Banking: బ్యాంకు ఖాతాకు నామినీ ఎందుకు అవసరం..?

ఖాతాదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే అత‌ను/ ఆమె ఖాతాలోని డ‌బ్బును ఎవ‌రికి అంద‌జేయాలో తెలియ‌జేయ‌డ‌మే నామినేష‌న్‌. 

Updated : 26 Feb 2022 14:47 IST

ఆర్థిక లావాదేవీల‌న్నింటికీ బ్యాంకు ఖాతానే కీల‌కం. వ‌చ్చే ఆదాయం, చేసే ఖ‌ర్చులు.. అన్నిటికీ పొదుపు ఖాతా అవ‌స‌ర‌మే. ఉద్యోగుల జీతం, పెన్ష‌న‌ర్ల పింఛ‌ను, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, అన్నీ పొదుపు ఖాతాకే చేరతాయి. అలాగే, బిల్లులు చెల్లించాల‌న్నా, పెట్టుబ‌డులు చేయాల‌న్నా పొదుపు ఖాతా నుంచే చేస్తుంటాము. అందువ‌ల్ల ఈ రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రికీ పొదుపు ఖాతా ఉండ‌డం అవ‌స‌రం. ఇంత‌టి ప్రాముఖ్య‌త ఉన్న పొదుపు ఖాతకు నామినీని అవసరమా, లేదా?

నామినీని ఎందుకు నియ‌మిస్తారు?
ఖాతాదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే అత‌ను/ఆమె ఖాతాలోని డ‌బ్బును ఎవ‌రికి అంద‌జేయాలో తెలియ‌జేయ‌డ‌మే నామినేష‌న్‌. బ్యాంకు ఖాతాకు నామినీని జ‌త చేసిన‌ట్ల‌యితే కోర్టు ఆర్డర్, వారసత్వ ధృవీకరణ పత్రం(లీగ‌ల్ హెయిర్ స‌ర్టిఫికేట్‌) లేదా అడ్మినిస్ట్రేషన్ లెటర్ వంటివి అవ‌స‌రం లేకుండా ఖాతాలోని నిధుల‌ను ఖాతాదారుడు నామినీగా నియ‌మించిన వ్య‌క్తికి బ‌దిలీ చేస్తాయి బ్యాంకులు. నామినీ నియ‌మించ‌కుండానే ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులు కోర్టు నుంచి వార‌స‌త్వ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని  పొందాలి. అప్పటి వ‌ర‌కు ఖాతాలోని నిధుల‌ను కుంటుంబ స‌భ్యులు కూడా తీసుకోవ‌డం సాధ్యం కాదు.

నామినీగా ఎవ‌రిని నియ‌మించాలి?
చాలా సందర్భాలలో..ఖాతాదారుని చట్టపరమైన వారసుడినే నామినీగా నియ‌మిస్తారు. అయితే, ఇది అన్ని సందర్భాలలో ఒకేలా ఉండకపోవచ్చు. నామినీ, ఖాతాదారుని నిధులకు ‘ట్రస్టీ’గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తారు. చట్టబద్ధమైన వారసులు వాటిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసే వరకు ఆ నిధుల‌కు అతను/ఆమె సంరక్షకుడుగా ఉంటారు. అందుచేత చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌నే నామినీగా నియ‌మించ‌డం మంచిది. 

నామినీని ఏర్పాటు చేసేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..
* బ్యాంకులో కొత్త‌గా పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల‌ను తెరిచే వారు నామినీ పేరుని స‌బ్మిట్ చేయాలి. నిజానికి బ్యాంకులు ఖాతా తెరిచేందుకు పూర్తి చేయాల్సిన‌ ఫారంలోనే నామినికి సంబంధించిన ఫారంను అందజేస్తున్నాయి.

* నామినేష‌న్ స‌దుపాయం వ్య‌క్తిగత సామర్థ్యంలో (సింగిల్ లేదా జాయింట్ ఖాతాలు లేదా ఏకైక యాజమాన్య ఖాతాలు) తెరిచే ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిప్ర‌జెన్‌టేటీవ్ ఖాతా (అవుట్ స్టాండింగ్ సాల‌రీ ఖాతా, ప్రీ-పెయిడ్ రెంట్ ఖాతా వంటివి) ల‌కు నామినీ స‌దుపాయం అందుబాటులో లేదు. 

* ఖాతాదారుడు వారి జీవిత కాలంలో ఎప్పుడైనా నామినీని జోడించ‌వ‌చ్చు. బ్యాంకులో ఖాతా ఉండి ఇప్ప‌టికీ నామినీ ఏర్పాటు చేయ‌ని వారు/జోడించిన నామినీని ర‌ద్దు చేసిన వారు ఫారం డీఏ-1 ఇచ్చి మ‌రొక నామినీని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఈ ఫారంలో ఖాతా వివ‌రాల‌తో పాటు, ఖాతాదారుల వివ‌రాలు, నామినీ వివ‌రాలు నింపాలి. 

* ఖాతాదారుడు ఇప్ప‌టికే ఉన్న నామినీని తొలగించి కొత్త నామినీని ఖాతాకు జ‌త‌చేయ‌వ‌చ్చు. నామినేష‌న్ ర‌ద్దు చేసేందుకు ఖాతాదారుడు ఫారం డీఏ-2ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారంలో ఖాతాదారు/ల వివ‌రాలు, ఖాతా వివ‌రాలు, ర‌ద్దు చేయ‌బోయే నామినీ పేరు, చిరునామా వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫారంపై ఖాతాదారులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా సంత‌కం చేయాలి. నామినీని మార్చేందుకు ఫారం డీఏ-3 ఇవ్వాల్సి ఉంటుంది. 

* మైన‌ర్‌ను కూడా నామీనిగా నియ‌మించ‌వ‌చ్చు. ఒక‌వేళ నామినీ మైన‌ర్ అయితే మైన‌ర్‌ చ‌ట్ట‌ప‌ర‌మైన సంర‌క్ష‌కుని వివ‌రాల‌ను నామినేష‌న్ ఫారంలో పేర్కొనాలి. మైనారిటీ తీరేవ‌ర‌కు చ‌ట్ట‌ప‌ర‌మైన సంర‌క్ష‌కుడు నామినీకి బ‌దులు అన్నీ చూసుకుంటాడు.

* బ్యాంకు పొదుపు ఖాతా విష‌యంలో ఒక‌రిని మాత్ర‌మే నామినీగా నియ‌మించాల్సి ఉంటుంది.

* జాయింట్ ఖాతా విష‌యంలో.. ఒక‌రి కంటే ఎక్కువ మంది ఖాతాదారులు ఉంటారు. ఖాతాదారులు ఇద్దరూ మ‌ర‌ణించిన సంద‌ర్భంలో మాత్ర‌మే నామినీకి ఖాతాలోని మొత్తాన్ని అందజేస్తారు. 

* ప్ర‌స్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో స‌హా చాలా వ‌ర‌కు బ్యాంకులు ఆన్‌లైన్‌లోనూ నామినేష‌న్ జ‌త‌చేసే సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి. 

* బ్యాంకు పొదుపు ఖాతాకు మాత్ర‌మే కాకుండా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు లాక‌ర్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఇత‌ర పెట్టుబ‌డులకు కూడా నామినీల‌ను నియ‌మించుకోవ‌చ్చు. కొన్ని చోట్ల ఒక‌రి కంటే ఎక్కువ నామినీల‌ను నియ‌మించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. ఒక‌రి కంటే ఎక్కువ మంది నామినీల‌ను నియ‌మించేట‌ప్పుడు, ఎవ‌రికి ఎంత శాతం వాటా ఇవ్వాలో కూడా తెలియ‌జేయాలి.  
చివరిగా: 
నామినీ లేని సందర్భాల్లో, ఖాతాదారుడు మరణించిన తరువాత కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, తప్పనిసరిగా నామినీ ని తెలియజేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని