PPF: పీపీఎఫ్‌లో చందాదారులకు 5వ తేదీ చాలా ముఖ్యం.. ఎందుకో తెలుసా?

పీపీఎఫ్‌లో ప్రతి నెలా 5 వ తేదీ కంటే ముందే పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం  

Updated : 31 May 2022 09:45 IST

    
ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజా భవిష్య నిధి (PPF)లో నగదు పొదుపు చేయాలనుకునే వారికి ప్రతి నెలా 5వ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు 5వ తేదీ కంటే ముందు జమ చేసిన నగదుకు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత జమ చేసిన మొత్తానికీ..ఆ నెల‌ వడ్డీ వర్తించదు.

పీపీఎఫ్‌లో వడ్డీ ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి 31వ తేదీన ఖాతాకు జ‌మ‌చేసిన‌ప్ప‌టికీ, ప్ర‌తి నెలా వడ్డీని లెక్కిస్తారు. ప్రతి నెలా చివరి రోజు నుంచి.. ఆ త‌ర్వాతి నెల 5వ తేదీ వరకు ఖాతాలో ఉన్న నగదును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వడ్డీని లెక్కిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఉదాహరణకు, మీరు నెల ప్రారంభంలో రూ.10 వేలు పీపీఎఫ్ ఖాతాలో జమ చేశారనుకుందాం. తర్వాత 7వ తేదీన మరో రూ.5 వేలు దానికి జత చేసినా, మీకు రూ.10 వేలకు మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. రూ.15 వేలకు వడ్డీ రాదు. 

అందుకే ప్రతి నెలా 5వ తేదీ కంటే ముందు పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు జమ చేస్తే మంచిదని ఆర్థిక నిపుణలు సూచిస్తున్నారు. అయితే 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్దగా తేడా ఉండదని మీరు అనుకోవచ్చు. కానీ ఆ చిన్న చిన్న‌ మొత్తాలే దీర్ఘకాలంలో పెద్ద మొత్తం స‌మ‌కూర్చిపెడ‌తాయ‌ని మ‌ర్చిపోకూడ‌దు. 5వ తేదీ కంటే ముందు పీపీఎఫ్‌ ఖాతాలో పెట్టుబ‌డిని జమ చేస్తే వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు, పన్నులను కూడా మినహాయించే అవకాశం ఉంటుంది.

5వ తేదీనే ఎందుకు?

వేతన జీవులకు సులభంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 5వ తేదీలోపు అందరికీ జీతాలు అందుతాయి. కాబట్టి, ఆలోపు నగదు జమ చేసేందుకు వీలుంటుంది. ఐదు రోజుల్లో జమ చేస్తే మిగతా 25 రోజులకు వడ్డీ వర్తిస్తుంది. దీంతో పాటు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏడాదికి పీపీఎఫ్ ఖాతాలో రూ.1,50,000 జమ చేస్తే సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుందన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనికోసం ప్రతి నెలా రూ.12,500 జమ చేస్తే మంచిది.

ప్రతి నెలా 5వ తేదీ కంటే ముందు రూ.12,500 జమ చేస్తే 15 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే నాటికి దాదాపు రూ.40 లక్షలు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. చెక్కు ద్వారా డిపాజిట్ చేసే వారు 5వ తేదీలోపు చెక్ క్లియ‌ర్ అయ్యి డ‌బ్బు జ‌మ‌య్యేలా చూసుకోవాలి. పీపీఎఫ్ ఖాతాలో వార్షికంగా క‌నీసం రూ.500 నుంచి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. 15 ఏళ్ల కాల‌ప‌రిమితి పూర్త‌యిన తర్వాత కూడా కూడా ఖాతాను కొనసాగించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు