Windfall tax: ‘ఎక్సైజ్‌’తో పోయింది.. ‘విండ్‌ఫాల్‌’తో వస్తోంది!

చమురు ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో.. ఎక్సైజ్‌ సుంకం కోత వల్ల కోల్పోతోన్న ఆదాయంలో దాదాపు మూడొంతులు సర్కార్‌ తిరిగి పొందనుంది....

Published : 03 Jul 2022 16:11 IST

దిల్లీ: ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెల ఆఖర్లో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీని వల్ల కేంద్రం భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతోంది. అయితే, తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై విధించిన పన్ను; చమురు ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో.. ఎక్సైజ్‌ సుంకం కోత వల్ల కోల్పోతోన్న ఆదాయంలో దాదాపు మూడొంతులు సర్కార్‌ తిరిగి పొందనుంది.

పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. పెట్రోల్‌, ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.13 ఎగుమతి సుంకం విధించామని, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై టన్నుకు రూ.23,250 చొప్పున విండ్‌ఫాల్‌ పన్ను కూడా వసూలు చేయనుంది.

గతేడాది దేశీయంగా వివిధ సంస్థలు 29 మిలియన్‌ టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేశాయి. ఈ లెక్కన చూస్తే, కొత్తగా విధించిన పన్ను వల్ల ప్రభుత్వానికి రూ.66,000 కోట్ల వార్షిక ఆదాయం జమకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న 9 నెలలకు కేంద్రం రూ.52,000 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. దీనికి ఎగుమతి పన్ను ద్వారా వచ్చే ఆదాయం అదనం.

భారత్‌ ఏప్రిల్‌, మే నెలల్లో 2.5 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌, 5.7 మిలియన్‌ టన్నుల డీజిల్‌, 7,97,000 టన్నుల ఏటీఎఫ్‌ ఎగుమతి చేసింది. తాజా పన్నుల వల్ల ఒకవేళ ఎగుమతులు మూడొంతులకు పడిపోయినా.. ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చమురు శుద్ధి కేంద్రం ఏటా 35.2 మిలియన్‌ టన్నుల చమురును ఎగుమతి చేస్తోంది. అదనపు పన్ను విధించినప్పటికీ.. రిలయన్స్‌ ఎగుమతులను కొనసాగించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వం మే 23న లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, లీటర్‌ డీజిల్‌ రూ.6 ఎగుమతి సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ ఏడాది మిగిలిన పది నెలల కాలానికి సర్కార్‌ రూ.84 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. అయితే, తాజాగా విధించిన అదనపు పన్నుల వల్ల 85 శాతం తిరిగి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని