Wipro Q3 Results: విప్రో నికర లాభం రూ.3,050 కోట్లు

2022-23 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విప్రో శుక్రవారం ప్రకటించింది. నికర లాభం 2.8 శాతం పెరిగింది. ఆదాయం 14.4 శాతం ఎగబాకింది.

Published : 13 Jan 2023 18:21 IST

దిల్లీ: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (Q3 Results)లో స్థూల ఆదాయంలో 14.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో నికర లాభం 2.8 శాతం పెరిగింది. ఐటీ సేవల ద్వారా వచ్చే ఆదాయం 10.4 శాతం పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విప్రో (Wipro) వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

2022 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో విప్రో (Wipro) ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.23,229 కోట్లుగా నమోదైంది. నికర లాభం 2.8 శాతం పెరిగి రూ.3,050 కోట్లకు చేరింది. ఆపరేటింగ్‌ మార్జిన్లు 16.3 శాతంగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ఆదాయ అంచనాలను కంపెనీ 11.5- 12 శాతంగా పేర్కొంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2,59,179గా ఉన్న ఉద్యోగుల సంఖ్య డిసెంబరు ముగిసే నాటికి 2,58,744కి తగ్గింది. అదే సమయంలో త్రైమాసిక ప్రాతిపదికన వలసలరేటు (Attrition Rate) 23 శాతం నుంచి 21.2 శాతానికి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 22.7 శాతానికి కుంగింది.

ఫలితాలపై విప్రో (Wipro) సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ (Thierry Delaporte) స్పందిస్తూ.. ‘‘మరో త్రైమాసికంలోనూ విప్రో రెండంకెల ఆదాయ వృద్ధి నమోదు చేసిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మా మొత్తం బుకింగ్‌లు 4.3 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. 1 బిలియన్ డాలర్లు దాటిన భారీ ఒప్పందాల వల్లే ఇది సాధ్యమైంది. మా మార్జిన్‌లు 120 బేసిస్ పాయింట్లు మెరుగుపడ్డాయి. వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ ఉద్యోగుల వలసల రేటు నియంత్రణలోకి వచ్చింది. క్లయింట్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఒప్పందాలను ఖరారు చేసుకోవడం ద్వారా మార్కెట్‌లో మా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాం’’ అని అన్నారు.

విప్రో (Wipro) షేరు శుక్రవారం (2023 జనవరి 13)నాటి ట్రేడింగ్‌లో 0.25 శాతం లాభపడి రూ.395.50 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని