Jack Dorsey: మళ్లీ ట్విటర్‌ సీఈఓగా చేస్తారా..? జాక్‌ డోర్సే సమాధానమిదే..!

ట్విటర్‌ సీఈఓగా ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే మళ్లీ బాధ్యతలు చేపడుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై డోర్సేను ప్రశ్నించగా.. ఆ అవకాశమే లేదని స్పష్టం చేశారు.

Updated : 17 Nov 2022 11:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ (Twitter)ను సొంతం చేసుకున్న కొన్ని గంటల్లోనే కంపెనీ సీఈఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇంటికి పంపించారు. అప్పటి నుంచి మూడు వారాలు గడుస్తున్నా కొత్త సీఈఓ నియామకం ఇంకా జరగలేదు. ఈ క్రమంలోనే ట్విటర్‌ సీఈఓగా ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే (Jack Dorsey) మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై డోర్సేను ప్రశ్నించగా.. ఆ అవకాశమే లేదని స్పష్టం చేశారు.

‘‘ట్విటర్‌ సీఈఓ పదవిని చేపట్టే అవకాశం వస్తే మీరు అంగీకరిస్తారా?’’ అని ఓ నెటిజన్‌ జాక్‌ డోర్సేను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. దీనికి ఆయన ‘లేదు’ అని తేల్చిచెప్పారు.  ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొనుగోలు చేసిన తర్వాత డోర్సే మళ్లీ సీఈఓ అయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా డోర్సే స్పందిస్తూ.. ‘‘మళ్లీ ఇంకెప్పుడూ సంస్థ సీఈవోగా ఉండను’’ అని స్పష్టంగా చెప్పారు.

ఈ ఏడాది ఆరంభంలో ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేస్తానని మస్క్‌ ప్రకటించినప్పుడు డోర్సే ఆయనకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ట్విటర్‌ (Twitter) యజమానిగా మస్క్‌ సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై డోర్సే బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా కంపెనీలో భారీ ఎత్తున ఉద్యోగాల కోత, ట్విటర్‌ ఫీచర్ల పేర్లు మార్పు వంటి అంశాల్లో మస్క్‌ను డోర్సే (Jack Dorsey) వ్యతిరేకించారు. కాగా.. 16 ఏళ్ల క్రితం సహ వ్యవస్థాపకుడిగా ట్విటర్‌ను ప్రారంభించిన డోర్సే.. గతేడాది నవంబరు నెలలో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగారు. అయితే, అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆ తర్వాత భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ ట్విటర్ సీఈఓగా నియమితులయ్యారు. కానీ, ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం పూర్తి అయిన కొద్ది గంటలకే మస్క్‌.. అతడిపై వేటు వేశారు. ఆయనను సీఈఓ పదవి నుంచి తప్పించారు.

సీఈఓగా ఉండాలనుకోవట్లేదు: మస్క్‌

మరోవైపు ట్విటర్‌ (Twitter) సీఈఓ పదవిని చేపట్టేందుకు మస్క్‌ (Elon Musk) కూడా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ సీఈఓగా తాను ఉండాలనుకోవట్లేదని మస్క్‌ డెలావర్‌ కోర్టుకు వెల్లడించారు. త్వరలోనే కొత్త సీఈఓను నియమిస్తానని పేర్కొన్నారు. ‘‘ట్విటర్‌తో నా సమయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాను. ఈ సంస్థను నడిపేందుకు మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాం’’ అని మస్క్‌ కోర్టుకు తెలియజేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు