Health Insurance: 2,3 ఏళ్ల కాల‌ప‌రిమితితో ఆరోగ్య బీమా ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?

ఆరోగ్య బీమా కొనుగోలు,  స‌మయానుకూల పున‌ర‌ద్ధ‌ర‌ణ‌ల‌కు ప్ర‌తీఒక్క‌రూ ప్రాధాన్య‌త ఇవ్వాలి. 

Published : 18 May 2022 16:43 IST

ఆరోగ్య బీమా పున‌రుద్ధ‌ర‌ణ‌.. ప్ర‌తీ సంవ‌త్స‌రం చేయాల్సిన అతి ముఖ్య‌మైన ప‌నుల‌లో ఇదీ ఒక‌టి. ఒక‌వేళ ఏ కార‌ణం చేత‌నైనా పున‌రుద్ధ‌రించ‌డం మ‌ర్చిపోతే, గ‌డువు తేది ముగిసిన మ‌రుస‌టి రోజు క్లెయిమ్ చేయాల్సి వ‌చ్చినా.. అటువంటి క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తాయి బీమాసంస్థ‌లు. దీంతో అవ‌స‌ర‌మైన స‌మ‌యానికి బీమా అక్క‌ర‌కు రాకుండా పోతుంది. అప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్రీమియంలు వృధానే అవుతాయి. 

సాధారణంగా, ఆరోగ్య బీమా వార్షిక ఒప్పందంతో వ‌స్తుంది. కాబ‌ట్టి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట తేదీన పునరుద్ధ‌రించాల్సి ఉంటుంది. బీమా సంస్థ‌లు పున‌రుద్ధ‌ర‌ణ తేదిని గుర్తు చేస్తూ, ప్ర‌తి సంవ‌త్స‌రం ఎస్ఎమ్ఎస్ ద్వారా, ఈ - మెయిల్స్ ద్వారా పున‌రుద్ధ‌ర‌ణ నోటీసును పంపుతుంటాయి. అయిన‌ప్ప‌టికీ కొంత మంది ఆల‌స్యం చేస్తుంటారు. దీంతో వెయిటింగ్ ప‌రియ‌డ్‌, నో-క్లెయిమ్ బోన‌స్ వంటి ప్ర‌యోజ‌నాలు కోల్పోయే అవ‌కాశం ఉంది. అయితే ఈ ఇబ్బందిని తొల‌గించేందుకు, వార్షిక పున‌రుద్ధ‌ర‌ణ భారాన్ని త‌గ్గించేంద‌కు బీమా సంస్థ‌లు దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీల‌ను అందిస్తున్నాయి. ఈ పాలసీలు ప్రాధ‌మికంగా ఒక సంవత్సరానికి పైగా కవరేజీని అందిస్తాయి. రెండు లేదా మూడు సంవత్సరాల పాటు నిరంతర కవరేజీ అందించే పాలసీలు భారత‌దేశంలో అందుబాటులో ఉన్నాయి. 

దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాల‌సీ ప్రయోజనాలు..
పునురుద్ధ‌ర‌ణ చింత ఉండ‌దు..
ఆరోగ్య బీమా అనేది దీర్ఘ‌కాల ప్ర‌ణాళిక‌. వ‌య‌సు పెరిగే కొద్ది దీని అవ‌స‌రం మ‌రింత పెరుగుతుంది. అందువ‌ల్ల పున‌రుద్ధ‌ర‌ణ అనేది చేస్తూనే ఉండాలి. వార్షిక పున‌రుద్ధ‌ర‌ణ చేసేట‌ప్పుడు చెల్లింపు విఫ‌లం అయినా, ఏదైనా కార‌ణం చేత స‌రైన స‌మ‌యానికి పున‌రుద్ధ‌రించ‌క‌పోయినా పాల‌సీ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది. దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల రెండు లేదా మూడు సంవ‌త్స‌రాలు పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ గురించిన‌ ఆందోళ‌న ఉండదు.

ప్రీమియంపై డిస్కౌంట్‌..
వార్షిక పాలసీ కంటే దీర్ఘ‌కాలిక పాల‌సీలు చౌక‌గా ల‌భిస్తాయి. రెండు లేదు మూడు సంవ్స‌రాలకు క‌లిపి చెల్లించే ప్రీమియంపై దీర్ఘ‌కాలిక డిస్కౌంట్ వ‌ర్తించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎంచుకున్న కాల‌ప‌రిమితిని బ‌ట్టి 7 నుంచి 15 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా వ‌ల్ల‌ ఈ మొత్తాన్ని అద‌నంగా ఆదా చేసుకోవ‌చ్చు.  

వ‌య‌సు పెరిగినా.. ప్రీమియం పెర‌గ‌దు..
సాధార‌ణంగా ఆరోగ్య బీమా ప్రీమియం రేట్లు వ‌య‌సు ప‌రిధిని బ‌ట్టి కూడా ఖరారు చేస్తారు. ఒక వ‌య‌సు ప‌రిధి నుంచి మ‌రొక ప‌రిధికి మారిన‌ప్పుడు ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. అంటే 30-35 వ‌ర‌కు, 36-45 వ‌ర‌కు, 46-50 వ‌ర‌కు ఇలా మీ వ‌య‌సు ప‌రిధి ఆధారంగా ప్రీమియం నిర్ణ‌యిస్తారు. 45 నుంచి 46 సంవ‌త్స‌రంలోకి అడుగుపెడితే ఒక ప‌రిధి నుంచి మ‌రొక ప‌రిధిలోకి మారుతున్నారు కాబ‌ట్టి ప్రీమియంలో ఎక్కువ పెరుగుద‌ల క‌నిపించ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలిక పాల‌సీ విష‌యంలో 45సంవ‌త్స‌రాల వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే మరో రెండు, మూడు సంవ‌త్స‌రాలు ప్రీమియంలో స‌హేతుక‌మైన పొదుపు ఉంటుంది.

ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఉండ‌దు..
వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా వైద్య ఖ‌ర్చులు పెరిగే కొద్ది, బీమా సంస్థ‌లు ఆరోగ్య బీమా ప్రీమియం రేట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌వ‌రిస్తుంటాయి. వార్షిక పాల‌సీల పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో స‌వ‌రించిన ప్రీమియం రేట్లే వ‌ర్తిస్తాయి. అయితే దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీల‌లో ప్రీమియం రెండు నుంచి మూడు సంవ‌త్స‌రాలు లాక్ అయ్యి ఉంటుంది. కాబ‌ట్టి ధ‌ర పెరుగుద‌ల భారం ఉండ‌దు. 

ప‌న్ను..
ఆదాయ‌పు పన్ను చ‌ట్టం సెక్ష‌న్ 80డి ప్ర‌కారం ఆరోగ్యబీమా ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఒక వ్య‌క్తి త‌న‌కోసం త‌న భార్య పిల్ల‌ల కోసం చెల్లించిన ప్రీమియంపై రూ. 25 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. వివిధ సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ప్రీమియం మొత్తం ఒకే సంవ‌త్స‌రం చెల్లించిన‌ప్ప‌టికీ.. ఏ సంవ‌త్స‌రానికి సంబంధించిన ప్రీమియంపై ఆ సంవ‌త్స‌రం డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌డం వీల‌వుతుంది. అంటే ఏ సంవత్స‌రం ఆరోగ్య బీమా ప్ర‌యోజ‌నాలు ఎంత ఉంటాయో.. ఆ నిష్ప‌త్తి ప్ర‌కార‌మే ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

ఉదాహ‌ర‌ణ‌కి, మీరు 3 సంవ‌త్స‌రాల‌కి మీ కోసం, భార్య పిల్ల‌ల కోసం ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకొని.. రూ. 45 వేలు ప్రీమియం చెల్లించారు అనుకుందాం. ప‌త్రీ సంవ‌త్స‌రం రూ. 15 వేల చొప్పున ప‌న్ను మిన‌హాయింపు పొందవ‌చ్చు.  

క‌వ‌రేజ్‌..
వార్షిక ఆరోగ్య బీమా పాల‌సీలు మాదిరిగానే దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీలు హామీనిస్తాయి. క‌వ‌రేజ్‌లో పెద్ద‌గా వ్య‌త్యాసం ఉండ‌దు. కాల‌వ్య‌వ‌ధి, ప్రీమియంలోనే వ్య‌త్యాసం ఉంటుంది. 

చివ‌రిగా..
దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తే, ఒక పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌తీ రెండు లేదా మూడు సంవ‌త్స‌రాల‌కు ఒకసారి ఈ మొత్తం స‌మ‌కూరేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం ఆరోగ్య బీమా సంస్థ‌లు ప్రీమియంను వాయిదాల‌లో చెల్లించే అవ‌కాశాన్ని కూడా అందిస్తున్నాయి. ఏక‌మొత్తంగా చెల్లించ‌లేనివారు ఈ విధంగా ప్లాన్ చేసుకోవ‌చ్చు. వార్షిక లేదా దీర్ఘ‌కాలప‌రిమితి.. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్న‌ప్ప‌టికీ ఆరోగ్య బీమా కొనుగోలు,  స‌మయానుకూల పున‌ర‌ద్ధ‌ర‌ణ‌ల‌కు ప్ర‌తీఒక్క‌రూ ప్రాధాన్య‌త ఇవ్వాలి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని