Credit Cards: రెండు.. మూడు క్రెడిట్ కార్డులు అవ‌స‌ర‌మా? నిపుణులు ఏమంటున్నారు?

ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు అవ‌స‌రం లేదంటారు చాలామంది .అయితే 2-3 ఉండ‌టం ద్వారా కొన్ని లాభాలు కూడా ఉంటాయి..

Updated : 22 May 2022 17:20 IST

ఒక వ్య‌క్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు కావాలి? ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. అంతెందుకు మీకు కూడా ఉండొచ్చు. ఒక‌టి కంటే ఎక్కువ ఉంటే ఆదాయానికి మించి ఖ‌ర్చు చేసే ఆస్కారం ఉంటుంద‌ని అంటుంటారు కొందరు. కాబట్టి ఒక క్రెడిట్ కార్డు స‌రిపోతుంద‌ని చెబుతారు. మరికొందరేమో ఎన్ని కార్డులున్నా ఫర్వాలేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. రెండింటిలో ఏది నిజం?

ఎక్కువ కాలం వ‌డ్డీ లేని రుణాలు కోసం

క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోలు అంటే... బ్యాంకు వ‌ద్ద అప్పు తీసుకుని కొనుగోలు చేసిన‌ట్లే భావించాలి. కార్డు ద్వారా వినియోగించిన‌ మొత్తాన్ని చెల్లించ‌డానికి బ్యాంకులు కొంత స‌మ‌యమిస్తాయి. ఆ స‌మ‌యం లోప‌ల చెల్లింపులు చేసిన‌ట్ల‌యితే ఎలాంటి వ‌డ్డీ ఉండ‌దు. రెండు క్రెడిట్ కార్డులు క‌లిగి ఉండ‌డ‌డం ద్వారా వ‌డ్డీ లేని చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధిని పెంచుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు మీ బిల్లింగ్ సైకిల్ చివ‌రి తేది మే 30 అనుకుంటే, మీ వ‌డ్డీ లేని చెల్లింపుల‌కు జూన్‌ 21. మీరు మే 1న క్రెడిట్ కార్డు వినియోగించి వ‌స్తువుల‌ను కొనుగోలు చేశార‌నుకుందాం. మీ వ‌డ్డీ లేని చెల్లింపుల గుడువు తేది జూన్‌ 21 వ‌ర‌కు ఉంటుంది. అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించ‌డానికి దాదాపు 50 రోజుల స‌మ‌యం ల‌భిస్తుంది. ఒక వేళ మీరు మే 30 కొనుగోలు చేసిన‌ట్ల‌యితే.. మీరు తిరిగి డబ్బులు చెల్లించడానికి 21 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది. నెల‌లో ఒక్కోరోజు గ‌డుస్తున్న‌ప్పుడు మీ వ‌డ్డీ లేని రుణ కాల‌వ్య‌వ‌ధి త‌గ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి సమయంలో బిల్లింగ్ సైకిల్ చివ‌రి తేది జూన్‌ 15గా ఉన్న మ‌రొక కార్డు ఉంటే... అప్ప‌డు మే 30వ తేదీ కొనుగోళ్లను ఆ కార్డ్ ఉప‌యోగించి చేస్తే మీ వ‌డ్డీ లేని కాల‌వ్య‌వ‌ధిని పెంచుకోవ‌చ్చు.

క్రెడిట్ కార్డు బిల్లును నిర్ణీత తేది లోపు చెల్లించ‌డం ద్వారా బ్యాంకు విధించే అధిక వ‌డ్డీ రేటు నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో మొత్తం బిల్లులో క‌నీసం 5 శాతం బిల్లును (మినిమం అమౌంట్‌) చెల్లిస్తారు. అలాంటి ప‌రిస్థితుల‌లో బ్యాంకు 2 నుంచి 3 శాతం వ‌డ్డీ విధిస్తుంది. ఇది చెల్లించ‌ని బిల్లుల‌కు మాత్ర‌మే కాకుండా త‌రువాత చేయ‌బోయే కొనుగోళ్లకూ వ‌ర్తిస్తుంది. ఈ సమయంలో మీరు మ‌రొక క్రెడిట్ కార్డు క‌లిగి ఉటే మీ పాత బిల్లును చెల్లించేంత వ‌ర‌కు, ఆ రెండో కార్డుపై కొనుగోలు చేయ‌డం ద్వారా అధిక వ‌డ్డీ రేట్ల బారిన ప‌డ‌కుండా త‌ప్పించుకోవ‌చ్చు.

త‌క్కువ వ‌డ్డీతో న‌గ‌దు బ‌దిలీ

ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ‌ల‌ను ఉన్నట్లయితే చెల్లించ‌ని క్రెడిట్ కార్డు బిల్లుల‌పై అధిక వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. చాలా సంస్థ‌లు వారి వ్యాపారాన్ని పెంచుకోవ‌డానికి వినియోగదారుడు చెల్లించ‌ని మొత్తాన్ని వారి వేరే కార్డుల‌కు బ‌దిలీ చేసుకోవ‌డానికి వీలు క‌ల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొద‌టి రెండు నెల‌ల‌కు ఎటువంటి చార్జీలు విధించ‌కుండా ఈ సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి. త‌రువాత కూడా నెల‌కు 1.5 నుంచి 2 శాతం వ‌డ్డీ వసూలు చేస్తున్నారు. అయితే... చెల్లించ‌ని మొత్తాల‌ను ఒక కార్డు నుంచి మ‌రొక కార్డుకు బ‌దిలీ చేయ‌డం అనేది ఒక అల‌వాటుగా మార్చుకోవ‌ద్దు. ప్ర‌తిసారి ఇలా చేయ‌డం వల్ల మీరు రుణ ఉచ్చులో పడే అవ‌కాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇచ్చ‌ట అన్ని క్రెడిట్ కార్డులు

అన్ని కార్డులు ఒకేలా ఉండ‌వు. కొన్ని కార్డులు కిరాణా దుకాణాల‌లో కొనుగోళ్లకు బాగుంటే, మ‌రికొన్ని ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. ఇంకొన్ని కార్డుల‌ను ఉప‌యోగించి పెట్రోలు కొనుగోలు చేసిన‌ప్పుడు రివార్డు పాయింట్లు వస్తాయి. యుటిలిటీ బిల్లుల చెల్లింపు కోసం రివార్డు పాయింట్ల‌ను ఇచ్చే కార్డులూ ఉన్నాయి. ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ఇలాంటి డీల్స్ పొందొచ్చు. మీ ఖ‌ర్చు చేసే విధాల‌ను అనుస‌రించి మీ క్రెడిట్ కార్డుల‌ను ఎంచుకొని అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

ప్ర‌త్యామ్నాయ కార్డుగా...

ఒకటే క్రెడిట్‌ కార్డు వాడుతున్నారు అనుకుందాం. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో పేమెంట్‌ చేసేటప్పుడు ఆ బ్యాంకు సర్వర్‌లో సమస్య వచ్చి పేమెంట్‌ అవ్వలేదు. దీంతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మీ  సేవింగ్స్‌ ఖాతాలో అంత మొత్తం డబ్బులు లేక ఆ వస్తువు కొనుగోలు ఆపేయాల్సి వస్తుంది కూడా. అలాంటి ప‌రిస్థితుల‌లో రెండో కార్డు ఉపయోగపడుతుంది.

స్కోరును పెంచుకోవ‌డం

క్రెడిట్‌ స్కోరుపై క్రెడిట్ యుటిలైజేష‌న్ (రుణ వినియోగం) ప్ర‌భావం చూపుతుంది. ఎంత తక్కువ రుణ వినియోగం ఉంటే.. క్రెడిట్‌ స్కోరు అంత బాగుంటుంది అని చెబుతుంటారు ఆర్థిక పరిశీలకులు. క్రెడిట్ యుటిలైజేష‌న్ అంటే... కార్డు లిమిట్‌లో మీరు వినియోగించిన మొత్తం. ఉదాహ‌ర‌ణ‌కు.. మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. ల‌క్ష ఉందనుకుందాం. మీరు వినియోగించింది రూ.30 వేలు అయితే అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేష‌న్ 30 శాతం. అయితే ఇదే సమయంలో మీ దగ్గర రూ.50 వేలు లిమిట్‌ ఉన్న మ‌రో క్రెడిట్ కార్డు ఉంద‌నుకుందాం. అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేన్ 20 శాతం అవుతుంది. 

గమనిక: 2-3 క్రెడిట్ కార్డులు ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి కాదు. అయితే స‌రైన నిర్వ‌హ‌ణ ఉంటేనే ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. కార్డులు ఉన్నాయి కదా అని వాడేస్తే రుణ భారంలో పడే అవకాశం ఉంటుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని