Ukraine Crisis: రష్యాపై అమెరికా ఆంక్షలు.. పుతిన్‌ తగ్గేనా?

అమెరికా నేరుగా రష్యాపై కూడా కొన్ని ఆంక్షల బాణాల్ని ప్రయోగించింది.....

Published : 23 Feb 2022 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించిన రష్యాపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకుంది. ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం ద్వారా పుతిన్‌ను దారికి తేవాలని యోచిస్తోంది. రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లతో తమ దేశ పౌరులు, సంస్థలు ఎలాంటి వాణిజ్య సంబంధాలు నెరపకుండా అమెరికా ఇప్పటికే నిషేధం విధించింది. తాజాగా నేరుగా రష్యాపై కూడా కొన్ని ఆంక్షల బాణాల్ని ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రారంభమైందని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే.. మరిన్ని కఠిన చర్యలకు ఏమాత్రం వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు.

అధ్యక్షభవనం శ్వేతసౌధం వేదికగా మాట్లాడిన బైడెన్‌.. రష్యాలోని అతిపెద్ద ఆర్థిక సంస్థలైన వీఈబీ, ప్రోమ్‌స్వాజ్‌బ్యాంక్‌లను లక్ష్యంగా చేసుకొని ఆంక్షల్ని ప్రకటించారు. రష్యా ఆర్థిక వృద్ధి, రక్షణ ప్రాజెక్టులతో పాటు పుతిన్‌కు దగ్గరగా ఉండే దేశంలోని సంపన్నులు, వారి కుటుంబాలకు ఈ రెండు సంస్థలు మద్దతుగా ఉన్నాయి. అలాగే ఆ దేశ రుణ వనరులనూ బైడెన్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇకపై పాశ్యాత్య దేశాల నుంచి రుణరూపేణా రష్యాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందబోవని బైడెన్ స్పష్టం చేశారు. పడమటి దేశాల నుంచి నిధులు సమీకరించే హక్కు ఇకపై రష్యాకు లేదని తేల్చి చెప్పారు. అలాగే రుణం కింద అమెరికా, ఐరోపా మార్కెట్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేది లేదని పేర్కొన్నారు.

ఒకవేళ రష్యా తన దుందుడుకు వైఖరిని మరింత పెంచితే.. మరిన్ని కఠిన నిర్ణయాలకు అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్ హెచ్చరించారు. ‘‘సరళంగా చెప్పాలంటే.. ఉక్రెయిన్‌లోని ఓ పెద్ద భూభాగాన్ని వేరు చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. నా ఉద్దేశంలో మరింత భూభాగాన్ని బలవంతంగా తీసుకునేందుకు ఆయన (పుతిన్‌) దీన్ని ఆధారంగా చేసుకోనున్నారు. మరింత ఆక్రమణకు సిద్ధమవుతున్నారు. ఇది ఉక్రెయిన్‌పై దాడికి నాంది’’ అని బైడెన్‌ అన్నారు.

అయితే, రష్యాపై ఆంక్షల వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని బైడెన్‌ తెలిపారు. అమెరికా బాటలోనే జర్మనీ, బ్రిటన్‌ సహా ఇతర ఐరోపా దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆంక్షల ప్రభావమెంత...

రష్యాపై ఆంక్షల విషయంలో పాశ్చాత్య దేశాలు ఆచితూచి అడుగేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమిస్తే మరింత కఠినంగా వ్యవహరించేలా.. తాజా చర్యలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికా విధించిన ఆంక్షల వల్ల కేవలం రెండు బ్యాంకులు మాత్రమే ప్రభావితమవుతాయని తెలిపారు. అలాగే కేవలం ముగ్గురు సంపన్నులకు మాత్రమే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. పడమటి దేశాల నుంచి రుణాలు పొందడం నుంచి రష్యాను నిషేధించడం కొంత ఇబ్బందికరమే అయినప్పటికీ.. స్వల్ప కాలంలో రష్యాకు ఆ అవసరం రాకపోవచ్చునని తెలిపారు.

పైగా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న సమయంలోనూ ఈ తరహా ఆంక్షలు రష్యాపై విధించారని మరికొంత మంది విశ్లేషకులు గుర్తుచేశారు. అవి పుతిన్‌ను నిలువరించడంలో పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు. దేశ జీడీపీపై 2.5-3% మేర ప్రభావం పడినప్పటికీ.. పుతిన్‌ వైఖరి మారలేదని గుర్తుచేశారు. తర్వాత కాలంలో పాశ్చాత్య దేశాలే చప్పబడి సహజవాయు కోసం రష్యాతో వాణిజ్యం కొనసాగించాయని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పుతిన్‌ భావిస్తుండి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అప్పటి వరకు కావాల్సిన వనరుల్ని ఆయన ఇప్పటికే సిద్ధం చేసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. పైగా దేశంలో అంతర్గతంగానూ ఎలాంటి వ్యతిరేకతా వచ్చే అవకాశం లేదు. పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను, బడ్జెట్‌ను ఆయనే పర్యవేక్షిస్తుండడంతో ప్రశ్నించేవారు కూడా ఉండే అవకాశం లేదని అంచనా!

మరోవైపు రష్యా నుంచి సహజ వాయువు దిగుమతులను నిలిపివేస్తామని ఐరోపా దేశాలు ప్రకటించాయి. కానీ, దీని వల్ల ఆ దేశాలే ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. అయినా, వెనక్కుతగ్గేది లేదని ఈయూ దేశాలు అంటున్నప్పటికీ.. దీర్ఘకాలంలో ఇది సాధ్యం కాకపోవచ్చునని తెలుస్తోంది. రష్యన్‌ సహజ వాయువును జర్మనీకి తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌-2 గ్యాస్‌ పైపులైన్‌ను ఎక్కడికక్కడ నిలిపివేయాలని జర్మనీ ఇప్పటికే నిశ్చయించింది. కానీ, ఇది ఎంత కాలం కొనసాగిస్తారన్నదే అసలు ప్రశ్న! రష్యా బదులు అమెరికా, ఆస్ట్రేలియా, అల్జీరియా, ఖతర్‌ తదితర దేశాల నుంచి ద్రవరూప సహజవాయువు (ఎల్‌ఎన్జీ)ని దిగుమతి చేసుకొని ఇంధన కొరతను అధిగమించడమొక్కటే 27 దేశాల ఐరోపా సమాఖ్య (ఈయూ) ముందున్న తక్షణ ప్రత్యామ్నాయం. అయితే, ఇవన్నీ తాత్కాలికమే. పైగా.. ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం కూడా. రష్యాపై ఆధారపడటం మానేసి అమెరికాను నమ్ముకోవటం సమస్యకు పరిష్కారం కాబోదని వాతావరణ మార్పుల నిరోధక ఉద్యమకారిణి ఎలిఫ్‌ గుండజ్యెలి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కర్బన ఉద్గారాల తక్షణ కట్టడికి ఇది తోడ్పడబోదన్నారు.

పైగా రష్యా 640 బిలియన్‌ డాలర్ల భారీ కరెన్సీ రిజర్వును సిద్ధం చేసుకొంది. వీటిల్లో డాలర్ల శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకొన్నారు. దేశ కార్పొరేట్‌ రుణాలను రూబుల్స్‌లో ఉండేలా మార్పులు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే స్విఫ్ట్‌ నుంచి బహిష్కరిస్తే ఇబ్బంది లేకుండా సొంత నిర్వహణ ఏర్పాటు చేసుకొంది. దీంతోపాటు దిగుమతులను గణనీయంగా తగ్గించుకొని చాలా వాటిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇలా ఆంక్షల ప్రభావం లేకుండా పుతిన్‌ ముందే జాగ్రత్త పడ్డారు.

ఒకవేళ ఈ ఆంక్షల వల్ల పుతిన్‌ ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రభావం రష్యాపై ఉంటే.. ఆయన ప్రతిచర్యలకు దిగే అవకాశం లేకపోలేదని జియోపొలిటికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సైబర్‌ దాడుల రూపేణా ఐరోపా సమాఖ్య, అమెరికా దేశాలపై విరుచుకుపడి పరోక్షంగా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రష్యాను లక్ష్యంగా చేసుకునేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌ను వాడుకునేందుకు చూస్తున్నాయని పుతిన్‌ భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని నిలువరించేందుకు అవసరమైతే ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా రష్యా వెనుకాడబోదని విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని