Budget 2023: బడ్జెట్‌పై ప్రైవేటు రంగ ఉద్యోగుల ఆశలు..!

ఈ సారి దేశ ఆర్థిక పరిస్థితులు చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు శ్లాబ్‌లను పెంచే సూచనలు ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఎన్‌పీఎస్‌లో రాయితీలతో కేంద్రం ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందనే ఆశలు ఉన్నాయి.   

Updated : 21 Jan 2023 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం ఈ సారి ‘జాతీయ పింఛను పథకాని (NPS)’కి సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలో పింఛను చందాదారులకు కొంత ఊరటనిచ్చే కబురును ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈ బడ్జెట్‌ (Budget 2023)లో ప్రకటించే అవకాశం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నా.. ప్రస్తుత ఆర్థిక  పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయపన్ను శ్లాబులను మార్చే అవకాశాలు తక్కువ. ఈ క్రమంలో ఏదో ఒక రూపంలో వేతన జీవులకు మేలునందించి బుజ్జగించడానికి అవకాశం ఎక్కువగా ఉన్న మార్గాల్లో జాతీయ పింఛన్‌పై ఇచ్చే పన్ను మినహాయింపు ఒకటి.

2022 బడ్జెట్‌కు ముందు బేసిక్‌+డీఏ పై యజమాని ఇచ్చే ఎన్‌పీఎస్‌ చందా 14శాతం వరకు ఉన్నా.. సెక్షన్‌ 80సీసీడీ(2) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ మేరకు పన్ను రాయితీ లభించేది. రాష్ట్ర, ప్రైవేటు రంగాల్లోని వారికి 10శాతం వరకే ఉండేది. కానీ, కిందటి బడ్జెట్‌లో దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ సవరణలు చేశారు. ప్రైవేటు రంగ ఉద్యోగులు మినహాయింపు పరిధి మాత్రం ఇంకా 10శాతం మాత్రమే ఉంది. పింఛను స్కీం విషయంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగ ఉద్యోగుల పన్ను రేట్ల మధ్య తేడాలు పెరిగిపోయాయి. దీంతో వారు జాతీయ పింఛను పథకంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో వారిని జాతీయ పింఛను పథకంలో భాగస్వాములను చేయాలంటే మార్పులు తప్పనిసరి. ప్రభుత్వం పింఛను చందా మినహాయింపును 14 శాతానికి పెంచి వారిని సామాజిక భద్రతలో భాగస్వామిని చేసే అవకాశం లభిస్తుంది. మరోవైపు ఎన్‌పీఎస్‌కు చందారూపంలో లభించే సొమ్ము వివిధ పెట్టుబడి మర్గాలకు మళ్లిస్తారు. అంటే ఈ చందా పెరిగితే దేశంలో పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.

అసలు ఏమిటీ ఎన్‌పీఎస్‌..?

2004లో కేంద్ర ప్రభుత్వం ‘ది నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌’(ఎన్‌పీఎస్‌)ను స్వచ్ఛందంగా ప్రవేశపెట్టింది. దీనిని ‘ది పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరి అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రిస్తుంది. తొలుత దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత దీనిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. భారత జాతీయులు, ఎన్‌ఆర్‌ఐ హోదా ఉన్న 18-70 ఏళ్ల లోపువారు దీనిలో చేరడానికి అర్హులు. ఉద్యోగి తరఫున జీతం నుంచి యజమానే దీనికి చెల్లింపులు చేయవచ్చు.

ఈ పథకానికి చందా చెల్లింపులపై ఉద్యోగి  పన్ను మినహాయింపులు పొందవచ్చు. 1961 ఆదాయపుపన్ను చట్టం సెక్షన్‌ 80సీసీడీ(1)కింద ఈ చెల్లింపులపై మినహాయింపులు పొందవచ్చు. తొలుత ఈ మినహాయింపుల పరిధి బేసిక్‌+డీఏ పై 10శాతానికే పరిమితమైంది. ఇది రూ.1.5 లక్షల లోపే ఉండాలి. A అనే ఒక వ్యక్తి జీతం రూ.5,00,000 అనుకుందాం. అతడు రూ.50,000 పై 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందగలడు. ఇక్కడ మరో విషయం అతడు పింఛన్ ఫండ్స్‌లో పెట్టే మొత్తాలన్ని కలిపి రూ. 1.5 లక్షలపై మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే సదరు వ్యక్తి జీవిత బీమా సంస్థలు ఆఫర్‌ చేసే ఇతర పింఛన్‌ పథకాల్లో పెట్టుబడులు, జాతీయ పింఛను పథకం పెట్టుబడులు కలిపి అన్నమాట. A రూ.50వేలు చెల్లించి ఎన్‌పీఎస్‌లో చేరిన తర్వాత కూడా మరో రూ.లక్ష మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అతడు ఇతర పింఛను పథకాలకు కూడా చందాలు చెల్లించవచ్చు. 

యజమాని చెల్లించే ఎన్‌పీఎస్‌ వాటాపై తొలుత ఉద్యోగి జీతం నుంచే పన్ను వసూలు చేస్తారు. కానీ, దీనిని తర్వాత సెక్షన్‌ 80సీసీడీ(2) కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కానీ, ఇది ప్రైవేటు ఉద్యోగి బేసిక్‌+డీఏలో 10శాతం లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14శాతం వరకు అవకాశం ఉంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని