పని ఇవ్వకుండా 20ఏళ్లుగా జీతం.. కంపెనీపై దావా వేసిన మహిళ..

పని అప్పజెప్పకుండా 20ఏళ్లుగా జీతం ఇస్తున్నారని ఓ మహిళ టెలికాం సంస్థపై దావా వేసింది. అనారోగ్య సమస్య కారణంగా వివక్ష చూపుతున్నారని పేర్కొంది.

Updated : 21 Jun 2024 21:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ టెలికాం సంస్థ ఆరెంజ్‌పై ఓ మహిళా ఉద్యోగి దావా వేసింది. 20 ఏళ్లుగా తనకు ఎలాంటి పని అప్పజెప్పట్లేదని పేర్కొంది. అయితే.. జీతం మాత్రం ఇస్తున్నారని తెలిపింది. తన అనారోగ్య పరిస్థితిపై వేధింపులు, చూపుతున్న వివక్ష కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త వెబ్‌సైట్‌ వెల్లడించింది.

వాసెన్‌హోవ్‌ అనే మహిళను ఫ్రాన్స్‌ టెలికాం సంస్థ 1993లో నియమించుకుంది. అనంతరం ఆ సంస్థను ఆరెంజ్‌ టేకోవర్‌ చేసింది. ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతోన్న విషయం ఆ టెలికాం సంస్థకు తెలుసు. దీంతో తగిన పోస్ట్‌లో నియమించుకుంది. తన ఆరోగ్యరీత్యా ఫ్రాన్స్‌లోని మరో ప్రాంతానికి బదిలీ చేయాలని కంపెనీని ఆమె అభ్యర్థించింది. అయితే.. సంస్థ ఎలాంటి సర్దుబాట్లు చేయలేదు. 

2002 నుంచి వాసెన్‌హోవ్‌కు ఎలాంటి పని ఇవ్వలేదు. క్రమం తప్పకుండా జీతం మాత్రం చెల్లిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని ఆ మహిళ అక్కడి ప్రభుత్వం, వివక్ష నిరోధక సంస్థల దృష్టికి తీసుకెళ్లింది. 2015లో మధ్యవర్తిని నియమించి సమస్యను పరిష్కరించాలని చూసినా ఫలితం లేకపోయింది. దీంతో తన ఆరోగ్య పరిస్థితి విషయంలో కార్యాలయంలో వేధింపులు, నైతిక వివక్ష చూపుతున్నారని నలుగురు మేనేజర్లపై ఫిర్యాదు చేసింది. మరోవైపు టెలికాం సంస్థ వాసెన్‌హోవ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాలని ప్రయత్నిస్తోందని మహిళ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

మొదలైన యాపిల్‌ స్కూల్‌ సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐమ్యాక్‌పై డిస్కౌంట్లు

ఏ పని చేయకుండా జీతం తీసుకోవడం గొప్ప విషయం కాదని వాసెన్‌హోవ్‌ చెబుతోంది. మరోవైపు ఆరెంజ్‌ సంస్థ మాత్రం ఆమెకు మంచి పని వాతావరణం కల్పించేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఎక్కువగా అనారోగ్య కారణాలతో సెలవుల్లో ఉండేదని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు