విదేశాల‌కు వెళ్లేట‌పుడు ప్ర‌యాణ బీమా తీసుకుంటున్నారా?

ప్ర‌యాణానికి సంబంధించి ఏవైనా అవాంత‌రాలు ఎదురైనా లేదా ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు ఎదురైనా బీమా ఉప‌యోగ‌ప‌డుతుంది.విదేశీ విహార యాత్ర‌ల‌కు వెళ్లే వారు త‌ప్ప‌క ప్ర‌యాణ బీమా తీసుకోవాలి...

Updated : 01 Jan 2021 20:17 IST

ప్ర‌యాణానికి సంబంధించి ఏవైనా అవాంత‌రాలు ఎదురైనా లేదా ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు ఎదురైనా బీమా ఉప‌యోగ‌ప‌డుతుంది.విదేశీ విహార యాత్ర‌ల‌కు వెళ్లే వారు త‌ప్ప‌క ప్ర‌యాణ బీమా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని దేశాల్లో వైద్య ఖ‌ర్చుల‌కు డ‌బ్బు చెల్లించ‌డంపై నిషేధం ఉంటుంది. కొన్ని యూరోపియ‌న్ దేశాల్లో ఆరోగ్య బీమా లేకుంటే వీసా కూడా జారీ చేయ‌రు. కాబ‌ట్టి ఆయా దేశాల‌కు వెళ్లే వారు బీమా తీసుకుంటారు.

ప్ర‌యాణ బీమా అందించే స‌దుపాయాలు
విదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రయాణ బీమా మనల్ని ఆదుకుంటుంది. దీంట్లో వైద్యం చేయించుకునేందుకు అయ్యే ఖర్చులు చెల్లిస్తారు. సాధారణంగా మనకు ఆరోగ్య బీమా ఉన్నా విదేశాల్లో వర్తించకపోవచ్చు. కాబట్టి ప్రయాణ బీమా తప్పనిసరి.

సీనియ‌ర్ సిటిజ‌న్లు విదేశాల‌కు వెళ్లేట‌పుడు ప్ర‌యాణ బీమా తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుందా?
విదేశాల‌కు వెళ్లే వారిలో సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గానే ఉంటున్నారు. అయితే 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కూ ప్ర‌యాణ బీమా సుల‌భంగానే పొంద‌వ‌చ్చు. వ‌య‌సు 70-80 బీమా కొనుగోలు చేసేందుకు ఉండే ఆప్ష‌న్లు త‌గ్గుతాయి కానీ తీసుకునేందుకు వీలుంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు స్వ‌దేశంలో బీమా పాల‌సీ తీసుకునేందుకు అందుబాటులో లేకుంటే విదేశాల్లో తీసుకోవ‌చ్చు. కాక‌పోతే అక్క‌డ పాల‌సీ కి ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. 80 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన వారికి కూడా బీమా పాల‌సీల‌ను విక్ర‌యించే సంస్థ‌లు ఉన్నాయి. అయితే వీరు మందుగా పాల‌సీకొనుగోలు చేసేవారి ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ను చేయిస్తారు.

పాస్‌పోర్టు, ల‌గేజీ పోతే..
తమ ఒరిజినల్‌ పాస్‌పోర్టు పోగొట్టుకుంటే డూప్లికేట్‌ లేదా కొత్త పాస్‌పోర్టు పొందేందుకయ్యే ఖర్చును బీమా కంపెనీలే అందిస్తాయి. లగేజీని పోగొట్టుకున్నా లేదా అపహరణకు గురైనా… విమానాశ్రయంలో లగేజీ పొరపాటుగా వేరే చోటికి తరలించినా, లగేజీ చేర్చడంలో ఆలస్యమైనా బీమా కంపెనీలు మన లగేజీ తిరిగి చేతికందేంత వరకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు లేదా మొత్తం వస్తువులు కొనుక్కునేందుకు అయ్యే ఖర్చులు చెల్లిస్తారు. బంగారం, ఖరీదైన వస్తువులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు చెల్లించేదానికి పరిమితి ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు ఇలాంటి వాటిని బీమా పరిధిలోకి తీసుకురావు.

ప్ర‌యాణం ర‌ద్ద‌యినా, వాయిదాప‌డినా..
విమానయాన సంస్థల కారణాల వల్ల ప్రయాణం రద్దయిన సందర్భంలో అయ్యే ఖర్చులను ఆ సంస్థలే భరిస్తాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నప్పుడు లేదా రద్దు చేసుకున్నప్పుడు … విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం అవ్వడం. అత్యవసర పరిస్థితుల్లో విమానం బయలుదేరే సమయానికి ఏదైనా అవాంతరాలెదురై విమానాశ్రయానికి చేరుకోలేకపోవడం. ఇలాంటి సందర్భాల్లో హోటల్‌లో బస చేసేందుకు, భోజన ఖర్చులకు, మళ్లీ టికెట్‌ తీసుకునేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు అందజేస్తాయి.

ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు డ‌బ్బు, కార్డులు ఉన్న‌ ప‌ర్సు పోయిన‌ప్పుడు లేదా హ‌ఠాత్తుగా కార్డు ప‌నిచేయ‌క‌పోయినా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇలాంటి సంద‌ర్బాల్లో బీమా కంపెనీ ఆస‌రాగా ఉంటుంది. ప్రయాణ సమయంలో మన క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు అపహరణకు గురై దుర్వినియోగం పాలైతే అందుకయ్యే పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని