్‌+ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కోతలు పెంచడం ద్వారా బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధరను 80 డాలర్లకు పెరుగుతుందని సౌదీ అరేబియా ఆశిస్తోంది. దాంతో ఆ ప్రభుత్వానికి ఖర్చుల భారం కొంత మేర తగ్గుతుందని భావిస్తోంది. 2020లో కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పడిపోయాయి. దాంతో ఒపెక్‌ + దేశాలు ఉత్పత్తి తగ్గించి ధరలను పెంచేశాయి.

గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర  చేసిన పరిణామాల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌ 130 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి అది 70 డాలర్లకు పడిపోయి.. 15 నెలల కనిష్ఠానికి చేరింది. తాజా కోతల ద్వారా బ్యారెల్‌ ధర కనీసం 80 డాలర్లకు చేరుతుందని ఒపెక్‌+ దేశాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురుకు డిమాండ్‌ లేదని, ఇప్పట్లో అంతకు మించి ధర రావడం కష్టమేనని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవృద్ధి ప్రస్తుతం మందగమనంలో సాగుతోంది. చైనా, భారత్‌ వంటి దేశాలకు చమురు బాగా అవసరం అయినప్పటికీ ధరలు పెంచే స్థాయిలో అక్కడ దిగుమతులు ఉండబోవని అభిప్రాయపడుతున్నారు.

రష్యా నుంచి పెరిగిన దిగుమతులు 

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన కారణంగా ఐరోపా సమాఖ్యలోని దేశాలు రష్యా నుంచి చమురు కొనడం ఆపేశాయి. అమెరికా, బ్రిటన్‌ ఒక్కమాట మీద నిలబడి కొనుగోళ్లను నిరాకరించాయి. అందువల్ల రష్యా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఆ ప్రక్రియలో భాగంగా భారత్, చైనాలకు తమ ముడి చమురును విక్రయిస్తోంది. భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. మేలో రష్యా నుంచి రోజుకు 1.96 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వొర్టెక్సా డేటా చెబుతోంది. ఇటీవల కొన్నేళ్లలో ఒక దేశం నుంచి అత్యధికంగా భారత్‌ ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే ప్రథమం. ఒపెక్‌ యేతర దేశాల లీడర్‌గా ఉన్న రష్యా మాత్రం ఉత్పత్తి కోతలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తాజాగా సంకేతాలు ఇవ్వడం భారత్‌కు కొంత సానుకూల అంశం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని