Retirement Corpus: పదవీ విరమణను లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి?

ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే..సంపాదన ఉన్నప్పుడే పదవీవిరమణకు కావాల్సిన నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి.

Published : 31 Jan 2023 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవడం ఎవరికైనా తప్పదు. సాధారణంగా 58 నుంచి 60 ఏళ్ల వయసులో పదవీవిరమణ తీసుకుంటాం. అక్కడి నుంచి మరొక 20 ఏళ్లు జీవిస్తే సంపాదన ఆగిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం తప్పవు. అప్పటి వరకు ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించిన వారు మరొకరిపై ఆధారపడడానికి ఇష్టపడరు. కాబట్టి ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే.. సంపాదన ఉన్నప్పుడే పదవీ విరమణకు కావాల్సిన నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. 

ప్రారంభంలోనే ఎందుకు?

సంపాదించడం మొదలు పెట్టినప్పుడు, అంటే దాదాపు 22-25 సంవత్సరాల వయసు నుంచే పదవీ విరమణ కోసం పొదుపు చేయమంటే హాస్యాస్పదంగా అనిపించొచ్చు. పదవీ విరమణకు చాలా సమయం ఉంది.. ఇప్పుడు జీవితాన్ని ఆనందించాలి.. అనే ఆలోచనతో ఉంటారు యువత. అయితే 40 నుంచి 50 సంవత్సరాల వయసులో పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే.. పదవీ విరమణ నిధిలో 20 నుంచి 50 శాతం మాత్రమే రాబడి ద్వారా వస్తుంది. మిగిలిన మొత్తం మీరు పెట్టిన పెట్టుబడులే ఉంటాయి. కానీ 22- 25 సంవత్సరాల వయసులో ప్రారంభిస్తే పదవీవిరమణ నిధిలో మీ పెట్టుబడులు 10 నుంచి 30 శాతం మాత్రమే ఉంటాయి. మిగిలిన మొత్తం రాబడే ఉంటుంది.

ఒక రాత్రిలో సాధ్యం కాదు..

పదవీ విరమణ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం. కాబట్టి ఒక రాత్రి, నెల, సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దీర్ఘకాలం పాటు దీని కోసం ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. 22-25 ఏళ్ల వయసులో దీని కోసం పెట్టుబడులు చేయడం ప్రారంభిస్తే.. దాదాపు 35 సంవత్సరాల సమయం ఉంటుంది. కాబట్టి, చిన్న మొత్తాల్లో పొదుపు చేసిన పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోగలుగుతారు.

ఉదాహరణకు.. మీకు పదవీవిరమణ కోసం రూ. 5 కోట్లు కావాలనుకుందాం. మీరు 25 ఏళ్ల వయసులో పదవీ విరమణను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు ప్రారంభిస్తే 35 ఏళ్ల సమయం ఉంటుంది. కాబట్టి, నెలకు 12-15% రాబడి అంచనాతో నెలకు రూ.3500 నుంచి రూ.8000 పెట్టడం ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అదే మీరు 40 ఏళ్ల వయసులో అంటే 15 ఏళ్లు ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభిస్తే.. రూ.5 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు 12-15% రాబడి అంచనాతో నెలకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

లక్ష్యం పొదుపును ప్రోత్సహిస్తుంది..

ఏ లక్ష్యం లేకుండా పొదుపు చేయడం అంటే.. దాదాపు సాధ్యం కాదు. ఒకటి రెండు నెలలు పొదుపు చేసినా, మూడో నెల ఏదో ఒక దానికి ఖర్చు చేసేస్తారు. అదే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పొదుపు చేయడం ప్రారంభిస్తే ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. లక్ష్యానికి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి క్రమ పద్ధతిలో పొదుపు చేయడం, పెట్టుబడులు చేయడం ప్రారంభిస్తారు. 

ఖర్చులను సమీక్షించడంలో..

ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎలా సాధించాలనే దానిపై పని చేయాలి. కాబట్టి ముందుగా మీకు వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల గురించి అవగాహన పెరుగుతుంది. దీంతో మీ ఆదాయంలో ఎంతెంత, ఎక్కడెక్కడికి వెళుతుందో మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకుని పొదుపు కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించగలుగుతారు. 

చివరిగా..

పదవీ విరమణ వయసులో బాధ్యతలు ఉండవు. కాబట్టి ఖర్చులు తగ్గిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ, నిజానికి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసుకుని ఈ రోజు నుంచే పదవీవిరమణ కోసం మదుపు చేయడం ప్రారంభించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని