World Cancer Day 2022: క్యాన్సర్‌ కవర్‌ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

ఫిబ్ర‌వ‌రి 4 ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వంగా వైద్యలు అనుస‌రిస్తున్నారు. వ్యాధి పట్ల ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 

Updated : 04 Feb 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానం. వైద్య నివేదిక‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా క్యాన్సర్‌ బారిన ప‌డుతున్నారు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల వంశ‌పారంప‌ర్యంగా వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నప్పటికీ జీవ‌న శైలిలో వ‌చ్చిన మార్పులే ఎక్కువ శాతం ఈ వ్యాధికి కార‌ణ‌వుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మన దేశం విషయానికొస్తే మొత్తం క్యాన్సర్‌ మరణాల్లో భారత్‌ వాటా 8 శాతంగా ఉంది. ఏటా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అనారోగ్యక‌ర‌మైన జీవన‌శైలి ఉన్న వారు ఆరోగ్యకరమైన జీవన శైలికి మారడంతో పాటు త‌గిన ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవాలి. అలాగే, కుటుంబ వైద్య చ‌రిత్రలో క్యాన్సర్‌ మూలాలు ఉన్నవారు కూడా క్యాన్సర్‌ సంబంధిత ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కొవిడ్-19పైనే ఎక్కువ‌గా దృష్టిపెడుతోంది. అందుకే సామాన్యుల ద‌గ్గర నుంచి కార్పొరేట్ సంస్థల వరకు కొవిడ్‌ను క‌వ‌ర్ చేసే ఆరోగ్య బీమా ప‌థ‌కాలను ఎంచుకుంటున్నారు. కొవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వాస్తవమే అయినా ఈ వ్యాధితో ఏటా సంభ‌వించే మ‌ర‌ణాలు.. క్యాన్సర్‌ వంటి అనారోగ్యాల కార‌ణంగా సంబంధించే మ‌ర‌ణాల కంటే త‌క్కువ‌నే చెప్పాలి. అందువ‌ల్ల క్యాన్సర్‌ పాల‌సీలపైన ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

క్యాన్సర్‌ బీమా ఎందుకు తీసుకోవాలి
ఆక‌స్మికంగా క్యాన్సర్‌ నిర్ధారణ అయితే వ్యక్తులు శారీరకంగా, మాన‌సికంగా బ‌ల‌హీన‌ప‌డ‌తారు. చికిత్సలకు అయ్యే ఖ‌ర్చుల కోసం ఆలోచించి మాన‌సిక ప్రశాంతతను కోల్పోతారు. ఇలాంటి ప‌రిస్థితిలో క్యాన్సర్‌ పాలసీలు సహాయపడతాయి. క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలకు అయ్యే ఖ‌ర్చుల‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా హామీని పెంచుతూ బీమా సంస్థలు నిర్దిష్ట పాలసీలను అభివృద్ధి చేశాయి. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్సకు అయ్యే ఖ‌ర్చుల‌ను సంపూర్ణంగా అందించ‌డంలో ఈ పాల‌సీలు స‌హాయ‌ప‌డ‌తాయి.

వైద్య ద్రవ్యోల్బణం
ప్రస్తుతం వైద్యానికి అయ్యే ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు కొన్ని సార్లు మొద‌టి ద‌శ‌లోనే వ్యాధిని గుర్తించినా, కొన్ని సార్లు తీవ్రస్థాయికి చేరే వ‌ర‌కు గుర్తించ‌లేక పోతున్నారు. ఒక్కో ద‌శ‌లోనూ ఒక్కో ర‌క‌మైన చికిత్స అవ‌స‌ర‌మ‌వుతుంది. కీమో థెరపీ, రేడియోథెరపీ, రక్తమార్పిడి వంటివి అవ‌స‌రం అవుతాయి. ఆసుప‌త్రిలో చేరాల్సి రావ‌చ్చు. ఇత‌ర వైద్య స‌దుపాయాలు అందించాల్సి రావ‌చ్చు. ద్రవ్యోల్బణం కార‌ణంగా వీటికి అయ్యే ఖ‌ర్చు భారీగా పెరిగింది. ఏ స్టేజ్‌లో క్యాన్సర్‌ను గుర్తించినా చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్‌ చేసే విధంగా పాలసీ ఉండాలి. క‌వ‌రేజ్‌ను ఎంచుకునే ముందు వైద్య ద్రవ్యోల్బణం ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. 

ఎలాంటి పాల‌సీని ఎంచుకోవాలి?
ఇందులో ముఖ్యంగా మూడు రకాల పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. 1. రెగ్యులర్‌ మెడిక్లెయిమ్ 2. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ 3. స్టాండ్ఎలోన్ క్యాన్సర్‌ ప్లాన్లు

రెగ్యులర్ మెడిక్లెయిమ్‌ ఇన్సూరెన్స్
పీఈటీ స్కాన్లు, ఎమ్ఆర్ఐ లేదా ఇత‌ర అత్యాధునిక‌ ఉప‌క‌ర‌ణాల‌ను ఉప‌యోగించి చేసే డ‌యాగ్నోస్టిక్స్‌, కీమోథెర‌పీ, రేడియేష‌న్ చికిత్సలు, చికిత్స పూర్తయిన తర్వాత తీసుకునే సంర‌క్షణ ఖర్చులను రెగ్యులర్‌ మెడిక్లెయిమ్‌ ఇన్సురెన్స్‌ కవర్‌ చేస్తుంది. ఓర‌ల్ కీమోథెర‌పీ, హార్మోన‌ల్ ట్రీట్‌మెంట్‌, సైబర్నైఫ్ చికిత్స, కొన్ని ర‌కాల చ‌ర్మ క్యాన్సర్లను కొన్ని పాల‌సీలు క‌వ‌ర్ చేయ‌వు. మెడీ క్లెయిమ్‌ ఇన్సూరెన్స్‌, క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా ఇత‌ర అనారోగ్యాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తుంది.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌
జీవిత బీమాకి అదనపు అనుబంధంగా 15 సంవత్సరాల క్రితం క్రిటికల్ ఇల్‌నెస్‌ పాల‌సీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అయితే, ఆరోగ్య బీమా సంస్థలు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ అవ‌స‌రాన్ని గుర్తించి అనేక స్టాండ్ఎలోన్ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీల‌ను రూపొందించాయి. ఈ పాల‌సీలు వ్యాధికి అయ్యే ఖ‌ర్చు మొత్తంతో సంబంధం లేకుండా ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని సంస్థలు చెల్లిస్తాయి. బీమా సంస్థల జాబితాలో ఉన్న క్యాన్సర్‌ లేదా ఇతర క్రిటిక‌ల్ ఇల్‌నెస్ వ్యాధులు నిర్ధారణ అయితే పాల‌సీ ప్రకారం నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పాల‌సీని కొనుగోలు చేసే నాటికి ఆరోగ్యంగా ఉండాలి. అవ‌స‌రం అయితే ఆరోగ్య ప‌రీక్షలు చేయించుకుని నివేదికలు బీమా సంస్థకు అందించాలి.

స్టాండ్ఎలోన్ క్యాన్సర్‌ ప్లాన్‌
ఇటీవ‌ల కాలంలో కొన్ని బీమా సంస్థలు స్టాండ్ఎలోన్ క్యాన్సర్‌ పాలసీలను అందిస్తున్నాయి. బీమా కొనుగోలు చేసిన వ్యక్తి క్యాన్సర్‌కు గురైనట్లు నిర్ధార‌ణ అయితే పాల‌సీ ప్రకారం హామీ మొత్తాన్ని చెల్లిస్తాయి. క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌, స్టాండ‌ర్డ్ మెడీ క్లెయిమ్ పాల‌సీల‌తో పోలిస్తే క్యాన్సర్‌ ప్రారంభ దశలో ఉన్నవారికి మెడిక‌ల్ ప‌రీక్షలు పూర్తి కాకుండానే చెల్లించే అవ‌కాశం ఉంటుంది. క్యాన్సర్‌తో సంబంధం లేని వ్యాధులు ఇప్పటికే ఉన్నవారు ఈ పాల‌సీని కొనుగోలు చేయొచ్చు. కొన్ని పాల‌సీల్లో క్యాన్సర్‌ను ప్రారంభ‌ ద‌శ‌లో గుర్తించిన నాటి నుంచి త‌రువాతి ప్రీమియంల‌ను చెల్లించాల్సిన అవసరం లేదు.

చివ‌రిగా..: ముందుగానే వ్యాధిని గుర్తించండం.. తగిన చికిత్స తీసుకోవ‌డం ద్వారా క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బ‌య‌టపడొచ్చు. ఇందుకు మాన‌సికంగా, శారీర‌కంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఉండాలి. దాంతోపాటు పైన పేర్కొన్న క్యాన్సర్‌ ప్లాన్ లేదా క్రిటికల్ ఇల్‌నెస్ ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని