Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా ఎన్నిక.. ప్రకటించిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు

ప్రపంచ బ్యాంక్‌ (World Bank) అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా (Ajay Banga) ఎన్నికయ్యారు. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు బంగా ఎన్నికపై ప్రకటన చేసింది.

Updated : 03 May 2023 22:48 IST

వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంక్‌ (World Bank) అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా (Ajay Banga) ఎన్నికయ్యారు. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు బంగాను నాలుగు గంటలపాటు ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ‘‘బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్‌ లక్ష్యాలను బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ఉన్న డేవిడ్ మాల్పాస్ జూన్ 1 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. జూన్‌ 2 నుంచి బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. బంగా ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడు-సీఈవోగా విధులు నిర్వర్తించారు. ఆయన వయసు 63 ఏళ్లు. 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని.. ఆయనను నామినేట్‌ చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని