Bernard Arnault: ప్రపంచ కుబేరుడి సంపదలో.. ఒక్కరోజే రూ.90వేల కోట్లు ఆవిరి

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రభావానికి ప్రపంచ కుబేరుల్లో (Billionaires) తొలిస్థానంలో ఉన్న బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపదలో ఒక్కరోజే రూ.90వేల కోట్లు ఆవిరైపోయాయి.

Updated : 24 May 2023 15:56 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి సంపన్నుల (Billionaires) ఆస్తుల విలువ ఒక్కోసారి తీవ్ర ఒడిదొడుకులకు లోనవడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపదలో ఒక్కరోజే అత్యధికంగా 11 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.90వేల కోట్లు) తుడిచి పెట్టుకుపోయాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం ముంగిట ఉందని.. దీంతో లగ్జరీ వస్తువులకు డిమాండ్‌ తగ్గనుందనే ఆందోళనల నేపథ్యంలో ఆ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడం ఇందుకు కారణమైంది.

ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ స్థాపించిన ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) కంపెనీ లగ్జరీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. వివిధ బ్రాండ్లతో ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు, షాంపేలు, అత్యంత ఖరీదైన గౌన్లతో సహా ఇతర వస్తువులను తయారు చేస్తుంది. ఈ యూరప్‌ లగ్జరీ బ్రాండ్లకు అమెరికాతోపాటు ఆసియా దేశాలు అతిపెద్ద మార్కెట్‌. ఎల్‌వీఎంహెచ్‌ 2022 నివేదిక ప్రకారం.. ఆ సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో అమెరికా వాటా 27శాతం కాగా ఆసియా వాటా 30శాతం. ఇటీవల ఇవి భారీగా పెరగడంతో 2023లో బెర్నార్డ్‌ సంపద కూడా భారీగా ఎగబాకింది. కేవలం గత సంవత్సర కాలంలోనే ఆ కంపెనీ వృద్ధిలో 25శాతం పెరుగుదల కనిపించింది.

అయితే, ఇటీవల అమెరికాలో మాంద్యం భయాలు నెలకొన్న వేళ.. అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రభావం లగ్జరీ బ్రాండ్‌లపై పడింది. దీంతో ఆ రంగంలోని కంపెనీల విలువ 30బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. వీటిలో అత్యధికంగా హెర్మెస్‌ ఇంటర్నేషనల్‌ 5.5శాతం నష్టపోగా. ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ కూడా సుమారు 5శాతం పడిపోయింది. ఫ్రెంచ్‌ లగ్జరీ సంస్థ కేరింగ్‌ ఎస్‌ఏ కూడా రెండుశాతం నష్టపోయింది. ఇలా లగ్జరీ బ్రాండ్ల షేర్ల పతనం అత్యంత కుబేరుడైన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌పై తీవ్రంగానే పడింది. ఆయన మొత్తం సంపదలో కేవలం ఒక్క రోజే 11బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. అయినప్పటికీ సుమారు 192 బిలియన్‌ డాలర్ల సంపదతో అత్యంత కుబేరుడి జాబితాలో తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. రెండోస్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌కు బెర్నార్డ్‌ సంపద మధ్య వ్యత్యాసం దాదాపు 12 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని