Adani Group: దేశంలో మరిన్ని ఎయిర్‌పోర్టులనూ నిర్వహిస్తాం: అదానీ ఎయిర్‌పోర్ట్స్‌

Adani Group: భవిష్యత్‌లో భారత విమానయాన రంగం గణనీయ వృద్ధి సాధించబోతోందని అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ సీఈఓ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరిన్ని విమానాశ్రయాల నిర్వహణ తాము సిద్ధమవుతున్నాని పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులను నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేస్తామని అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ (Adani Airports) సీఈఓ అరుణ్‌ బన్సల్‌ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా నిలవడమే తమ లక్ష్యమని బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. భారత్‌లో మరికొన్ని ఎయిర్‌పోర్టులను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి కోసం జరిగే బిడ్డింగ్‌లో తాము కచ్చితంగా పాల్గొంటామని బన్సల్‌ స్పష్టం చేశారు.

భారత్‌లో విమానాశ్రయాల నిర్వహణ ఖర్చు 30- 50 శాతం దిగిరావాల్సి ఉందని బన్సల్‌ తెలిపారు. భవిష్యత్‌లో భారత విమానయాన రంగం గణనీయ వృద్ధి సాధించబోతోందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని విమానాశ్రయాల నిర్వహణను చేపట్టడానికి తాము సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ వివిధ విభాగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోందన్నారు. తొలి దశలో భాగంగా నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో 2024 డిసెంబరు కల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.

ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ దేశంలో ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. మరో విమానాశ్రయ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు బన్సల్‌ తెలిపారు. భారత్‌లో విమానయాన సంస్థలు భారీ విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సంస్థలు భారీ ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్ చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని