WPI inflation: జులైలో తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం

WPI inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జులైలో కాస్త తగ్గుముఖం పట్టింది.

Published : 16 Aug 2022 13:47 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI inflation) కాస్త శాంతించింది. ఆహార పదార్థాల ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో జులైలో ఇది 13.93 శాతంగా నమోదైంది. జూన్‌లో ఈ ద్రవ్యోల్బణం 15.18 శాతంగా నమోదైంది. గతేడాది జులైలో టోకు ధరల ద్రవ్యోల్బణం 11.57 శాతం మాత్రమే. ఈ ఏడాది మేలో గరిష్ఠంగా 15.88 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం వరుసగా ఇది రెండోసారి కావడం ఊరట కల్పించే అంశం కాగా.. గతేడాది ఏప్రిల్‌ నుంచి వరుసగా 16వ నెల కూడా రెండంకెల పైనే ఉంటుండడం గమనార్హం. 

ఇక ఆహార పదార్థాల ధరలు జూన్‌తో పోల్చినప్పుడు 14.39 శాతం నుంచి 10.77 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు సైతం 56.75 నుంచి 18.25 శాతానికి తగ్గాయి. చమురు, ఇంధర ధరలు మాత్రం 40.38 నుంచి 43.75 శాతానికి పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ధరలు 8.16 శాతం పెరగ్గా.. నూనె గింజలు 4.06 శాతం మేర క్షీణించినట్లు కేంద్ర గణాంక కార్యాలయం పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతంగా నమదైనట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

సాధారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల మూడుసార్లు రెపో రేట్లను ఆర్‌బీఐ పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని