Twitter Elon Musk: ట్విటర్‌కు మస్క్‌ ఛార్జీ వసూలు చేస్తారా?

ఈ సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారి నుంచి ఛార్జీ వసూలు చేస్తారా? అంటే అవుననే సమాధానమే ఇచ్చారాయన. అయితే, అందరి నుంచి కాదని స్పష్టతనివ్వడం గమనార్హం....

Published : 04 May 2022 13:46 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. దాంట్లో అనేక మార్పులు తీసుకొస్తానని తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. అయితే, ఈ సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా? అంటే ఒకరకంగా ఆయన నుంచి అవుననే సమాధానమే వచ్చింది. అయితే, అందరి నుంచి డబ్బులు తీసుకోబోమని స్పష్టతనివ్వడం గమనార్హం.

సాధారణ యూజర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని మస్క్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. అయితే, వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు మాత్రం స్వల్ప మొత్తంలో రుసుము చెల్లించాల్సి రావొచ్చు అని తెలిపారు. దీనిపై స్పందించడానికి ప్రస్తుత ట్విటర్‌ యాజమాన్యం నిరాకరించింది.

గత నెల రోజులుగా ట్విటర్‌లో చాలా మార్పులు తీసుకురావాలని మస్క్‌ పదే పదే సూచిస్తున్న విషయం తెలిసిందే. కొత్త ఫీచర్లతో పాటు ఆల్గారిథమ్‌ను ఓపెన్‌ సోర్స్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే బ్లూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పాలసీలోనూ మార్పులు తీసుకొస్తానని పేర్కొన్నారు.

Also Read: Twitter: ట్విటర్‌లో మస్క్‌ చేయనున్న మార్పులివేనా?

నేనేమీ ఆండ్రాయిడ్‌ను కాదు: మస్క్‌

మరోవైపు సోమవారం న్యూయార్క్‌లో జరిగిన మెట్‌ గాలాలో మస్క్‌ తన తల్లితో కలిసి పాల్గొన్నారు. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం ఖరారైన తర్వాత ఆయన తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌పై ఆయన భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. అలాగే తాను విమర్శలకు అతీతుణ్ని ఏమీ కాదని చెప్పారు. మీడియా, ఇంటర్నెట్‌లో తనపై విమర్శలు రావడం తనకు తెలుసన్నారు. కొన్నిసార్లు తనకు అవి బాధ కలిగిస్తాయన్నారు. తనకూ ఫీలింగ్స్‌ ఉంటాయని.. తానేమీ ఆండ్రాయిడ్‌ను కాదని ఛమత్కరించారు. కానీ, వాటన్నింటినీ తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. అయితే, తాను చేసే పనులు చెడుకు మాత్రం దారితీయవని పూర్తిగా విశ్వసిస్తానని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని