Income Tax: ఆదాయపు పన్ను రేట్లు తగ్గుతాయా?

నిరుద్యోగం పెరుగుతుండగా.. ఆదాయాల్లో వృద్ధి అంతగా ఉండటం లేదు. పైగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Published : 18 Jun 2024 03:42 IST

వినియోగాన్ని పెంచడం కోసమే
బడ్జెట్‌లో ప్రతిపాదనలుంటాయని ఆశాభావం

దిల్లీ: నిరుద్యోగం పెరుగుతుండగా.. ఆదాయాల్లో వృద్ధి అంతగా ఉండటం లేదు. పైగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శ్లాబులను సవరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వచ్చే నెలలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. నరేంద్రమోదీ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, భాజపా సొంతంగా సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఆర్థికంగా సాంత్వన చేకూరేలా తొలి బడ్జెట్‌లో కొన్ని ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 2023-24లో దేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధి చెందినా.. వినియోగ రంగంలో సగమే వృద్ధి కనిపించింది. ఎన్నికల తర్వాత ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు.. ‘మధ్యతరగతి పొదుపు మొత్తాలు పెరిగేలా, వారి జీవిత నాణ్యత మెరుగుపడేలా’ చూస్తామని నేతలు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పన్ను రేట్లలో కోత విధిస్తారని ప్రచారం జరుగుతోంది.  

రూ.10 లక్షల లోపు..: ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. కానీ, రూ.15 లక్షలకు మించితే 30% పన్ను చెల్లించాలి. రూ.10 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, కొత్త ఆదాయ పరిమితిని ప్రకటించే వీలూ కనిపిస్తోంది. రూ.5 లక్షల వార్షికాదాయానికి ఎలాంటి పన్నూ ఉండకుండా చూడాలని ప్రజలు కోరుతూనే ఉన్నారు.  వార్షికాదాయం రూ.20 లక్షలు మించితేనే 30% పన్ను శ్లాబు ఉండాలనే సూచనలూ ప్రభుత్వానికి అందాయి. రూ.5-10 లక్షల లోపు ఆదాయానికి 5%, రూ.10-20 లక్షల లోపు వారికి 20% పన్ను శ్లాబు వర్తింపచేయాలని కోరుతున్నారు. పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం కొంత తగ్గినా, వినియోగం పెరగడంతో పరోక్ష పన్నులు, జీఎస్‌టీ వసూళ్ల రూపేణ భర్తీ అవుతుందనే సూచనలూ ఉన్నాయి. ఇవి ఎంత మేరకు సాధ్యం అన్న విషయాన్నీ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి బడ్జెట్‌ చర్చలు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని