Windfall tax: దేశీయ చమురుపై విండ్‌ఫాల్‌ పన్ను పునరుద్ధరణ

Windfall tax: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్‌ పన్నును మళ్లీ పునరుద్ధరించింది. టన్ను ముడి చమురు ఉత్పత్తిపై రూ.6,400 పన్నుగా నిర్ణయించింది.

Published : 19 Apr 2023 17:39 IST

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్‌ పన్ను (windfall profit tax)ను మళ్లీ పునరుద్ధరించింది. అదే సమయంలో డీజిల్‌పై ఎగుమతి పన్నును పూర్తిగా తొలగించింది.

టన్ను ముడి చమురుపై విండ్‌పాల్‌ పన్ను (windfall profit tax)ను రూ.6,400గా కేంద్రం నిర్ణయించింది. ఇది ఈరోజు నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. చివరిసారి ఏప్రిల్‌ 4న జరిగిన సమీక్షలో విండ్‌ఫాల్‌ పన్నును పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ పీపా ధర 75 డాలర్లకు దిగివచ్చింది. తిరిగి అది ఇప్పుడు దాదాపు 85 డాలర్లకు చేరువైంది. చమురు ఉత్పత్తిని తగ్గించాలనే ఒపెక్‌+ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మళ్లీ విండ్‌ఫాల్‌ పన్ను (windfall profit tax)ను పునరుద్ధరించింది.

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపైన, చమురు ఎగుమతులపై గతేడాది జులై 1 నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్‌ పన్ను (windfall profit tax) విధిస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి పన్నును సవరిస్తోంది. ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్‌ను కొత్తగా తీసుకొచ్చింది. అలాగే, గతేడాది ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించడం ద్వారా ఏర్పడిన లోటును ఈ పన్ను ద్వారా భర్తీ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వ వ్యూహంలో భాగం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని