PPF: పీపీఎఫ్‌ ఖాతాలో కనీస డిపాజిట్‌ ఎందుకు చేయాలి?

ఖాతా యాక్టివ్‌గా ఉంటేనే రుణ సదుపాయం, పాక్షిక విత్‌డ్రాలు వంటి సేవలను పొందేందుకు వీలుంటుంది.

Published : 23 Jan 2023 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజా భవిష్య నిధి (PPF).. పేరుకు తగినట్లుగానే అన్ని వర్గాల ప్రజలు పెట్టుబడులు పెట్టగలిగే ప్రభుత్వ పథకం. చిన్న చిన్న మొత్తాలతో దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు చేసేవారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది. ప్రస్తుత త్రైమాసికానికి 7.10% వడ్డీ ఇస్తోంది. రాబడికి ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి నష్టభయం ఉండదు. అయితే, ఈ పథకానికి 15 ఏళ్ల దీర్ఘకాల మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. ఖాతాను కొనసాగించేందుకు ప్రతి ఏడాదీ కనీస మొత్తం రూ.500 జమచేయాలి. ఏదైనా కారణం చేత కనీస మొత్తం డిపాజిట్‌ చేయకపోతే.. ఖాతా ఇన్‌-యాక్టివ్‌ అవుతుంది.

ఎందుకు యాక్టివ్‌గా ఉంచుకోవాలి?

పీపీఎఫ్‌ ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ వస్తూనే ఉంటుంది. అయితే పీపీఎఫ్‌ ఖాతాలో ఇతర ప్రయోజనాలను కోల్పోతారు. పీపీఎఫ్‌ ఖాతా తెరిచిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు రుణ సదుపాయం, 7వ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలు అందుబాటులో ఉంటాయి. ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఈ సదుపాయాలను పొందలేరు. మెడికల్‌ ఎమర్జెన్సీ, పిల్లల పాఠశాల ఫీజులు, ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం పీపీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, సంవత్సరానికి ఒకసారి కనీస డిపాజిట్‌ చేసిన ఖాతాదారులు మాత్రమే ఈ సేవలు పొందేందుకు అర్హులు.

పీపీఎఫ్‌ ఖాతాను ఎలా పునరుద్ధరించాలి?

  • పీపీఎఫ్‌ ఖాతాను యాక్టివ్‌గా ఉంచేందుకు ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోపు కనీసం రూ.500 ఖాతాలో జమ చేయాలి. లేకపోతే ఖాతా ‘ఇన్‌యాక్టివ్‌’గా మారుతుంది.
  • ఒకవేళ మీ పీపీఎఫ్‌ ఖాతా మనుగడలో లేకపోతే.. పునరుద్ధరణ కోసం ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌లో రాతపూర్వక అభ్యర్థనను ఇవ్వాలి. 
  • దరఖాస్తుతో పాటు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ప్రతి సంవత్సరానికి రూ.500 చొప్పున, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.500 ఖాతాలో జమచేయాలి. 
  • అలాగే, పెనాల్టీ కింద ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా ఉన్న ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.50 చొప్పున బ్యాంకు/ పోస్టాఫీసు బ్రాంచిలో జమచేయాలి. 
  • ఉదాహరణకు మీరు 10 ఏళ్ల క్రితం పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించారు. 7 ఏళ్ల పాటు రూ.500 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్‌ చేసుకుంటూ వచ్చారు. 3 ఏళ్లు ఎలాంటి డిపాజిట్‌ చేయలేదు. ఇప్పుడు ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి, రూ.500x3=రూ.1,500.. ప్రతి ఆర్థిక సంవత్సరానికి జరిమానా రూ.50x3=రూ.150... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.500... మొత్తంగా రూ.2,150 జమ చేసి, 11వ సంవత్సరం పీపీఎఫ్‌ ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. 
  • దరఖాస్తుతో పాటు డబ్బు జమ చేసిన తర్వాత బ్యాంక్‌/పోస్టాఫీసు మీ రికార్డులను సమీక్షిస్తుంది. 15 సంవత్సరాల లాక్‌-ఇన్‌ వ్యవధి పూర్తయితే ఖాతాను మళ్లీ యాక్టివేట్‌ చేయడం సాధ్యం కాదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని