Credit Card: క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా?

ఉన్న క్రెడిట్‌ కార్డుని రద్దు చేయడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.....

Updated : 06 May 2022 11:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా కారణాల వల్ల మీరు మీ క్రెడిట్‌ కార్డు (Credit Card)ని రద్దు చేసుకోవాలనుకుంటుండొచ్చు. మరింత మంచి ఆఫర్లు ఉన్న కార్డుకి మారడం లేదా వార్షిక ఫీజు (Annual Fee)లు అధికంగా ఉండడం.. ఇలా చాలా కారణాలు మీ క్రెడిట్‌ కార్డు (Credit Card)పై ఆసక్తి తగ్గడానికి కారణం కావొచ్చు. అలాంటప్పుడు ఉన్నదాన్ని రద్దు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ, దాన్ని అంత త్వరగా క్లోజ్‌ చేయాలనుకోవడం మాత్రం సరికాదు. ఉన్న క్రెడిట్‌ కార్డుని రద్దు చేయడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మీరు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్న కార్డుని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంత త్వరగా వదిలించుకోవద్దు.

క్రెడిట్‌ స్కోర్‌పై ఎలా ప్రభావం?

ఒక క్రెడిట్‌ కార్డుని రద్దు చేసుకోవడం వల్ల మనకు అందుబాటులో ఉన్న రుణ పరిమితి తగ్గుతుంది. ఫలితంగా క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (Credit utilization ratio) పెరుగుతుంది. అంటే మీరు మీ రుణ పరిమితి (Credit Limit)లో ఎక్కువ మొత్తాన్ని వినియోగించుకుంటున్నారని అర్థం. ఇది మీ రిస్క్‌ని పెంచుతుంది. రుణదాతలు దీన్ని ప్రతికూలంగా పరిగణిస్తారు. మీ మొత్తం క్రెడిట్‌ కార్డు (Credit Card balance)ల బ్యాలెన్స్‌ని క్రెడిట్‌ కార్డుల పరిమితి మొత్తంతో భాగిస్తే.. మీ  క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (Credit utilization ratio) తెలుస్తుంది. ఇది 30 శాతం మించొద్దని నిపుణులు సూచిస్తుంటారు.

క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) మదింపులో మీ రుణ చరిత్ర గడువును కూడా పరిగణనలోకి తీసుకొంటారు. అంటే మీరు ఎంతకాలం నుంచి రుణ వ్యవస్థలతో అనుసంధానమై ఉన్నారనేది చాలా ముఖ్యం. పాత క్రెడిట్‌ కార్డు (Credit Score)ని క్లోజ్‌ చేస్తే.. దాంతో ఉన్న అనుబంధమంతా మీ క్రెడిట్‌ హిస్టరీ నుంచి తొలగిపోతుంది. సుదీర్ఘ క్రెడిట్‌ హిస్టరీ (Credit History) ఉన్నవాళ్లకి క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు క్లోజ్‌ చేసిన కార్డుపై ఏమైనా బకాయిలు ఉంటే ఆ ప్రభావం దాదాపు 5-7 ఏళ్ల పాటు మీ క్రెడిట్ హిస్టరీపై ఉంటుంది.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డు (Credit Card)ని రద్దు చేసుకోవాల్సి వస్తే.. మీ  స్కోర్‌ (Credit Score)ను పెంచుకునేందుకు మార్గాలూ ఉన్నాయి. మీరు సకాలంలో చెల్లింపులు చేస్తే కొన్ని నెలల్లోనే మీ క్రెడిట్‌ హిస్టరీ (Credit History) గాడినపడుతుంది.

మీరు క్రెడిట్‌ కార్డుని ఎప్పుడు రద్దు చేసుకోవాలంటే..

* వార్షిక ఛార్జీలు అధికంగా ఉండి, ప్రయోజనలు పెద్దగా లేకపోతే..

* వడ్డీరేటు అధికంగా ఉంటే..

* అప్పులు పెరిగి.. క్రెడిట్‌ కార్డు లావాదేవీలు భారంగా మారితే..

* స్టూడెంట్ కార్డు, సెక్యూర్డ్‌ కార్డుని రద్దు చేసుకొని రెగ్యులర్‌ కార్డుని తీసుకోవాలనుకున్నప్పుడు..

ఎప్పుడు క్లోజ్‌ చేయొద్దంటే..

* మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ (Credit Report)లో మీ కార్డుకి సుదీర్ఘ చరిత్ర ఉంటే..

* క్రెడిట్‌ అకౌంట్లు తక్కువగా ఉంటే.. కార్డుని క్లోజ్‌ చేయడం వల్ల క్రెడిట్‌ హిస్టరీ దెబ్బతింటుంది

* పెద్దగా వాడడం లేదని మాత్రం అసలు రద్దు చేసుకోవద్దు.

ఎలాంటి ప్రభావం లేకుండా క్లోజ్‌ చేయడం ఎలా..

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మీ క్రెడిట్‌ కార్డుని క్లోజ్‌ చేసుకోవాలని భావించినప్పుడు.. ఈ కింద సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు.

* అప్పటి వరకు కార్డుపై ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించాలి.

* కార్డుపై ఉన్న రివార్డు పాయింట్లన్నింటినీ రీడీమ్‌ చేసుకోవాలి.

* కార్డుపై ఆటో పేమెంట్స్‌ ఆప్షన్‌ ఉంటే.. దాన్ని రద్దు చేసి లావాదేవీలను పూర్తి చేయాలి.

* మీరు కార్డుని క్లోజ్‌ చేయాలనుకుంటున్న విషయాన్ని కస్టమర్‌ కేర్‌ ద్వారా తెలియజేయండి. వారి నుంచి క్లోజ్‌ చేసినట్లు రాతపూర్వకంగా మెయిల్‌ ద్వారా ధ్రువీకరించమని కోరండి.

* మీ కార్డు రద్దయిన తర్వాత ఆ విషయాన్ని కార్డు జారీ చేసిన సంస్థకు తెలియజేయండి.

* క్లోజ్‌ అయిన తర్వాత కార్డుని పూర్తిగా ముక్కముక్కులుగా చేసి పారేయాలి.

ప్రత్యామ్నాయాలను పరిశీలించండి..

* వార్షిక రుసుములు అధికంగా ఉన్నాయని భావిస్తే.. ఒకసారి మీ కార్డు జారీ చేసిన సంస్థతో మాట్లాడండి. తగ్గించే అవకాశం ఉంటే పరిశీలించమని కోరండి. కొన్ని కంపెనీలు అంగీకరించవచ్చు. 

* కార్డు వల్ల ఖర్చులు అధికమవుతున్నాయనుకుంటే.. దాన్ని మీ వెంట తీసుకెళ్లకుండా కొన్ని నెలల పాటు భద్రంగా ఎక్కడైనా ఉంచండి. లేదంటే కొన్ని నెలల పాటు క్రెడిట్‌ కార్డు ఖాతాను నిలిపివేసుకునే వెసులుబాటు ఉంటుంది.

* ఒకవేళ పెద్దగా వాడడం లేదు కాబట్టి క్లోజ్‌ చేయాలనుకుంటే.. దాన్ని ఏదో సబ్‌స్క్రిప్షన్‌కు అనుసంధానించండి. నెలవారీ మ్యాగజైన్‌, కేబుల్‌, ఫోన్‌ బిల్లు.. ఇలా ఏదో చెల్లింపునకు అనుసంధానించండి. తద్వారా కార్డు వినియోగంతో పాటు మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని