World Bank: భారత్‌ వృద్ధి అంచనాలు తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

World Bank growth forecast: ప్రైవేటు వినియోగం తగ్గడంతో భారత వృద్ధి నెమ్మదిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. గతంలో 6.6 శాతంగా ఉన్న వృద్ధి అంచనాలను 6.3 శాతానికి తగ్గించింది.

Updated : 04 Apr 2023 15:47 IST

దిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ (World Bank) తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) గానూ 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇదే ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతంగా అంచనా వేసింది. వినియోగంలో క్షీణత, బాహ్య పరిణామాలు వృద్ధి నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొంది. ‘‘రుణ రేట్లు పెరగడం, ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించడంతో  ప్రైవేటు వినిమయం తగ్గుముఖం పట్టనుంది. కొవిడ్‌ కాలంలో ప్రకటించిన ఆర్థిక మద్దతును క్రమంగా ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం వ్యయాలు కూడా నెమ్మదిగా వృద్ధి చెందనుంది’’ అని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌ 4.4 శాతం వృద్ధిని నమోదు చేయగా.. జనవరి-మార్చి త్రైమాసికంలో 6.3 శాతం మేర వృద్ధి కనబరిచింది. అయితే, 2024-26 మధ్య 7 శాతం సగటు వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించగా.. 6.4 శాతం నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 6 శాతమే ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ ఇటీవల వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని