WPI inflation: 21 నెలల కనిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

WPI inflation declines In November: ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ చేస్తున్న పోరు సత్ఫలితాలనిస్తున్నట్లే కనిపిస్తోంది. మొన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి చేరగా.. తాజాగా టోకు ధరల ద్రవ్యోల్బణం సైతం దిగి వచ్చింది.

Published : 14 Dec 2022 14:42 IST

దిల్లీ: దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI inflation) దిగి వచ్చింది. 21 నెలల కనిష్ఠానికి చేరి నవంబర్‌ నెలలో (November WPI inflation) ఇది 5.85 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, చమురు, తయారీ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) బుధవారం టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలను వెల్లడించింది.

టోకు ధరల ఆధారిత సూచీ ద్రవ్యోల్బణం 19 నెలలుగా రెండంకెల సంఖ్య పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్‌లో ఇది తొలిసారి 8.39 శాతానికి తగ్గింది. గతేడాది నవంబర్‌లో 14.87 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా 5.85 శాతానికి చేరింది. గతేడాది ఫిబ్రవరిలో కనిష్ఠంగా 4.83 శాతం నమోదైన టోకు ధరల ద్రవ్యోల్బణం.. మళ్లీ ఇప్పుడు దాదాపు అదే స్థాయికి చేరడం ఊరటనిచ్చే అంశంగా మారింది. ఆహార పదార్థాలు, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, కెమికల్‌ ఉత్పత్తులు, కాగితం, కాగిత ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • ఇక గత నెల 8.33 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.07 శాతంగా నమోదైంది. కూరగాలయల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉండగా.. ఈ సారి 20.08 శాతం క్షీణత నమోదు చేశాయి. చమురు, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 17.35 శాతంగానూ, తయారీ ఉత్పత్తుల ధరలు 3.59 శాతంగానూ నమోదయ్యాయి.

సాధారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) గణాంకాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడయ్యాయి. అది కూడా 11 నెలల కనిష్ఠంగా ఆర్‌బీఐ లక్షిత స్థాయి (6 శాతం) దిగువకు చేరి 5.88 శాతంగా నమోదైంది. మరోవైపు రెపో రేట్ల విషయంలో ఇప్పటి వరకు దూకుడుగా వ్యవహరించిన ఆర్‌బీఐ.. ఫిబ్రవరి నెలలో మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు