ELSSలో దీర్ఘ‌కాల పెట్టుబ‌డులు మంచి ఫ‌లితాల‌నిస్తాయా?

ఇది 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటుంది

Updated : 04 Jul 2022 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొదుపు చేయ‌డానికి సంప్రదాయ పొదుపు వేదికలైన బ్యాంకులు, పోస్టాఫీసులు మ‌న అంద‌రికీ తెలిసిన‌వే. కానీ ఇందులో వ‌డ్డీ రాబ‌డి త‌క్కువ వ‌స్తుంది. ఈ త‌క్కువ ఆదాయానికి ప‌రిమితిని బ‌ట్టి ఆదాయ ప‌న్ను కూడా ఉంటుంది. అదే  మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలైన ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్ స్కీమ్స్‌ (ELSS)లో మదుపు చేస్తే మార్కెట్‌కు అనుగుణంగా లాభాలుంటాయి అని మదుపరులు భావిస్తుంటారు. ఇది ఎంత వరకు నిజం? బ్యాంకులు, పోస్టాఫీసుల పొదుపుల‌కు రిస్క్ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ద్ర‌వ్యోల్బ‌ణానికి దాటి వ‌డ్డీ రాబ‌డులు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇందులో రావ‌డం లేదు.

ELSS అనేది మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కం. ఇందులో సెక్ష‌న్ 80సీ కింద పెట్టిన పెట్టుబ‌డికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి. అయితే ఇది 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి క‌లిగి ఉంటుంది. కాబట్టి, ఇందులో ఇతర ఫండ్స్ లాగా సిప్ చేసినట్టయితే ప్రతి సిప్ కి 3 ఏళ్ల లాక్ ఇన్ ఉంటుంది. మీరు 3 ఏళ్లు సిప్ చేసినట్టయితే, పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకోవడానికి 6 ఏళ్లు పట్టొచ్చు. కాబట్టి, ELSSలో మదుపు చేయాలనుకునే వారు ఏక‌ మొత్తాల‌ను పెట్టుబ‌డిగా పెట్టడం మంచిది.

ఉదాహ‌ర‌ణకు రాబ‌డి అంచ‌నా: మీ ప‌ద‌వీ విర‌మ‌ణ 20, 25 లేదా 30 సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న‌ట్ల‌యితే ప్ర‌తి సంవ‌త్స‌రం ELSSలో రూ.1 ల‌క్ష పెట్టుబ‌డి పెడితే, అది 12% వార్షిక వృద్ధిని సృష్టిస్తే సుమారుగా రూ. 80 ల‌క్ష‌లు, రూ. 1.50 కోట్లు, రూ. 2.70 కోట్ల నిధిని పై కాల వ్య‌వ‌ధుల అనంత‌రం సృష్టించే అవకాశం ఉంటుంది.

పైన తెలిపినది గత 3,5,10 ఏళ్ల రాబడి అయినప్పటికీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మార్పులు చెంది ఉండొచ్చు. పన్ను ఆదా కోసం మాత్రమే ఈ ఫండ్స్ లో మదుపు చేయడం సరైన పద్ధతి కాదు. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ పరిమితి లాంటివి అన్నీ దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు చేయాలి. ప్రతికూల మర్కెట్స్‌లో ELSS ఫండ్స్ లో నష్టాలు కూడా రావచ్చన్న విషయాన్ని గమనించండి. మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయాలనుకుంటే లార్జ్ కాప్ ఫండ్స్‌లో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడి కూడా స్థిరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని