2020లో ఆ ఇద్దరికీ సిరుల పంట!

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికాలో ప్రజల ఆర్థిక పరిస్థితి 2020లో ఛిన్నాభిన్నమైంది.

Published : 02 Jan 2021 10:47 IST

భారీగా పెరిగిన అగ్రరాజ్య కుబేరుల సంపద

వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికాలో ప్రజల ఆర్థిక పరిస్థితి 2020లో ఛిన్నాభిన్నమైంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వ ప్రయోజనాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మరోవైపు ఆ దేశ ధనవంతుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. 2020లో వారికి సిరుల పంట పండింది.

అమెరికాలోని బిలియనీర్లు 2020లో ఏకంగా ట్రిలియన్‌ డాలర్ల సంపదను తమ ఖాతాల్లో వేసుకున్నారు. దీనిలో దాదాపు ఐదో వంతు సంపద కేవలం ఇద్దరు వ్యక్తుల జేబుల్లోకే వెళ్లింది. అందులో ఒకరు అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ కాగా.. మరొకరు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌. 2020లో మస్క్‌ సంపద ఏకంగా నాలుగింతలైంది. ఒక్క ఏడాదిలోనే 132 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. ఇక బెజోస్‌ సంపద 70 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 186 బిలియన్‌ డాలర్లకు చేరింది. వీరివురి సంపద పెరుగుదలకు ముఖ్య కారణం వారి కంపెనీల షేర్ల ధరలు పెరగడమే. మస్క్‌ స్థాపించిన వాహన తయారీ సంస్థ టెస్లా షేర్లు 2020లో 800 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. షాంఘైలో భారీ వాహన తయారీ కేంద్రం ప్రారంభం కావడం, ప్రతి త్రైమాసికంలో కంపెనీ లాభాలు పెరగడం, 2021లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరగనుందన్న సంకేతాల వంటి పలు కారణాలు టెస్లా షేర్ల పరుగుకు కారణమయ్యాయి.

ఇక అమెజాన్‌ షేర్లు 2020లో 70 శాతం పెరిగాయి. షట్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఈ-కామర్స్‌ కొనుగోళ్ల వైపు మళ్లడం, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ తెచ్చి పెట్టిన లాభాలు అమెజాన్‌ షేర్ల ధర పెరుగుదలకు దోహదం చేశాయి. వీరివురు కుబేరులు కలిసి వారి నికర సంపదను ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నారు. ఇది 139 దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ సంపద లెక్కల పుస్తకాలకే పరిమితం. దాదాపు ఈ సంపదంతా స్టాక్‌ మార్కెటలో స్టాక్‌ల రూపంలో ఉంది. ఇదంతా డబ్బు రూపంలోకి మారాలంటే వారు ఈ షేర్లన్నింటినీ విక్రయించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. షేర్ల ధర తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సంపద తరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

ఇంకొంత కాలం ఇంటి నుంచే పని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు