Work from Office: సోమవారం నుంచి ఆఫీస్‌కు రావాలి

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో.. ఆయా సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే పనిలో

Updated : 12 Sep 2021 20:03 IST

విప్రో ఉద్యోగులకు ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ పిలుపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో.. ఆయా సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ ‘విప్రో’.. తన ఉద్యోగులను సోమవారం నుంచి కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసులు పూర్తయినవారిని విధులకు అనుమతించనుంది. హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానంలో.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు ఆఫీస్‌ నుంచి పని చేయాలని సూచించింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘18 నెలల అనంతరం.. మా ఉద్యోగులు సోమవారం నుంచి వారానికి రెండు రోజులపాటు ఆఫీస్‌కు రానున్నారు. రెండు డోసుల టీకా పూర్తయినవారు.. సురక్షితంగా వచ్చి వెళ్లేలా, వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. కార్యాలయాల ప్రాంగణంలో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్‌ సేఫ్టీ ప్రొటోకాల్స్‌పై రూపొందించిన వీడియోనూ జతపరిచారు. జులైనాటికి విప్రో ఉద్యోగుల్లో దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రిషద్‌ ప్రేమ్‌జీ ఇటీవల నిర్వహించిన సంస్థ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ఈ సంస్థకు ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానంలో..

కరోనా వ్యాప్తి మొదలు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కార్యాలయాలకు పిలుస్తున్నాయి. మరోవైపు మూడో వేవ్‌ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో.. కొన్ని సంస్థలు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నాయి. మరికొన్ని హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ విధానంలో.. ఉద్యోగులు అవసరమైనప్పుడు ఆఫీస్‌ నుంచి లేదా ఇంటినుంచి పని చేసుకోవచ్చు. ఈ విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మరింత ఉద్యోగ కల్పనకు అవకాశం దక్కుతుందని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని