Rangarajan: అభివృద్ధి చెందిన దేశం కావాలంటే 20 ఏళ్లు: రంగరాజన్‌

RBI Ex chief on India growth: దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే మరో రెండు దశాబ్దాలు పడుతుందని ఆర్‌బీఐఊ మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌ అన్నారు.

Published : 24 Dec 2022 23:17 IST

హైదరాబాద్‌: భారత ప్రభుత్వం పదే పదే ప్రవచించే 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను స్వల్పకాలిక లక్ష్యంగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌ అభివర్ణించారు. దీన్ని అందుకోవాలంటే వృద్ధి మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తలసరి ఆదాయం పరంగా ఇప్పటికీ మధ్య ఆదాయ వర్గ దేశంగానే ఉన్నామని.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘పరిమాణం పరంగా దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇది చెప్పుకోదగ్గ పరిణామమే. అయినా, తలసరి ఆదాయం పరంగా ఐఎంఎఫ్‌ ర్యాంకుల్లో భారత్‌ ఇప్పటికీ 197 దేశాల్లో 142వ స్థానంలో ఉంది’’ అని రంగరాజన్‌ అన్నారు. స్వల్పకాలిక లక్ష్యమైన 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను అందుకోవాలంటే శాసన నిర్ణేతలు వృద్ధి బాట పట్టించడంపై దృష్టి సారించాలన్నారు. 9 శాతం వృద్ధితో ముందుకెళ్తే ఐదేళ్లకు సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

దేశ తలసరి ఆదాయం ప్రస్తుతం 3,472 డాలర్లుగా ఉందని, ఇప్పటికీ భారత్‌ అల్పాదాయ దేశంగానే పరిగణిస్తున్నారని రంగరాజన్‌ చెప్పారు. కాబట్టి దీర్ఘకాలానికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. తలసరి ఆదాయం 13,205 డాలర్లకు చేరినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా గుర్తిస్తారన్నారు. ఆ లెక్కన 8, 9 శాతం వృద్ధితో వెళితే సాధించడానికి 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దేశ భవిష్యత్‌ వృద్ధి కోసం స్పష్టమైన మార్గసూచీ రూపొందించాల్సిన అవసరం ఉందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని