టీకాల రవాణాకు డాక్టర్‌ రెడ్డీస్‌తో స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ భాగస్వామ్యం

‘స్పుత్నిక్‌ వి’ టీకాను నిర్దేశిత ఉష్ణోగ్రతలో రవాణా చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నియంత్రిత ఉష్ణోగ్రతా సదుపాయాలతో కూడిన శీతల గిడ్డంగులు ఉన్నాయి.

Updated : 13 May 2022 14:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘స్పుత్నిక్‌ వి’ టీకాను నిర్దేశిత ఉష్ణోగ్రతలో రవాణా చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో నియంత్రిత ఉష్ణోగ్రతా సదుపాయాలతో కూడిన శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేస్తామని స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ పేర్కొంది. స్పుత్నిక్‌ వి టీకాలను -20 నుంచి -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో రవాణా చేయాల్సి ఉంటుంది. తమకు మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం నిల్వ చేసే సామర్థ్యం ఉన్నట్లు స్నోమ్యాన్‌ వెల్లడించింది. ఈ సామర్థ్యంతో 65 కోట్ల డోసుల టీకా నిల్వ చేయవచ్చని వెల్లడించింది. 100 కోట్ల డోసుల టీకా నిల్వ చేయడానికి కావాల్సిన శీతల సదుపాయాలను తక్కువ సమయంలో సిద్ధం చేయగలమని వివరించింది. ఔషధ, ఇ-కామర్స్‌ రంగాల నుంచి నిల్వ, రవాణా సేవలకు గిరాకీ పెరిగినందున, రూ.425 కోట్లతో తన సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు స్నోమ్యాన్‌ లాజిస్టిక్స్‌ తెలియజేసింది.


సీబీడీటీ సభ్యులకు విభాగాల కేటాయింపు

దిల్లీ: కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సభ్యులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు గురువారం వెలువడ్డాయి. ఆదాయపు పన్ను విభాగానికి పరిపాలనా సంస్థ, విధానాలు రూపొందించే సీబీడీటీకి కొత్తగా ఏర్పడిన బోర్డులో ఛైర్మన్‌ జేబీ మహాపాత్ర మెంబర్‌ ఇన్వెస్టిగేషన్స్‌ బాధ్యతలను నిర్వహిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలో పని చేసే సీబీడీటీలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. సీబీడీటీ ఛైర్మన్‌గా కొనసాగుతూనే ముఖ్యమైన మెంబర్‌ ఇన్వెస్టిగేషన్స్‌ బాధ్యతలను మహాపాత్ర చూస్తారు. దేశ వ్యాప్తంగా పన్ను విభాగానికి ఉన్న విచారణ శాఖలు, ఇంటెలిజెన్స్‌, నేర దర్యాప్తు డైరెక్టరేట్‌లపై ఆయన పర్యవేక్షణ ఉంటుంది. గతంలో సీబీడీటీ ఛైర్మన్లుగా పని చేసిన పీసీ మోదీ, సుశీల్‌ చంద్ర కూడా తమ పదవీ కాలంలో మెంబర్‌ ఇన్వెస్టిగేషన్స్‌ను అదనంగా నిర్వహించారు. కొత్తగా నియమితులైన 1985 ఐఆర్‌ఎస్‌ అధికారి అనుజ సారంగికి అడ్మినిస్ట్రేషన్‌, ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ స్కీమ్‌ బాధ్యల్ని అప్పగించారు. మరో కొత్త సభ్యులు అను జె.సింగ్‌కు చట్టం, వ్యవస్థల బాధ్యతలు ఇచ్చారు. ఈమె కూడా 1985 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారే. ఈ నెల 7న ప్రారంభం కాబోతున్న ఇ-ఫైలింగ్‌ నూతన వెబ్‌సైట్‌ బాధ్యతల్నీ ఈమే చూసుకుంటున్నారు. ఇప్పటికే సీబీడీటీ సభ్యులుగా కొనసాగుతున్న ఎస్‌కే గుప్తా, కేఎం ప్రసాద్‌లు ఇది వరకు చూస్తున్న పన్ను చెల్లింపు సేవలు, ఆడిట్‌, జ్యుడిషియల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


సంక్షిప్తంగా..

* వచ్చే ఏడాది రూ.10 వేల కంటే తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రియల్‌మి వెల్లడించింది. ఇందుకోసం రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.
* 2025 నాటికి భారత్‌లో క్రియాశీల ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య 90 కోట్లకు చేరుకోవచ్చని ఇంటర్నెట్‌ కంపెనీల సమాఖ్య ఐఏఎంఏఐ నివేదిక వెల్లడించింది.
* జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోగానే దాని స్లాట్‌లు ఇతర విమానయాన సంస్థలకు ఇచ్చేశామని, ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించడం కుదరదని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) సమర్పించిన అఫిడవిట్‌లో పౌర విమానయాన శాఖ పేర్కొంది.
* ఐఎంఎఫ్‌లో మానవ వనరుల విభాగాధిపతిగా పని చేస్తున్న భారతీయ ఆర్థిక వేత్త కల్పనా కొచ్చర్‌ వచ్చే నెలలో పదవీ విరమణ పొంది, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌లో చేరబోతున్నట్లు సమాచారం.
* కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలను దేశానికి తీసుకొచ్చేందుకు ఫార్మా రంగంలోని అమెరికా అగ్ర శ్రేణి కంపెనీల సీఈఓలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.
* భారత నౌకాదళం, కోస్ట్‌ గార్డ్‌ కోసం 11 విమానాశ్రాయ నిఘా రాడార్లను కొనుగోలు చేసేందుకు మహీంద్రా టెలిఫోనిక్స్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
* కొత్త నియామకం జరిగే వరకు టెలికాం వివాదాల పరిష్కార, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌) ఛైర్మన్‌గా జస్టిస్‌ శివ కిర్తి సింగ్‌ కొనసాగుతారని సుప్రీం కోర్టు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని