Income Tax: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫారం 12BBA, ఫారం 15H ఎందుకు ఇవ్వాలి?

సీనియ‌ర్ సిటిజ‌న్లు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన ప‌ని లేకుండా ఫారం 12BBA, టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌కుండా ఫారం 15H వంటి స్వీయ-డిక్లరేషన్ ఫారంలను సమర్పించవ‌చ్చు.

Updated : 30 Jul 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక ఆర్థిక సంవ‌త్సరంలో ప‌రిమితికి మించి ఆదాయం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను చెల్లించాలి. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. అయితే కొన్ని రకాల ఆదాయాల‌పై ఆయా సంస్థ‌లు మూలం వ‌ద్దే ప‌న్ను (TDS) డిడ‌క్ట్ చేస్తుంటాయి. కానీ ప‌రిమితికి మించి ఆదాయం లేనప్పుడు టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌కుండా ఫారం 15G, ఫారం 15Hల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఇక సీనియ‌ర్ సిటిజ‌న్ల విష‌యానికి వ‌స్తే.. ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన ప‌ని లేకుండా ఫారం 12BBA, టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌కుండా ఫారం 15H వంటి స్వీయ-డిక్లరేషన్ ఫారంలను సమర్పించవ‌చ్చు. వీటి గురించి మ‌రింత వివ‌రంగా తెలుసుకుందాం.

ఫారం 12BBA డిక్ల‌రేష‌న్: 2022 ఏప్రిల్ 1 నుంచి 75 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు ఐటీ రిట‌ర్నుల దాఖ‌లు నుంచి మిన‌హ‌యింపు పొందే వీలు కల్పించారు. అయితే ప‌న్ను చెల్లింపు నుంచి మాత్రం వీరికి మిన‌హాయింపు లేదు. దీనికోసం ఆర్థిక చ‌ట్టం 2021లో సెక్ష‌న్ 194పి ని ప్రవేశ పెట్టారు. దీని ప్ర‌కారం సీనియ‌ర్ సిటిజ‌న్లు స్వ‌యంగా ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. లేదా వారి త‌ర‌పున సంబంధిత సంస్థ‌లు ప‌న్ను మిన‌హాయించి ఆదాయ‌ప‌ను ప‌న్ను శాఖ వ‌ద్ద డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇందుకు కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. 
* వ్య‌క్తుల వ‌య‌సు 75 సంవ‌త్సరాలు, అంత‌కంటే ఎక్కువ ఉండాలి. 
* సీనియ‌ర్ సిటిజ‌న్లు భార‌తీయ నివాసి అయివుండాలి. 
* వ‌డ్డీ ఆదాయం పొందుతున్న బ్యాంకులోనే పెన్ష‌న్ ఖాతా ఉండాలి. 
* పెన్ష‌న్‌, వ‌డ్డీ ఆదాయం త‌ప్ప ఇత‌ర వ‌న‌రుల నుంచి ఆదాయం ఉండ‌కూడ‌దు. 

సెక్ష‌న్ 194పి ప్ర‌కారం ల‌భించే ప్ర‌యోజ‌నాలు పొందేందుకు సీనియ‌ర్ సిటిజ‌న్లు, పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ ఆదాయం, పింఛను పొందుతున్న బ్యాంకుకు ఫారం 12BBA డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. తీసుకున్న పెన్ష‌న్ మొత్తం, పొదుపు, ఎఫ్‌డీల‌పై పొందిన వ‌డ్డీ ఆదాయం వివ‌రాల‌ను ఈ ఫారంలో ఇవ్వాలి. ఒక‌వేళ ఏమైనా ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు చేసి ఉంటే VI-A కింద త‌గ్గింపుల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు సంబంధిత స‌మాచారాన్ని తెల‌పాల్సి ఉంటుంది. వివ‌రాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత ఫారంలోని వివ‌రాల‌ను మ‌రోసారి ధ్రువీక‌రించుకుని, సంబంధిత బ్యాంకులో పేప‌ర్ ఫార్మాట్‌లో స‌మ‌ర్పించాలి. ఫారం సమర్పించిన తర్వాత, సంబంధిత బ్యాంక్ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయంపై (డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం అసెస్‌మెంట్ సంవ‌త్సరానికి వ‌ర్తించే త‌గ్గింపులు, రాయితీల‌ను తీసివేసి ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని లెక్కిస్తారు.) పన్నును తీసివేస్తుంది.

ఫారం 15H: సాధార‌ణంగా బ్యాంకులు రూ.10వేలు మించిన‌ వ‌డ్డీ ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను (TDS) త‌గ్గిస్తాయి. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్రం ఈ ప‌రిమితి రూ. 50వేల వ‌ర‌కు అందుబాటులో ఉంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం.. 60 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు సెక్ష‌న్ 194ఏ ప్ర‌కారం ఒక సంవ‌త్స‌రంలో రూ.50 వేల కంటే ఎక్కువ వ‌డ్డీ ఆదాయం పొందితే, అద‌న‌పు మొత్తంపై 10 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. ఈ టీడీఎస్ త‌గ్గించ‌కుండా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫారం 15 హెచ్‌ను ఇవ్వ‌చ్చు.

ఫారం 15 హెచ్ ఎవ‌రు ఇవ్వాలి?

  • ప‌న్ను విధించ‌ద‌గిన‌ ప‌రిమితి కంటే త‌క్కువ ఆదాయం ఉన్న‌ సీనియ‌ర్ సిటిజ‌న్లు (60 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు) టీడీఎస్ క‌ట్ చేయ‌కుండా ఫారం 15Hని బ్యాంకుకు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
  • బ్యాంకు అన్ని బ్రాంచ్‌ల‌లో ఖాతాల‌పై వ‌చ్చిన‌ వ‌డ్డీ ఆదాయాన్ని క‌లిపి లెక్కిస్తుంది.
  • బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఫారం 15Hతో పాటు పాన్ కార్డును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫారం స‌బ్మిట్ చేసేందుకు అనుమ‌తిస్తున్నాయి. 
  • ఒక‌సారి స‌బ్మిట్ చేసిన ఫారం ఆ ఆర్థిక సంవ‌త్స‌రానికి మాత్ర‌మే ప‌నిచేస్తుంది. 
  • ఈ ఫారంను ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో బ్యాంకు వారికి అందించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని