EXPLAINED: కేంద్రం ఆ రెండు బిల్లులను ఎందుకు పక్కన పెట్టింది?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు కొద్ది రోజులముందు రెండు అంశాలపై విపరీతంగా చర్చ నడిచింది. ఒకటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినది కాగా.. రెండోది రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి. వీటికి సంబంధించి రెండు కీలక బిల్లులను కేంద్రం తీసుకొస్తోందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

Published : 22 Dec 2021 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు కొద్ది రోజులముందు రెండు అంశాలపై విపరీతంగా చర్చ నడిచింది. ఒకటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినది కాగా.. రెండోది రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి. వీటికి సంబంధించి రెండు కీలక బిల్లులను కేంద్రం తీసుకొస్తోందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. సమావేశాలు ప్రారంభం కావడం.. ముగియడం కూడా జరిగిపోయింది. కానీ, ఆ రెండు బిల్లులు ఈ సారి చర్చకు రాకపోవడం గమనార్హం. బాలికల వివాహ వయస్సు, ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లులు అనూహ్యంగా తెరపైకి రావడంతో వీటి సంగతి పక్కకుపోయింది. ఈ రెండు బిల్లుల విషయంలో దూకుడుగా ఉన్న ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది? ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఆపిన కారణాలేంటి?

శీతాకాల సమావేశాలకు కొద్ది రోజుల ముందు క్రిప్టోపై గట్టిగానే చర్చ నడిచింది. పత్రికల్లో పెద్దఎత్తున ఈ కరెన్సీ గురించి ప్రకటనలు రావడం.. మోదీ ఉన్నత స్థాయి అధికారులతో దీనిపై భేటీ కావడం.. పార్లమెంటరీ ప్యానెల్‌ సైతం పలు పార్టీల ఎంపీలతో చర్చించడంతో ఈ బిల్లుపై తీవ్ర చర్చ నడిచింది. ఆర్‌బీఐ తీసుకురాబోయే డిజిటల్‌ కరెన్సీతో కలిపి క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021 పేరిట ఓ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే, పలు కారణాల వల్ల కేంద్రం వెనక్కి తగ్గింది. క్రిప్టో విషయంలో విధివిధానాలు ఖరారు చేయడంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. క్రిప్టోను నిషేధించాలని ఆర్‌బీఐ చెబుతుండగా.. ఈ ఊహాజనిత కరెన్సీని నిషేధించడం సరికాదన్న వాదనలూ వినిపించాయి. క్రిప్టోను కరెన్సీ కాకుండా.. క్రిప్టో అసెట్‌గా పరిగణించాలని, సెబీకి దాని నియంత్రణాధికారం కట్టబెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే, క్రిప్టోపై పన్ను విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం కింద తీసుకురావాలా? సేవలుగా భావించి జీఎస్టీ చట్టాన్ని వర్తింపజేయాలన్న అనే విషయంలో అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో తొందరపాటు సరికాదని భావించి ఆ ప్రయత్నాలను కేంద్రం విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమావేశాల అనంతరం ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశాలూ ఉన్నాయన్న మాటలూ వినిపిస్తున్నాయి.

ఎన్నికలే కారణమా..?
పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కొన్నాళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రం.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఓ బీమా కంపెనీని సైతం ప్రైవేటీకరిస్తామని బడ్జెట్‌ సందర్భంలో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని బ్యాంకులను షార్ట్‌లిస్ట్‌ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటు 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌కు సవరణలు చేయడమే లక్ష్యంగా బిల్లునూ ఈ సమావేశాల్లోనే తేవాలని ప్రభుత్వం తలపోసింది. అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో కేబినెట్‌ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంగళవారం ఆర్థికమంత్రి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, వచ్చే ఏడాది జరగబోయే యూపీ, పంజాబ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కావాలనే ఈ బిల్లును తీసుకురాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం.. రాజకీయంగా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాయిదా వేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఓ వైపు శీతాకాల సమావేశాలు కొనసాగుతుండగా.. మరోవైపు బ్యాంక్‌ యూనియన్లు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబర్‌ 16, 17 తేదీల్లో దేశవ్యాప్త బంద్‌ చేపట్టాయి. దీనికి రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్త చర్చకు దారితీసిన ఈ అంశాన్ని తెగేదాకా లాగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం.. బిల్లు ప్రయత్నాలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని