Windows 11 Update: విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌.. మీ పనులన్నింటికీ ‘కోపైలట్‌’!

Windows 11 Update: Windows 11ను మైక్రోసాఫ్ట్‌ మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ఈ మేరకు కోపైలట్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఏఐ ఫీచర్లతో కూడిన అప్‌డేట్‌ను దశలవారీగా విడుదల చేస్తోంది.

Published : 27 Sep 2023 15:24 IST

Windows 11 Update: మైక్రోసాఫ్ట్‌ తమ విండోస్‌ 11కు అతిపెద్ద అప్‌డేట్‌ను ఇవ్వడం ప్రారంభించింది. కృత్రిమ మేధ ఆధారిత కోపైలట్‌ చాట్‌బాట్‌ సహా పెయింట్‌, స్నిప్పింగ్‌ టూల్‌, ఫొటోస్‌, ఆర్‌జీబీ లైటింగ్‌ సపోర్ట్‌, ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ వంటి అప్లికేషన్లకు ఏఐతో కూడిన అప్‌డేట్లను అందిస్తోంది. తాజా అప్‌డేట్‌లోని కీలక అంశాలేంటో చూద్దాం..

  • విండోస్‌ 11 అప్‌డేట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోపైలట్‌. దీంతో బింగ్‌ చాట్‌ తరహా ఫీచర్‌ను నేరుగా విండోస్‌ 11 డెస్క్‌టాప్‌కు తీసుకొస్తున్నారు. ఇది సైడ్‌బార్‌గా కనిపిస్తుంది. యాప్‌ల లాంచ్‌, పీసీ సెట్టింగ్‌ల నియంత్రణకు ఇది ఉపకరిస్తుంది. అలాగే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలూ ఇస్తుంది. విండోస్‌లోని ఇతర భాగాలకూ కోపైలట్‌ను అనుసంధానం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. మొత్తానికి ఏఐ ఆధారిత డిజిటల్‌ అసిస్టెంట్‌గా ఇది ఉపయోగపడుతుంది.
  • పెయింట్‌ యాప్‌ను సైతం ఏఐ ఆధారిత ఫీచర్లతో ఆధునికంగా తీర్చిదిద్దారు. బ్యాగ్రౌండ్‌ను తీసివేయడం, లేయర్స్‌ వంటి కొత్త ఫీచర్లను జత చేశారు. అలాగే జనరేటివ్‌ ఏఐతో కూడిన కోక్రియేటర్‌ ప్రివ్యూనూ పెయింట్‌లో అందించనున్నారు.
  • ఫొటోల ఎడిటింగ్‌ను అత్యంత సులువుగా మార్చేలా ఫొటోస్‌ యాప్‌ను సైతం ఏఐ ఆధారిత ఫీచర్లతో మెరుగుపర్చారు. బ్యాగ్రౌండ్‌ను బ్లర్‌ చేసి ఫొటోలోని సబ్జెక్ట్‌ని త్వరగా, సులభంగా గుర్తించేలా తీర్చిదిద్దారు. ఏఐ సాయంతో యాప్‌ స్వయంగా బ్యాగ్రౌండ్‌ను గుర్తిస్తుంది. ఒక్క క్లిక్‌తో తక్షణమే సబ్జెక్ట్‌ను హైలైట్ చేస్తుంది. బ్యాగ్రౌండ్‌ను బ్లర్‌గా మారుస్తుంది. OneDriveలో స్టోర్‌ చేసిన ఫొటోల శోధనను మరింత మెరుగుపర్చారు. ఫొటోలోని కంటెంట్ ఆధారంగా కావాల్సిన ఫొటోను త్వరగా కనుగొనవచ్చు. ఫొటోలు తీసిన ప్రదేశం ఆధారంగా కూడా కనిపెట్టొచ్చు.
  • స్నిప్పింగ్ టూల్ ఇకపై స్క్రీన్‌పై కంటెంట్‌ని కత్తిరించడానికి మరిన్ని మార్గాలను అందించనుంది. మరొక అప్లికేషన్‌లో కంటెంట్‌ను పేస్ట్ చేయడానికి ఇమేజ్ నుండి నిర్దిష్ట టెక్ట్స్‌ కంటెంట్‌ను కూడా కత్తిరించవచ్చు. కొత్తగా అందించబోయే ఆడియో, మైక్ సపోర్ట్‌ని ఉపయోగించి సౌండ్ క్యాప్చర్‌తో పాటు, స్క్రీన్ నుంచి ఆకట్టుకునే వీడియోలను సృష్టించవచ్చు.
  • నోట్‌ప్యాడ్ ఇకపై ఆటోమేటిక్‌గా మీ సెషన్‌ మొత్తాన్ని సేవ్‌ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం కలిగించే డైలాగ్‌ బాక్స్‌లు లేకుండా నోట్‌ప్యాడ్‌ను మూసివేయొచ్చు. తిరిగి ఓపెన్‌ చేసిన సమయంలో ఎక్కడైతే ఆపివేశారో అక్కడి నుంచే ప్రారంభించొచ్చు. గతంలో తెరిచిన ట్యాబ్‌లను నోట్‌ప్యాడ్‌ ఆటోమేటిక్‌గా ఓపెన్‌ చేస్తుంది. అలాగే ట్యాబ్‌లలో సేవ్ చేయని కంటెంట్‌ను ఉన్నది ఉన్నట్లు పునరుద్ధరిస్తుంది.
  • అప్‌డేటెడ్‌ Outlookతో, ఒకే యాప్‌లో వివిధ ఖాతాలను (Gmail, Yahoo, iCloud) కనెక్ట్ చేయవచ్చు. స్పష్టమైన, సంక్షిప్త ఇమెయిల్‌లను రాయడంలో ఏఐ ఆధారిత టూల్స్‌ సహాయపడతాయి. OneDrive నుంచి ముఖ్యమైన పత్రాలు, ఫొటోలను సజావుగా అటాచ్ చేయొచ్చు.
  • ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఆధునికీకరించిన ఎక్స్‌ప్లోరర్ హోమ్, అడ్రస్ బార్, సెర్చ్ బాక్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ సంబంధిత కంటెంట్‌ను మరింత సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. మీ ఫొటోల సేకరణను సులభంగా యాక్సెస్ చేయడానికి రూపొందించిన కొత్త గ్యాలరీ ఫీచర్‌ను జత చేశారు.
  • మరో విండోస్‌ 11 పీసీకి మారడాన్ని విండోస్‌ బ్యాకప్‌ మరింత సులభతరం చేస్తుంది. ఫైల్స్‌, యాప్స్‌, సెటింగ్‌లను తరలించేటప్పుడు ఏదైనా అవాంతరం తలెత్తితే.. ఎక్కడైతే ఆగిపోయిందో తిరగి అక్కడి నుంచే ప్రారంభమయ్యేలా విండోస్‌ 11ను అప్‌డేట్‌ చేశారు.

* విండోస్‌ 11 కొత్త అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్‌ సెప్టెంబర్‌ 26నే అధికారికంగా విడుదల చేసింది. అయితే, పైన తెలిపిన ఫీచర్లన్నీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. దశలవారీగా ఇవి యూజర్లకు లభించనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని