Updated : 16 Jul 2022 15:01 IST

ITR filing: ప‌న్ను ప‌రిధిలో లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న వ్యక్తులు తమ రిటర్నులను దాఖలు (ITR Filing) చేసే పనిలో తలమునకలై ఉన్నారు. నిర్దేశిత గడువు జులై 31లోగా వీరంతా తమ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప‌న్ను ప‌రిధిలోకి రాని వారు ఈ రిటర్నుల దాఖలు గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, వీరు కూడా ఈ గ‌డువులోపు నిల్ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

సాధార‌ణంగా వార్షిక ఆదాయం రూ.2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌వారు ప‌న్ను రిటర్నులు దాఖ‌లు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఒకవేళ మీరు చేసిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన ఆదాయం నుంచి మూలం వ‌ద్ద ప‌న్ను (TDS) త‌గ్గించి ఉంటే.. ఆ మొత్తాన్ని వాప‌సు పొందేందుకు త‌ప్ప‌కుండా రిట‌ర్నులు (ఆదాయం రూ. 2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ) ఫైల్ చేయాలి. రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే త‌గ్గించిన TDS తిరిగి పొంద‌లేరు. అలాగే, మ‌రికొన్ని ముఖ్య‌మైన సంద‌ర్భాల్లోనూ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నిల్ ఐటీఆర్ ఎప్పుడు? ఎందుకు ఫైల్ చేయాలి?

1. స్థూల ఆదాయం మిన‌హాయింపు ప‌రిమితి కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు: ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితి కంటే త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ, స్థూల ఆదాయం ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితి కంటే ఎక్కువ ఉంటే రిట‌ర్నులు ఫైల్ చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీ స్థూల ఆదాయం రూ.4 ల‌క్ష‌లు అనుకుందాం. మిన‌హాయింపు, త‌గ్గింపులు తీసివేసిన త‌ర్వాత ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చిన ఆదాయం రూ. 2.30 ల‌క్ష‌లు అనుకుంటే.. ఇటువంటి సంధ‌ర్భంలో ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ, ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం మంచిది. అలాగే, ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం రూ. 5 ల‌క్ష‌లు మించ‌క‌పోతే ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు కాబ‌ట్టి రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క్క‌ర్లేదు అనుకుంటారు. అయితే ఇక్క‌డ ఒక ముఖ్య విష‌యం తెలుసుకోవాలి. సెక్ష‌న్ 87ఏ కింద రిబేట్ ల‌భిస్తుంది కాబ‌ట్టి చెల్లించాల్సిన ప‌న్ను జీరో అవుతుంది. కాబ‌ట్టి రిట‌ర్నులను మాత్రం త‌ప్ప‌నిస‌రిగా దాఖ‌లు చేయాలి.

2. రీఫండ్ క్లెయిమ్ చేసేందుకు: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట‌ర్మ్ డిపాజిట్లు, సంస్థ ఇచ్చే డివిడెండ్ల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి.. ఆయా సంస్థ‌లు మూలం వ‌ద్ద ప‌న్ను (TDS) డిడ‌క్ట్ చేస్తాయి. ఒక‌వేళ ఇప్ప‌టికే టీడీఎస్ త‌గ్గించి ఉంటే.. త‌గ్గించిన ప‌న్ను మొత్తం వాప‌సు పొందేందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి.

3. న‌ష్టాన్ని స‌ర్దుబాటు చేసేందుకు: మూల‌ధ‌న న‌ష్టాలు, వ్యాపారం, వృత్తి న‌ష్టాలను భ‌విష్య‌త్తు సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చే లాభాల‌తో స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీ షేర్ల‌లో ఈ సంవ‌త్స‌రం న‌ష్టాలు వ‌చ్చి ఉంటే.. ఐటీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌డం ద్వారా వీటిని భ‌విష్య‌త్‌లో వ‌చ్చే లాభాల‌తో స‌ర్దుబాటు చేసుకునే వీలుంటుంది.

4. పాస్‌పోర్ట్ పున‌రుద్ధ‌ర‌ణ కోసం: ప్ర‌తీ సంవ‌త్స‌రం ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేస్తూ.. మ‌ధ్య‌లో రెండు, మూడు సంవ‌త్స‌రాలు ప‌రిమితికి మించిన ఆదాయం లేదు క‌దా అని రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం నిలిపివేస్తుంటారు. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను రికార్డుల్లో గ్యాప్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అదే స‌మ‌యంలో మీరు పాస్‌పోర్ట్ పున‌రుద్ధ‌ర‌ణ కోసం గానీ, వీసా కోసం గానీ ద‌ర‌ఖాస్తు చేస్తే.. ఇమ్మిగ్రేష‌న్ అధికారులు గ‌త 2, 3 సంవ‌త్స‌రాల ప‌న్ను రిట‌ర్నుల కాపీల‌ను అడుగుతారు. ఇవి ఇవ్వ‌డంలో విఫ‌లమైతే రిట‌ర్నులు ఎందుకు దాఖ‌లు చేయ‌లేదో వివ‌ర‌ణ కోరుతూ ప‌న్ను శాఖ నుంచి నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం మంచిది.

5. రుణం, బీమా, క్రెడిట్ కార్డుల కోసం: సాధార‌ణంగా ఇల్లు/కారు కొనుగోలుకు రుణం కోసం బ్యాంకుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. బ్యాంకు వారు అడిగే ముఖ్యమైన ప‌త్రాల్లో ఐటీ రిట‌ర్నులు ఒక‌టి. ఐటీ రిట‌ర్నుల ద్వారా బ్యాంకులు.. దర‌ఖాస్తుదారుని ఆదాయం, ఆదాయ మార్గం వంటి కీల‌క విష‌యాల‌ను త‌నిఖీ చేసి రుణ మంజూరు/అర్హ‌త‌ను తెలుసుకుంటాయి. ఇన్సురెన్స్ పాల‌సీ, క్రెడిట్ కార్డుల విష‌యంలోనూ సంబంధిత సంస్థ‌లు ఐటీ రిట‌ర్నులను ప‌రిశీలిస్తాయి.

6. ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేస్తే: రూ.1 ల‌క్ష‌కు పైగా విద్యుత్ బిల్లులు, రూ.2 ల‌క్ష‌ల‌కు పైగా విదేశీ ప్ర‌యాణాల‌కు (త‌మ కోసం/ఇత‌రుల కోసం) ఖ‌ర్చు చేసేవారు.. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం లేక‌పోయినా రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి.

7. విదేశాల‌లో ఆస్తులు ఉంటే: భార‌త‌దేశం వెలుపల ఏదైనా ఆస్తి ఉన్న‌వారు.. విదేశాల్లో ఉన్న ఆస్తుల నుంచి లాభం పొందిన వారు ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలాగే, ఎన్నారైలు డీటీఏఏ వంటి ప‌న్నుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం మంచిది.

చివ‌రిగా: ప‌న్ను చెల్లించ‌డం, ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం రెండూ వేరు వేరు చ‌ట్ట‌ప‌ర‌మైన బాధ్యతలు. అందువ‌ల్ల ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం లేనివారు కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేయ‌డం మంచిదే. అంతేకాకుండా ప‌న్ను రిట‌ర్నులు ఆదాయం రుజువుగా కూడా ప‌నిచేస్తాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని