Twitter: ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను మస్క్‌ తొలగిస్తారా?

పరాగ్‌ ట్విటర్‌లో కొనసాగుతారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది....

Updated : 26 Apr 2022 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ చేసిన ప్రతిపాదనను బోర్డు అంగీకరించిన వెంటనే కంపెనీ సీఈఓ (CEO of Twitter) పరాగ్‌ అగర్వాల్‌ ఉద్యోగులతో మాట్లాడారు. ఈ ఒప్పందం పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం ఉన్నట్లు తెలపడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు వెల్లడించారు. ఆయనతో పాటు ఛైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌ కూడా ఉద్యోగులతో మాట్లాడినట్లు సమాచారం.

అప్పటి వరకు ఉద్యోగాలకు ఢోకా లేదు.. 

డీల్‌ అధికారికంగా పూర్తయ్యే వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం లేదని పరాగ్‌ హామీ ఇచ్చారు. అలాగే కొత్త ఉద్యోగుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు తమ భవితవ్యంపై తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. ట్విటర్‌ పనితీరుపై మస్క్‌ తీవ్ర విమర్శలు చేయడమే ఇందుకు కారణం. కంపెనీ ఉద్యోగుల్లో చాలా మంది మస్క్‌ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు సమాచారం. ఓ ఉద్యోగి బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. కేవలం 10 శాతం మంది మాత్రమే ఈ డీల్‌పై సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన..

ఉద్యోగుల రాసిన లేఖలో అగర్వాల్‌ ట్విటర్‌ భవిష్యత్తు ‘అస్థిరంగా’ మారనుందని విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కీలక మార్పు ఉద్యోగులు, ట్విటర్‌ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందో అంచనా వేసుకోవాలని సిబ్బందితో చెప్పినట్లు తెలుస్తోంది. డీల్‌ పూర్తయ్యే వరకు ఉద్యోగుల స్టాక్‌ గ్రాంట్లకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒప్పందం అధికారికంగా పూర్తయిన తర్వాత ట్విటర్‌ పూర్తిగా ప్రైవేట్‌ కంపెనీగా మారనుందని టేలర్‌ తెలిపారు. బోర్డు రద్దవుతుందని పేర్కొన్నారు. 

పరాగ్‌ భవితవ్యం ఏంటి?

ఎలాన్‌ మస్క్‌ గతకొంతకాలంగా ట్విటర్‌ బోర్డుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే బోర్డు ఆయన కొనుగోలు వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ‘పాయిజన్‌ పిల్‌’ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. బోర్డు సభ్యుడిగా పరాగ్‌ అగర్వాల్‌ కూడా వీటన్నింటిలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఎడిట్‌ బటన్‌ ఉండాలా అని మస్క్‌ యూజర్లను అడిగిన ప్రశ్నకు కౌంటర్‌గా.. ఆచితూచి సమాధానం చెప్పాలని పరాగ్‌ హెచ్చరించారు. మరోవైపు ట్విటర్‌ సీఈఓగా పరాగ్‌ను నియమించినప్పుడు ఆయన్ని రష్యా నాయకుడు జోసెఫ్‌ స్టాలిన్‌తో మస్క్‌ పోల్చడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పరాగ్‌ ట్విటర్‌లో కొనసాగుతారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒప్పందం పూర్తయిన తర్వాత 12 నెలల్లోపు ఆయన్ను తొలగిస్తే 42 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. జాక్‌ డోర్సే స్థానంలో పరాగ్‌ గత ఏడాది నవంబరులో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన 30.4 మిలియన్‌ డాలర్లు పరిహారంగా పొందినట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీలో ఆయనకున్న ఇతర గ్రాంట్లు, బోనస్‌లు అన్నీ కలుపుకొని 42 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.321.78 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని